కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉన్నా- పలు రాష్ట్రాల్లో వ్యాధి నిర్ధరణ పరీక్షలు తగ్గుతున్నాయి. దేశ జనాభాలో ఇప్పటిదాకా కేవలం రెండు శాతానికే కరోనా సోకిందని చెబుతున్న కేంద్రం, మిగతా 98 శాతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పరీక్ష(corona test) ల సంఖ్యను తగ్గిస్తూ వెళితే, క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా తెలుస్తాయి? పరిస్థితి నిజంగానే అదుపులోకి వస్తోందా లేదా ఏ ప్రాతిపదికపై నిర్ధరిస్తారు? ఇప్పటికే కొరత కారణంగా టీకాలేసే వేగం మందగించిన నేపథ్యంలో కరోనా రెండో దశ(second wave) విజృంభణకు బాగా ప్రభావితమైన కొన్ని రాష్ట్రాల్లో పక్షం రోజులుగా పరీక్షలూ తగ్గిపోతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొవిడ్‌తో తీవ్రంగా సతమతమవుతున్న కర్ణాటక(karnataka)లో మే నెల నాలుగు నుంచి పదిహేడో తేదీ మధ్య పరీక్షల సంఖ్య 4.8 లక్షల నమూనాలకు తగ్గింది.
ఇదే సమయంలో గుజరాత్‌లో 3.7 లక్షలు, మహారాష్ట్రలో 2.6 లక్షలు, తెలంగాణలో 1.8 లక్షల మేరకు పరీక్షల్లో తరుగుదల కనిపించింది. అత్యధికంగా 22-23 శాతం పాజిటివిటీ రేటుతో విలవిల్లాడుతున్న ఉత్తరాఖండ్, రాజస్థాన్ సైతం పరీక్షల్ని లక్షదాకా కుదించాయి. దిల్లీలో ప్రతి వంద పరీక్షల్లో 18 పాజిటివ్‌గా తేలుతున్నా యాభైవేలకుపైగా పరీక్షలు తగ్గాయి. పరీక్షలు తక్కువ సంఖ్యలో చేపట్టడం వల్ల- ఏ స్థాయిలో ఏర్పాట్లు చేయాలనే విషయంలో యంత్రాంగానికి ప్రాథమిక అవగాహన ఏర్పడటం కష్టమవుతుంది. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సన్నద్ధత సైతం తగ్గే ప్రమాదమూ ఉంది!
ఫస్ట్ వేవ్‌లో ప్రజల ఇబ్బందులు..
నిరుడు తొలి ఉద్ధృతి రోజుల్లో చాలినన్ని కిట్లు లేక, పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు రెండో దశ వెల్లువెత్తుతున్న తరుణంలోనూ కరోనా పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో బారులు తీరిన జనం కనిపిస్తూనే ఉన్నారు. ఏడాది కాల వ్యవధిలో పరీక్ష కిట్లను సైతం చాలినంతగా సిద్ధం చేసి, సర్కారీ దవాఖానాలకు విస్తృతంగా పంపిణీ చేయలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడంలో పాలకుల ఉదాసీనతే ఇప్పుడు ప్రజలకు శాపమవుతోంది. ఈ రంగంలోని అంకురాల్ని పరిశోధనల దిశగా ప్రోత్సహించి, సరళమైన పద్ధతుల్లో పరీక్షలు చేసే కిట్లు, స్వీయపరీక్ష కిట్ల తయారీకి ప్రోత్సాహం, మార్గదర్శనం అందించి ఉండాల్సింది. దేశీయంగా కరోనా పరీక్ష కిట్లను చవకగా, పెద్ద సంఖ్యలో తయారు చేసి ఉంటే, ప్రైవేటు ప్రయోగశాలల్లోని పరీక్షల ధరలూ దిగివచ్చేవి. ఇందుకోసం ప్రభుత్వం విధానపరమైన అండనిస్తూ, భారీగా పెట్టుబడులు సమకూర్చి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఉండాల్సింది. కరోనా పరీక్షల కోసం ప్రైవేటు ప్రయోగశాలలు(laboratory) వసూలు చేస్తున్న రుసుముల తాకిడిని తట్టుకోలేక, ప్రభుత్వ కేంద్రాలను ఆశ్రయిస్తే, ఎప్పుడు చేస్తారో, ఎక్కడ చేస్తారో తెలియని గందరగోళం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంకోవైపు, కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన ప్రామాణికతా ప్రశ్నార్థకంగానే ఉంటోంది. ఎన్నో పాజిటివ్ కేసులు పరీక్షల్లో బయటపడకపోవడంతో బాధితులు బయట తిరిగేస్తూ, వైరస్ వ్యాప్తికి(virus spread) కారకులవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉద్ధృతిలో వైరస్ బారిన పడిన వారికి సంబంధించిన వాస్తవిక సంఖ్య ఎంతమేర ఉందనేది గుర్తించడం, ఏయే ప్రాంతాలు వ్యాధికి హాట్‌స్పాట్లుగా మారాయనే వివరాలను తెలుసుకోవడం తదితరాల్లో అధికార యంత్రాంగం అలక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.