కొన్ని సంక్షోభాలు కొత్త మార్పులకు వేదికవుతాయి. కొవిడ్‌వల్ల ప్రపంచవ్యాప్తంగా పని పరిస్థితుల్లో గుణాత్మక మార్పు కనిపిస్తోంది. యంత్ర వినియోగం మునుపటితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. నిజానికి దశాబ్దాల క్రితమే భారత్‌లో యాంత్రీకరణ మొదలైంది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. హిందీలో బీఆర్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన 'నయా దౌర్' చిత్రంలో ఈ పరిణామ క్రమాన్ని స్పష్టంగా చూపించారు. ఆ చిత్రంలో కథానాయకుడు దిలీప్ కుమార్ జట్కాబండీ నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. ఆ గ్రామ జమిందార్ కుమారుడు కొత్తగా బస్సు సర్వీసులు ప్రారంభిస్తాడు. దాంతో గ్రామంలోని వారంతా జట్కాలు వదిలి బస్సు సర్వీసులు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా జట్కాబండ్లు నడుపుకొనేవాళ్లు ఉపాధి కోల్పోయారు.
ఆ పరిస్థితుల్లో కొత్త సవాళ్లకు దీటుగా కథానాయకుడు ఎలక్ట్రానిక్ పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ స్ఫూర్తిదాయకంగా ఎలా ముందుకు సాగుతాడన్నది ఆ చిత్రంలో చూపించారు. కొవిడ్ కారణంగా మునుపటితో పోలిస్తే చాలా వేగంగా యాంత్రీకరణ విస్తరిస్తోంది. మహమ్మారి కొట్టిన దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలై ప్రపంచవ్యాప్తంగా వేలమంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. దీనికితోడు భౌతిక దూరం పరిమితుల కారణంగా మనుషులు చేయాల్సిన పనులకు యంత్రాలను ఉపయోగించడంతో ఉద్యోగాలకు గండిపడింది. వాహన రంగంలో రోబోల వినియోగం విస్తరిస్తోంది. మరోవంక రెస్టారెంట్లలోనూ పదార్థాలను వినియోగదారుల వద్దకు చేర్చేందుకు రోబోలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పాఠశాలల్లోనూ సైన్సు, గణితం అంశాల బోధనకు టీచర్ల స్థానే రొబోల వినియోగం దిశగా ఆలోచనలు సాగుతున్నాయి.
నైపుణ్యం మెరుగుపరుచుకుంటే..
ఫైనాన్సియల్ బ్రోకరేజ్, పరిశోధన, షేర్ మార్కెట్లు, బీమా కంపెనీలతో ముడివడిన సేవల రంగంలోనూ యాంత్రీకరణ వేగం పుంజుకుంటోంది. రోబోల సాయంతో విత్త రంగంలో సలహా సంప్రదింపులు స్వీకరించే సంస్కృతి అంతకంతకూ విస్తరిస్తోంది. వినియోగదారుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలిచ్చేందుకూ రోబో 'చాట్'లనే వినియోగిస్తున్నారు. యాంత్రీకరణ పెరిగే కొద్దీ ఉద్యోగాలకు గండి పడుతుందన్నది నిజమే అయినా- నూతన అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి.
అప్పట్లో వద్దన్నారు