భయం దిగులును, బాధను, దుఃఖాన్ని, పిరికితనాన్ని కర్తవ్యవిమూఢతను పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. అన్నింటినీ మించిన భయం- మరణభయం. ఎంత వయసు మీరినా తానింకా బతకాలనే అనుకుంటాడు మనిషి. అయితే భయం క్షణం క్షణం మరణాన్ని చవిచూపిస్తుంది. సుఖాన్ని, శాంతిని, తృప్తిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. ఉన్నది పోతుందేమో అని ఒకడికి భయమైతే, రావలసింది రాదేమోనన్న భయం మరొకడికి. ఇంటిగుట్టు రట్టయి పరువు పోతుందేమోనన్న భయం ఇంకొకడికి. తన సంపదను దోచుకుపోతారేమోనన్న భయం వేరొకడికి. భయాలు ఎన్నయినా వాటిని దూరం చేయగలిగేది వైరాగ్యం ఒక్కటేనని భర్తృహరి ఏనాడో చెప్పాడు.
వేగంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదికి ఓ పర్వతమో, చెట్టో అడ్డం వస్తే ప్రవాహం అక్కడే ఆగుతుందా? పక్కదార్లు చూసుకొని పల్లంవైపు ప్రవహిస్తూ ముందుకెళ్లిపోతూనే ఉంటుంది. మనిషికీ అలాగే ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రాన మనిషి బెంబేలెత్తి పోకూడదు. భయపడి కుంగిపోకూడదు. భయమనే వరదకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యమనే ఆనకట్టను నిర్మించుకోవాలి అంటారు స్వామి వివేకానంద. భయంతో ఏ పనినీ సాధించలేం. స్థితప్రజ్ఞ, నిగ్రహం, ఓర్పుతోనే ఎంతటి సమస్యనైనా అధిగమించగలం. పరిస్థితులు ఎంతటి విపత్కరమైనా, అప్రమత్తులమై అవగాహనతో మనం మనలా మనోధైర్యంతో ముందుకు సాగడమే పరమ కర్తవ్యం.
ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక చింతన తోడైతే మనిషికి సర్వత్రా విజయం తథ్యం. భయం అనే వ్యాధికి దివ్యౌషధం భక్తి మాత్రమే. భయం కలిగించేది, తొలగించేది శ్రీమన్నారాయణమూర్తే అని విష్ణు సహస్రనామం చెబుతోంది. భక్తికి వశమయ్యేది, భయాన్ని పారదోలేది పరమేశ్వరి అని లలితా సహస్రనామం చెబుతోంది. ప్రహ్లాదుడు, రామదాసు, మీరాబాయి ఎన్ని శిక్షలు అనుభవించారు! నిర్భీతితో పరమాత్మ నామస్మరణతో అవలీలగా ఆ అవరోధాలన్నీ అధిగమించి సద్గుతులు పొందారు.
భక్తిలో ఆర్తి ఉంటుంది. వేదన ఉంటుంది. వినమ్రత ఉంటుంది. శరణాగతి ఉంటుంది. ఆత్మసమర్పణ భావం ఉంటుంది. మనిషికి జీవితంలో భక్తి ఒక్కటే తరణోపాయం. అందుకు నామస్మరణే ప్రథమ సాధనం. నామస్మరణ భయాలన్నింటినీ ఇట్టే తెంచివేయగల అమోఘ సాధనం.