జలాశయాల్లో పేరుకున్న అవక్షేపాలపై దృష్టిపెట్టాలి, ఆ నీటి వనరులను భవిష్యత్తు తరాలకు స్థిరమైన, మౌలిక సదుపాయాలుగా మార్చి అందించాలి. 21వ శతాబ్దంలో దృష్టి సారించాల్సిన కీలకమైన అంశమిది' అని దేశంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) గుర్తు చేసింది. సాగునీటి జలాశయాల్లో మట్టి, ఇసుక, వృక్షసంబంధిత వ్యర్థాలతో కూడిన పూడిక పేరుకుపోవడంపై గత సంవత్సరం ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల నీటి ప్రాజెక్టులు సామర్థ్యం కోల్పోయి ప్రమాదకరంగా మారుతున్నాయి. భారీ ఆనకట్టలున్నా, నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో చైనా, భారత్‌లలో ఏటా జలాశయాల వెనక ప్రాంతాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. ఇది చూసైనా- ఉపరితల జలాలతో పరీవాహక ప్రాంతాలు ప్రభావితం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
అవక్షేపాలతో అపార నష్టం
జాతీయ నీటి వనరుల సమగ్రాభివృద్ధి (ఎన్‌సీఐడబ్ల్యూఆర్‌డీ) నివేదిక ప్రకారం దేశంలో 690 బిలియన్ (69వేల కోట్ల) క్యూబిక్ మీటర్ల (బీసీఎం) ఉపరితల జలాల లభ్యతకు అవకాశం ఉంటే- 283 బీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతున్నాం. దేశంలో 5,254 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరో 447 నిర్మాణంలో ఉన్నాయి. వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఈ నిర్మాణాలు కాలం గడిచే కొద్దీ పూడికతో నిండుతున్నాయి. 2017లో సీడబ్ల్యూసీ వెల్లడించిన 23 భారీ ప్రాజెక్టుల సర్వే వివరాలు గమనిస్తే... కనీస నీటిమట్టం(డెడ్ స్టోరేజ్), లైవ్ స్టోరేజ్ రెండింటినీ పూడిక ఆక్రమిస్తోందని తేలింది. ఈ ప్రభావంతో జలాశయాల వెనక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పశ్చిమ్ బంగలోని ఫరక్కా డ్యామ్‌లో అవక్షేపాల తిష్ఠ వల్ల బిహార్‌లో వరదలు వస్తున్నాయి. ఆ నష్టం భరించలేక డ్యామ్‌నే తొలగించాలని బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ డిమాండ్ చేయడం గమనార్హం.
నిల్వ సామర్థ్యం తగ్గుతోంది
పెద్ద జలాశయాల్లో పేరుకుంటున్న పూడిక కారణంగా దేశంలో ఏటా 1.3 బీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. ఆర్థికపరంగా చూస్తే సంవత్సరానికి రూ.2,017 కోట్లు నష్టపోయినట్లు లెక్క. కొత్త ప్రాజెక్టులకు వెచ్చించే వేల కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఏటా చర్యలు తీసుకుంటే జలాశయాల నిల్వను స్థిరంగా ఉంచవచ్ఛు. అయితే ఈ విషయాన్ని విస్మరించి కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్, కేరళ, మేఘాలయా, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని జలాశయాలు ఎక్కువ నష్టపోతున్నాయి.
అత్యధిక ప్రాజెక్టులున్న మహారాష్ట్ర మూడేళ్ల కిందట అప్రమత్తమై మధ్యతరహా ప్రాజెక్టుల పునరుజ్జీవానికి కదిలింది. మిగతా రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో చివరి భూములకు నీరందడంలేదు. వాటికి నీరిచ్చేందుకు మళ్లీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అవసరమవుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో బైరా డ్యామ్‌లోకి 80శాతం పూడిక చేరేవరకు పాలకులు పట్టించుకోలేదంటే, నీటివనరులపై శ్రద్ధ ఏపాటిదో తెలిసిపోతోంది. గంగానది బిహార్‌కు దుఃఖదాయినిగా మారుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల కింద చివరి భూములను తడపలేకపోతున్నారు. ఈ వైఫల్యాలకు ప్రభుత్వాల తీరే కారణం.