డిజిటల్ పన్నులు వివిధ దేశాల మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. అమెరికాలో వ్యాపారం చేసే భారత కంపెనీలకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ జీఎస్‌పీ మినహాయింపులను తొలగించారు. అదే అమెరికా కంపెనీలు భారత్‌లో వ్యాపారం చేసి పన్ను చెల్లించకపోతే మాత్రం ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంటోంది ఆయన వైఖరి. ఫ్రాన్స్‌వంటి దేశాలు నిర్మొహమాటంగా అమెరికా డిజిటల్ కంపెనీల ముక్కుపిండి పన్ను వసూలు చేయడంతో భారత్‌సహా దాదాపు 10 దేశాలు అదే బాట పట్టాయి. డిజిటల్ యుగంలో భౌతికంగా ఆయా దేశాల్లోనే ఉంటూ వ్యాపారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో డిజిటల్ రంగ సంస్థలు పలు దేశాల్లో అనుబంధ సంస్థలను సృష్టించి వాటి నుంచి పొందుతున్న సేవలకు గాను చెల్లింపుల రూపంలో భారీ ఖర్చు చూపించి వ్యాపారం చేసిన దేశాల్లో లాభాలను కప్పిపుచ్చుతున్నట్లు తేలింది. తమ భౌతిక కార్యాలయాలను పన్ను స్వర్గధామాల్లో ఏర్పాటు చేసి భారీగా సొమ్మును మిగుల్చుకొంటున్నాయి. గతంలో అమెరికాకు చెందిన ఒక డిజిటల్ దిగ్గజ సంస్థ అయిదేళ్లలో భారత్ నుంచి ఈ రకంగా రూ.16,119 కోట్లు సింగపూర్, ఐర్లాండ్‌లకు తరలించినట్లు సమాచారం. 2016లో యాపిల్ సంస్థ కూడా తమ లాభాలపై ఐరోపా దేశాల్లో పన్ను లబ్ధి కోసం ఐర్లాండ్‌కు తరలించింది. దీనిపై మండిపడ్డ ఐరోపా కమిషన్ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఫ్రాన్స్ గత జులైలో విదేశీ ఈ-కామర్స్ సంస్థల వ్యాపారంపై మూడు శాతం పన్నులు చెల్లించాలని పేర్కొంది. భారత్ సహా యూకే, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రెజిల్, చెక్‌రిపబ్లిక్, ఇండొనేసియాలు పన్నుల కొరడాను ఝళిపించాయి.
భారీగా ఆర్జన
భారత్‌లో డిజిటల్ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు ఏడాదికి లక్ష రూపాయల విలువ దాటి ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను విధించింది. ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మూలం వద్దే పన్ను కోతలా పనిచేస్తుంది. ఈ రకంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.900 కోట్లు వసూలు చేసింది. ‘ఈ-కామర్స్’ సంస్థలు భారత్‌లో వేళ్లూనుకుని చిరు వ్యాపారుల వాటాను లాక్కోవడంతో దేశీయ వర్తకుల నుంచి వచ్చే పన్నులు తగ్గాయి. దీంతో ప్రభుత్వం ‘ఈ-కామర్స్’ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై ఏప్రిల్ నుంచి రెండు శాతం పన్ను వేసింది.