జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడం పెద్ద సవాలే. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితే ఇందుకు ముఖ్య కారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న డీడీసీ(జిల్లా అభివృద్ధి మండలి) ఎన్నికలకు ప్రజల ఆమోదం లభించినట్టే కనిపిస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో అనిశ్చితులు సర్వసాధారణం. అదే సమయంలో 1987 నుంచి ఇక్కడ.. ఎన్నికల చట్టబద్ధత కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులు చేసేవారు. ఈ తరహాలో ఇప్పటివరకు 5వేల మందికిపైగా నేతలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది ప్రధాన పార్టీలకు చెందినవారు కావడం గమనార్హం.
కానీ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న డీడీసీఏ ఎన్నికలు.. రాజకీయ రూపురేఖలను మార్చేసినట్టు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న 'రక్తపాతం'.. కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని అక్కడివారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలే సమస్యకు పరిష్కారమని అనుకుంటున్నారు. ఫలితంగా జమ్ముకశ్మీర్ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికలకు చట్టబద్ధత దక్కినట్టైంది.
ఇదీ చూడండి:-కశ్మీర్లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?
ప్రారంభం అక్కడే!
ఎన్నికల బహిష్కరణ నుంచి పోలింగ్‌ను ఆమోదించే స్థాయికి ఇప్పుడు కశ్మీర్ ఎదిగింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దీనికి బీజం పడినట్టు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:-ఫరూక్ అబ్దుల్లా 'రోష్ని' భూములపై రాజకీయ రగడ
కశ్మీర్‌లోని పార్టీల మూలాలు, అజెండాలు అన్నీ ఆర్టికల్ 370 చుట్టూ తిరిగేవి. ఒకానొక సందర్భంలో.. స్వయం ప్రతిపత్తి రద్దుతో ఈ పార్టీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. తేరుకునే లోపే.. పార్టీల అగ్రనేతల్లో కొందరిని కేంద్రం అరెస్ట్ చేసింది. మరికొందరిని గృహ నిర్బంధంలో పెట్టింది. ఈ జాబితాలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులున్నారు.