దేశ ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవంగా అభివర్ణిస్తూ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్‌డీహెచ్‌ఎం)కు మోదీ ప్రభుత్వం జెండా పండగనాడు శ్రీకారం చుట్టింది. సరైన వైద్యుల ఎంపిక, డాక్టర్ల అపాయింట్‌మెంట్ కోరడం, రుసుముల చెల్లింపు, పదే పదే పాత రికార్డుల్ని చంకన పెట్టుకొని వెళ్ళడం వంటి బాదరబందీలనుంచి ఎన్‌డీహెచ్‌ఎం రోగులకు స్వేచ్ఛ ప్రసాదిస్తుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతున్నా- సక్రమంగా పట్టాలకెక్కితే ఈ ఆరోగ్య గుర్తింపు కార్డు పథకం మరెంతో ప్రభావాన్వితమైనది. 2017నాటి జాతీయ ఆరోగ్య విధానం- సాంకేతిక పరిజ్ఞానమే వెన్నుదన్నుగా ఆరోగ్యరంగ వ్యవస్థను సాంతం డిజిటలీకరించాలని ప్రతిపాదించింది. ఆయుష్మాన్ భారత్‌ను కేంద్రం ప్రారంభించినందున రేపటి అవసరాలకు దీటైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అవసరం మరింతగా పెరిగిందంటూ నీతి ఆయోగ్ 2018లో ‘నేషనల్ హెల్త్ స్టాక్’ పేరిట దార్శనిక పత్రం వెలువరించింది దాని వెన్నంటి నిరుడు జులైలో విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఛైర్మన్ సారథ్యంలోని కమిటీ ఖరారు చేసిన విధివిధానాల మేరకే ఎన్‌డీహెచ్‌ఎం ఏర్పాటైంది.
డిజిటలీకరించడం...
వ్యక్తుల సంపూర్ణ ఆరోగ్య సమాచారాన్ని డిజిటలీకరించడం, ఎక్కడైనా ఎప్పుడైనా రోగి సమ్మతితో వైద్యులకు అది అందుబాటులోకి వచ్చేలా చూడటం, మందుల షాపులు, లేబొరేటరీలు, రేడియాలజీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, బీమా సంస్థల వంటి క్రియాశీల విభాగాలన్నింటికీ చోటుపెట్టి వ్యక్తిగత ఆరోగ్య కార్డు పరిపుష్టమయ్యేలా నెట్‌వర్క్‌ను పునాది స్థాయినుంచి పటిష్ఠంగా నిర్మించడం- అదో బృహత్ యత్నం. ఆధార్ కార్డు మాదిరిగానే దీన్నీ విజయవంతం చెయ్యాలనుకొన్నా- ఎక్కడికక్కడ సమాచారాన్ని అప్‌లోడ్ చేసే ఆపరేటర్లకు బాధ్యతాయుత శిక్షణ మొదలు, వ్యక్తిగత గోప్యత పరిరక్షణ దాకా భిన్నస్థాయుల్లో అధిగమించాల్సిన ప్రతిబంధకాలు అనేకం. నేడు కేంద్రపాలిత ప్రాంతాలతో మొదలై 2022నాటికి దేశవ్యాప్తం చెయ్యాలనుకొంటున్న హెల్త్ కార్డుల పథకం జనశ్రేయస్సాధకం కావాలంటే- మౌలిక సేవల మెరుగుదలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి!