జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం (ఎన్‌డీహెచ్‌ఎం)లో భాగంగా ప్రతి భారత పౌరుడికీ 14 అంకెల జాతీయ డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ఐడీ)ను అందించనున్నట్లు ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ఐడీతోపాటు పౌరుల ఆరోగ్య వివరాలను డిజిటల్ రికార్డు రూపంలో పొందుపరుస్తారు. జాతీయ స్థాయిలో వైద్యులు, ఆస్పత్రుల వివరాల పట్టికను రూపొందిస్తారు. మున్ముందు టెలీమెడిసిన్, ఈ-ఫార్మసీ సదుపాయాలు కూడా ఎన్‌డీహెచ్‌ఎం పరిధిలోకి వస్తాయి. 138 కోట్ల భారతీయుల ఆరోగ్య వివరాలను ఒకే జాతీయ సమాచార నిధిలో భద్రపరచడం వల్ల మున్ముందు కొవిడ్ వంటి మహమ్మారులను వేగంగా అరికట్టడం వీలవుతుంది. జనబాహుళ్యంలో క్యాన్సర్, హృద్రోగం వంటి దీర్ఘకాల వ్యాధుల ఛాయలను ముందే పసిగట్టగలగడంతో చికిత్స ఖర్చులు తగ్గుతాయి. వైద్య పరిశోధనలు ఊపందుకోవడానికి, తద్వారా కొత్త మందులు, కొత్త చికిత్సలను కనుగొనడానికీ ఈ డిజిటల్ సమాచార నిధి ప్రాతిపదికగా నిలుస్తుంది. శీఘ్రంగా సమర్థంగా ప్రజారోగ్య సేవలు అందించడం సులువు అవుతుంది. వైద్య రంగంలో విప్లవానికి నాంది పలికే సత్తా డిజిటలీకరణకు ఉంది. అందుకే భారతదేశం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకాన్ని ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఎన్‌డీహెచ్‌ఎం పూర్తిస్థాయిలో ప్రారంభం కాగానే సంబంధిత వెబ్‌సైట్‌లో 14 అంకెల డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ఐడీ)ను పొందవచ్ఛు ఇంత సుదీర్ఘ సంఖ్యను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, ఈమెయిల్ తరహాలో నచ్చిన ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించుకొనే సౌకర్యం లభిస్తుంది. ఏదైనా ఆస్పత్రిలో కూడా ఈ డిజిటల్ ఐడీని పొందవచ్ఛు ఇక అన్ని ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు ఎన్‌డీహెచ్‌ఎం కిందకు వస్తాయి.
ప్రైవేటు భాగస్వామ్యం అత్యవసరం
ఎన్‌డీహెచ్‌ఎం ఓ బృహత్తర కార్యక్రమం అనడంలో సందేహం లేదు. అయితే, దానికి కేటాయించిన రూ.144 కోట్ల నిధులు ఏ మాత్రం చాలవని చెప్పవచ్ఛు ఇప్పటికే కరోనా తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి పెట్టినందువల్ల ప్రైవేటు భాగస్వామ్యం అవసరపడుతుంది. ఎన్‌డీహెచ్‌ఎం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను, లేబరేటరీలను, బీమా సంస్థలు, ఔషధ దుకాణాలు, టెలీమెడిసిన్ సేవలను సమన్వయపరుస్తుంది. ఇది ప్రైవేటు రంగానికి, వెంచర్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయం కానుంది. ఇప్పటికే అమెజాన్ సంస్థ బెంగళూరులో అమెజాన్ ఫార్మసీ పేరిట ఈ-ఫార్మసీ రంగంలో ప్రవేశించగా, రిలయన్స్ సంస్థ నెట్‌మెడ్స్ సంస్థలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసింది.
ఈ-ఫార్మసీ సంస్థలు ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్ విలీనమవుతున్నాయి. వాల్‌మార్ట్ -ఫ్లిప్‌కార్ట్ కూడా ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలోకి ప్రవేశించనున్నాయి. టెలీమెడిసిన్ రంగంలో ఇప్పటికే ప్రాక్టో, లైబ్రేట్, 1ఎంజి వంటి సంస్థలు దూసుకుపోతుండగా- అపోలో, అమృత వంటి ఆస్పత్రులు కూడా టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి ఉదంతంతో ప్రపంచమంతటా టెలీమెడిసిన్ సంస్థల్లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. చైనాలో మియావ్ షావో డాక్టర్స్ ప్లాట్‌ఫారానికి 84 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరాయి. ఈ సంస్థ ఆన్‌లైన్ ఆస్పత్రి, యాప్‌ల ద్వారా వైద్య సలహాలు, మందులు, ఆరోగ్య బీమా సౌకర్యాలను అందిస్తోంది. రష్యాలో బెస్ట్ డాక్టర్ అంతర్జాల వేదిక, అమెరికాలో గ్యాంట్ అనే ప్లాట్‌ఫారం ఈ తరహా సదుపాయాలను అందిస్తున్నాయి. ఎన్‌డీహెచ్‌ఎం పథకం వల్ల భారత్‌లోనూ ప్రభుత్వ, ప్రైవేటు టెలీమెడిసిన్ వేదికలు ఊపందుకోనున్నాయి.
ఎన్‌డీహెచ్‌ఎం పథకంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే వెసులుబాటు ఉంటుంది కానీ, మున్ముందు ప్రభుత్వ ఆరోగ్య సేవలు పొందాలంటే మాత్రం తప్పనిసరిగా అందులో చేరాల్సి రావచ్ఛు క్రమేణా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సర్వర్లలో, వైద్యుల కంప్యూటర్లలో పోగుపడే పౌరుల ఆరోగ్య సమాచార వివరాలతో జాతీయ సమాచార రాశి రూపుదిద్దుకొంటుంది. వివిధ ఆస్పత్రుల్లో కాగితపు దస్త్రాల రూపంలో పోగుపడి ఉన్న ఆరోగ్య రికార్డులను కూడా డిజిటలీకరించి, ఈ విస్తృత సమాచార రాశిలో అంతర్భాగం చేయాలని జాతీయ ఆరోగ్య సంరక్షకుల సంఘం (ఎన్‌హెచ్‌ఏ) యోచిస్తోంది.