తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రక్షణ రంగ స్వావలంబనకు సమగ్ర కార్యాచరణ

రక్షణావసరాల్లో మూడొంతుల దాకా విదేశీ దిగుమతులపైనే ఆధారపడిన దేశం మనది. దశాబ్దాల తరబడి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. 2014 అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే విడిభాగాలు, పరికరాలు, ఉప వ్యవస్థలను ఈ గడ్డపైనే ఆవిష్కరించాలని రక్షణ ఉత్పత్తుల విధివిధానాన్ని సంస్కరిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే భారత్‌లో తయారీని సరళతరం చేసి, విదేశీ పెట్టుబడులు మరింత అధికమయ్యేలా.. మౌలిక ప్రతిబంధకాలను, బ్యురాక్రసీ అవరోధాలను అధిగమించే సమగ్ర కార్యాచరణను పట్టాలకు ఎక్కించాలి. చిరకాల స్వప్నంగా మిగిలిన రక్షణ రంగ స్వావలంబనకిదే మేలు దారి!

Defense sector
రక్షణ రంగ స్వావలంబనకు సమగ్ర కార్యాచరణ

By

Published : Oct 9, 2020, 6:52 AM IST

భారత్‌ నుంచి 2014 సంవత్సరంలో ఎగుమతి అయిన రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రూ.2000 కోట్లు. గత రెండేళ్లలో ఆ పరిమాణం సగటున రూ.17వేల కోట్లకు చేరిందని, వచ్చే అయిదేళ్లలో రూ.35వేల కోట్లకు చేరాలని లక్షిస్తున్నట్లు ఎనిమిది నెలల క్రితం 'లఖ్‌నవూ డిఫెన్స్‌ ఎక్స్‌పో' ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ప్రకటించారు.

తాజాగా ఆ లక్ష్యాన్ని పునరుద్ఘాటించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, దేశీయ రక్షణోత్పత్తుల పరిశ్రమలోకి వెలుపలి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తాలని ఆకాంక్షిస్తున్నారు. డిజైనింగ్‌ మొదలు ఉత్పాదనల వరకు 'భారత్‌లో తయారీ' స్ఫూర్తిని పరవళ్లెత్తించదలచామన్నది- సుమారు 75 దేశాలకు చెందిన 200 మందికి పైగా రాయబారులు, రక్షణరంగ ప్రతినిధులతో రాజ్‌నాథ్‌ వీడియో సదస్సు సారాంశం.

ప్రాధాన్యం కల్పిస్తేనే స్వావలంబన..

రక్షణావసరాల్లో మూడొంతుల దాకా దశాబ్దాల తరబడి విదేశీ దిగుమతులపైనే ఆధారపడిన దేశం మనది. మొదటిసారి కేంద్రాధికారం చేపట్టిన తొలినాళ్లలోనే- విడిభాగాలు, పరికరాలు, ఉప వ్యవస్థలను ఈ గడ్డపైనే ఆవిష్కరించేలా రక్షణ ఉత్పత్తుల సమీకరణ విధివిధానాల్ని సంస్కరిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

2014 నాటికి రక్షణ రంగాన జారీ అయిన లైసెన్సుల సంఖ్య 210. అయిదేళ్లలో అవి 460కి పెరిగాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ప్రతీతమైన ఇండియా, రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల పరంగా 23వ స్థానానికి పరిమితమైన దుస్థితిని చెదరగొట్టే క్రమంలో పడిన తొలి అడుగది.

కరోనా సంక్షోభంతో కుదేలైన దేశార్థికానికి, 'భారత్‌లో తయారీ' కొత్త ఊపిరులూదడం అత్యంత ఆవశ్యకం. అందుకు అనుగుణంగా విస్తృత శ్రేణి రక్షణోత్పత్తులకు, నాణ్యతకు విశేష ప్రాధాన్యం కల్పిస్తేనే- ఇన్నేళ్ల పరాధీనత స్థానే స్వావలంబన వైపు ప్రస్థానం ధీమాగా చురుకందుకుంటుంది.

రక్షణ రంగ స్వావలంబనకదే మేలు దారి

దేశీయ ఆయుధ తయారీలోకి వెలుపలి మదుపుదారుల్ని సూదంటురాయిలా ఆకట్టుకునేందుకంటూ, రక్షణ రంగాన యాంత్రిక (ఆటోమేటిక్‌) పద్ధతిలో 74శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని కేంద్రం ఇటీవలే అనుమతించింది. భారతీయ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించి దేశీయ ముడి పదార్థాలు, ప్రత్యేక మిశ్రమ లోహాలు, సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి ప్రోత్సాహకాలు సమకూర్చే నిమిత్తం సరికొత్త లీజింగ్‌ విధాన ముసాయిదాను అంతకు ఆరు నెలల క్రితమే ఆవిష్కరించింది.

2024 నాటికి దశలవారీగా తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, రవాణా విమానాలు, జలాంతర్గాములు, క్రూయిజ్‌ క్షిపణులు సహా 101 రకాల ఆయుధ దిగుమతులపై ఆంక్షల అమలుకు ఇటీవలే బాటలు పరచింది. ఈ విధాన క్షాళన చొరవ మొగ్గ తొడగక మునుపు ఏళ్లతరబడి విదేశాల నుంచి తుపాకులు, తూటాలు, శిరస్త్రాణాల్లాంటివీ దిగుమతి చేసుకోవాల్సిన దురవస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగింది.

పదుల సంఖ్యలో ఆర్డ్‌నెన్స్‌ కర్మాగారాలు, రక్షణ సంబంధిత ప్రభుత్వరంగ సంస్థలు, డీఆర్‌డీఓ(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) కింద అనేక ప్రయోగశాలలు కొలువు తీరినా- ఏం ఒరిగింది? డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ సారథ్యాన 1992లో రూపొందిన స్వావలంబన సమీక్షా సంఘం సూచించిన విస్పష్ట సూచీల అమలు వాయిదాలపై వాయిదాలు పడుతూ వచ్చింది.

ఇప్పుడికనైనా విదేశీ భాగస్వామ్యాలతో దేశీయ ఉత్పాదనలకు, సొంత అవసరాలూ వెలుపలి సరఫరాల నిమిత్తం సృజనాత్మకంగా పరిశోధన అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడానికి ప్రభుత్వం దీటైన చర్యలు చేపట్టాలి. 'భారత్‌లో తయారీ'ని సరళతరం చేసి, విదేశీ పెట్టుబడులు ఇతోధికమయ్యేలా మౌలిక ప్రతిబంధకాలను, బ్యురాక్రసీ అవరోధాలను అధిగమించే సమగ్ర కార్యాచరణను పట్టాలకు ఎక్కించాలి. చిరకాల స్వప్నంగా మిగిలిన రక్షణ రంగ స్వావలంబనకిదే మేలు దారి!

ఇదీ చూడండి: డీఆర్​డీఓ 'స్మార్ట్​' ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details