నేటి బాలలే భావి భారత పౌరులు. దేశాభివృద్ధికి వారే వెన్నెముక. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ ఎందరో చిన్నారులు సరైన పోషకాహారం లేక గిడసబారిపోతున్నారు. నాలుగో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక ప్రకారం దేశంలో అయిదేళ్లలోపు పిల్లల్లో 38శాతానికి పైగా ఎదుగుదల లోపాలతో బాధపడుతున్నారు. 35శాతం పిల్లలు వయసుకు తగిన బరువు లేరు. ఉన్నత వర్గాలతో పోలిస్తే అట్టడుగు వర్గాల్లో ఈ సమస్య మరింత అధికం. 'కులదుర్విచక్షణ, ఎదుగుదల లోపాలు' పేరుతో అశోకా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థిక గణాంకాలు, విశ్లేషణ కేంద్రం వెలువరించిన నివేదిక దీన్ని మరోసారి రుజువుచేసింది. అస్పృశ్యత ఎక్కువగా ఉన్న బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని దళిత పిల్లల్లో ఎదుగుదల లోపాలు హెచ్చుగా ఉన్నట్లు అశోకా వర్సిటీ అధ్యయనం తేల్చి చెప్పింది. ఎస్సీఎస్టీల్లో 40శాతం పిల్లల్ని ఎదుగుదల లోపాలు బాధిస్తుండగా, ఓబీసీల్లో ఆ రేటు 36శాతంగా ఉంది.
ఎదుగుదల లోపం అంటే..
పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడాన్ని ఎదుగుదల లోపంగా పేర్కొంటారు. పోషకాహారలోపం, పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, పేదరికం, ఆడ, మగ పిల్లల మధ్య దుర్విచక్షణ వంటివి దీనికి కారణాలు. ఉన్నత వర్గాల్లో 65శాతానికి నాణ్యమైన, వ్యక్తిగత పారిశుద్ధ్య సదుపాయాలుంటే, ఎస్టీల్లో 25.9శాతానికే అవి అందుబాటులో ఉన్నట్లు ఇటీవల ఆక్స్‌ఫామ్ అసమానతా నివేదిక వెల్లడించింది. ఎగువన ఉన్న 20శాతంతో పోలిస్తే అడుగున ఉన్న 20శాతం జనాభా పిల్లల్లో అయిదేళ్లలోపే మరణించే వారి సంఖ్య మూడు రెట్లు అధికంగా నెలకొనే అవకాశం ఉంది. ఏపీలో ఎదుగుదల లోపాలున్న అయిదేళ్లలోపు బాలలు పట్టణాల్లో 23శాతం, గ్రామీణంలో 34శాతం, మొత్తంగా 31.2శాతం ఉన్నట్లు అయిదో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ పేర్కొంది. నాలుగో విడత సర్వేలో ఇది 31.4శాతం.
మరణముప్పు
తెలంగాణలో అయిదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలున్నవారు పట్టణాల్లో 28.1శాతం ఉండగా, పల్లెల్లో 35.7శాతం, మొత్తంగా 33.1శాతం. నాలుగోవిడత సర్వేలో ఇది 28శాతం. గతేడాది నవంబరు నాటికి భారత్‌లో ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లల్లో 9.3 లక్షల మంది తీవ్ర పోషకాహార సమస్యను ఎదుర్కొన్నట్లు ఇటీవల కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతీ ఇరానీ పార్లమెంటులో ప్రకటించారు. వీరిలో దాదాపు 40శాతం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డకు ఎదుగుదల సమస్య ఎదురవుతుంది. ఇటువంటి పిల్లలను మరణముప్పు వెంటాడుతుంది. వీరిలో ఐక్యూ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫలితంగా చదువులో సరిగ్గా రాణించలేరు. అభివృద్ధిలో వెనకబడతారు.