చట్టసభల సభ్యులను సంతలో సరకులుగా దిగజారుస్తూ, కోట్లు గుమ్మరించి అధికారాన్ని కొనుక్కోవడం- ఎటువంటి రాజనీతి? ప్రజాతీర్పులకు పూచికపుల్లపాటి విలువైనా ఇవ్వకుండా, ఎన్నికైన ప్రభుత్వాలను సామదాన భేద దండోపాయాలతో పడగొట్టడం- ప్రజాస్వామ్య పునాదుల పెళ్లగింపు కాక మరేమిటి? ఆ శీలహీన రాజకీయాల నగ్ననృత్యాలకు దురదృష్టవశాత్తు ఆసేతుహిమాచలం దశాబ్దాలుగా వేదికవుతోంది. జాతిభవితకు పెనుప్రమాదకరమైన ఆ పరిస్థితికి పాలుపోస్తూ- తమ ఎమ్మెల్యేలకు భాజపా ఎర వేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. దిల్లీ, పంజాబ్‌లలో తమ శాసనసభ్యులకు కమలదళం గాలమేసిందని 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల గళమెత్తారు. ఆరోపణలూ ప్రత్యారోపణల పర్వంలో- ప్రజాస్వామ్య విలువలను కబళించడంలో అన్ని పార్టీలూ అదే తానుముక్కలేనన్న సంగతి మరుగున పడిపోతోంది.
ఆరు దశాబ్దాల క్రితం కేరళలో నంబూద్రిపాద్ సర్కారు రద్దునుంచి- ప్రతిపక్ష ప్రభుత్వాల ఊపిరితీస్తూ, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడంలో కాంగ్రెస్ భ్రష్ట చరిత్ర యావత్ దేశానికీ తెలిసిందే. అత్యధిక మెజార్టీతో తెలుగునాట అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేసేందుకు 1984లో ఇందిరాగాంధీ తెగబడటమూ దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. నిబద్ధ కార్యకర్తల బలిమి, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాగత దన్నుతో కాలక్రమంలో భాజపా అజేయ శక్తిగా అవతరించింది. ప్రత్యర్థి పక్షాలను చీలుస్తూ, ప్రభుత్వాలను పడగొడుతూ రాష్ట్రాల్లో సొంత పార్టీ సర్కార్లను ప్రతిష్ఠించే ప్రలోభస్వామ్య పెడపోకడలకు ఆ తరవాత అడ్డే లేకుండా పోతోంది. అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపుర్, గోవా, కర్ణాటకలలో ఫిరాయింపుల జలాల్లోనే కమలం వికసించింది. రాజకీయ జిత్తులతో ఇటీవల మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ సర్కారుకు సమాధికట్టి అధికారపీఠాన్ని అది చేజిక్కించుకుంది. కాలం తమ కనుసన్నల్లో ఉన్నప్పుడు ఎదుటి పక్షం నేతలను బులిపించో బెదిరించో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మిగిలిన పార్టీలూ బరితెగిస్తూనే ఉన్నాయి. విపక్షాలను పూర్తిగా బలహీనపరచి తామే సర్వంసహాధిపత్యం వహించాలన్న అప్రజాస్వామిక ధోరణులు అధికారపక్షాల తలకెక్కాయి. అలా పార్టీలన్నీ కలిసి తమ సర్వభ్రష్ట రాజకీయాలతో దేశీయంగా ఇప్పటికే మిణుకు మిణుకుమంటున్న ప్రజాస్వామ్య దీపాన్ని పూర్తిగా కొండెక్కిస్తున్నాయి!