నాసిరకం వస్తూత్పాదనలు, అనైతిక వ్యాపారాలు, మోసకారి ప్రకటనల బారిన పడి వినియోగదారులు దారుణంగా నష్టపోవడాన్ని నివారించడానికి ఉద్దేశించిన ప్రత్యేక శాసన స్ఫూర్తి అమలులో నీరోడుతోంది. 1986నాటి పాత చట్టం స్థానే వినియోగ హక్కులకు ఇతోధిక రక్షణను లక్షించిన నూతన నిబంధనావళి గత జులైలో పట్టాలకు ఎక్కింది. ఆ చట్టం రావడం తరువాయి- భిన్న అంచెల్లో వివాదాల పరిష్కార సంఘాలు, వేదికలు కొలువుతీరతాయని, కల్తీ నకిలీ సరకులు అంటగట్టజూసినవారు లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించి ఆరు నెలలదాకా జైలు ఊచలు లెక్కించక తప్పదన్న అంచనాలు వినిపించాయి. వాస్తవ దృశ్యం తద్విరుద్ధమని- వివిధ రాష్ట్రాలు, జిల్లాస్థాయి వినియోగదారుల కమిషన్లలో పెద్దయెత్తున ఖాళీలు పేరుకుపోయాయంటూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోదాహరణంగా చాటుతోంది. అత్యవసర ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపట్టాలని తన వంతుగా ప్రధాని మోదీ రాష్ట్రాలకు తాజాగా పిలుపిచ్చారు.
సంపూర్ణ రక్షణ ఎండమావే..
మునుపటి చట్ట నిబంధనల ప్రకారం, వినియోగదారుల వేదికల ముందుకు వెళ్ళిన కేసుల్ని మూడు నెలల గడువులో పరిష్కరించాల్సి ఉన్నా- రెండు మూడేళ్లయినా అతీగతీ లేని ఉదంతాలెన్నో గతంలో వెలుగుచూశాయి. జిల్లా, రాష్ట్ర సంఘాల్లో వందలాది ఖాళీలు పోగుపడే దుస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్న అర్జీదారు ఆ వివరాల్నీ క్రోడీకరించారు. ఒక్క కర్ణాటక రాష్ట్ర కమిషన్‌లో దాఖలైన వివాదాలను ఓ కొలిక్కి తేవడానికే ఏడేళ్లు పడుతుందంటే- రాష్ట్రాలవారీగా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నవంబరు నెలాఖరు వరకు వేసిన మదింపు ప్రకారం- జాతీయ వినియోగదారుల సంఘం వద్దే 21 వేలకుపైగా కేసులు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. నియామకాలు చురుకందుకోని కారణంగా రాష్ట్రస్థాయి సంఘాల చెంత దాదాపు లక్షా పాతిక వేలు, జిల్లా వేదికల్లో అంతకు మూడింతల మేర అపరిష్కృత వ్యాజ్యాలు లెక్కతేలాయి. వెరసి, వినియోగదారులకు ఒనగూడుతుందన్న 'సంపూర్ణ రక్షణ' ఎండమావిని తలపిస్తోంది.