తెలుగు రాష్ట్రాల్లో అడవుల రక్షణ(Forest conservation in Telangana)లో అటవీశాఖ అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పోడు వ్యవసాయం(Podu cultivation) ఒకటి. మానవ నాగరికతలో పోడు వ్యవసాయం(Podu cultivation) కొత్త విషయమేమీ కాదు. అపరిమితంగా పెరిగిన జనాభాలో ఎక్కువ శాతం జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. వారు భూమి కోసం అడవులను నరికివేయడంవల్ల పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. అటవీశాఖ అధికారులు అడవుల నరికివేతను ఆపడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నా, పలు కారణాలవల్ల పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు. ఇప్పటివరకు లక్షల ఎకరాల అటవీ భూములను స్థానికులు ఆక్రమించి సాగు చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం... 2005 డిసెంబరు 13 నాటికి ఖాస్తులో ఉన్న వారిని హక్కుదారులుగా గుర్తించారు. జీవనోపాధికై భూమిని సాగు చేసుకుని, ఫలసాయాన్ని అనుభవించే హక్కును కొన్ని షరతులకు లోబడి షెడ్యూల్డ్ తెగలవారికి ఇతరులకు ఇచ్చారు. అయితే, చట్ట ప్రకారం భూమిపై యాజమాన్య హక్కు అటవీ శాఖకే చెందుతుంది. చట్ట ప్రకారం 2005 తరవాత పోడు సాగు కోసం అడవులు నరికిన వారికి హక్కులు లభించవు. అటవీ సంరక్షణ చట్టం-1980 ప్రకారం, ఏదైనా అటవీ భూమిని అటవీయేతర పనులకోసం ఇవ్వడానికి నిర్ణయిస్తే దానికి సంబంధిత అధికార వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇచ్చిన భూమికి సరిపడా అటవీయేతర (ప్రభుత్వ) భూమిని అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి వెనక్కి తీసుకొనే క్రమంలో పోడుదారులు, అటవీ శాఖల సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో స్థానికులు అటవీ అధికారులపై భౌతిక దాడులకూ పాల్పడుతున్నారు. ఏపీలో ఉభయగోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న అటవీ ప్రాంతాల్లో పోడు సమస్య తీవ్రంగా ఉంది. ఒక్క చింతూరు ఏజెన్సీ పరిధిలోనే 53 వేల ఎకరాలకు పైగా అటవీ భూములపై హక్కుల కోసం సుమారు 20 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో 13 వేలు తిరస్కరణకు గురయ్యాయి.
గొత్తికోయల వలసలు
మరో రకమైన పోడు సమస్య గొత్తి కోయల వ్యవసాయం. రెండు, మూడు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల అడవుల్లోకి గొత్తికోయలు వలస వస్తున్నారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో వందలాది ఆవాసాలను ఏర్పరచుకుని నివాసం ఉంటున్నారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల అడవుల్లో పెద్ద సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దక్షిణ ప్రాంతానికి చెందిన మురియా జాతి గిరిజనులైన గొత్తి కోయలకు ఇక్కడ షెడ్యూల్డ్ తెగ కింద గుర్తింపు లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు, సాలావజుడుం మధ్య ఉన్న వైరం కారణంగా వీరు పక్కనే ఉన్న మన అడవుల్లోకి వలస వస్తున్నారు. ఎంతో శ్రమజీవులైన గొత్తి కోయలు చాలా వేగంగా అడవులను నరికివేస్తారు. కొంతమంది తెలివిమీరిన నాగరికులు తమ వ్యవసాయంకోసం అడవుల నరికివేతకు వీరిని వినియోగించుకొంటున్నారు. విలువిద్యలో సాటిలేని గొత్తికోయలు విచక్షణా రహితంగా అడవి జంతువులను వేటాడతారు. వారి ఆవాస ప్రాంతానికి కనీసం కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఏ వన్యప్రాణీ మనుగడ సాగించలేదంటే అతిశయోక్తి కాదు! అడవి మధ్యలో పోడు చేస్తున్న వీరిని సాకుగా చూపి స్థానికులు కొందరు తాము కూడా పోడు చేయడానికి ఉపక్రమిస్తుంటారు.
అటవీ ప్రాంతంలో చెట్లు నరికినందుకు, పోడు వ్యవసాయం చేసినందుకు, అడవి జంతువులను వేటాడినందుకు అధికారులు గొత్తి కోయలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అటవీ చట్టాల ప్రకారం ఖాళీ చేయించడం, కేసులు నమోదు చేయడం, కోర్టుల్లో హాజరు పరచడం వంటివి ఎన్ని చేసినా- గొత్తి కోయలు తాము ఆక్రమించిన అటవీభూములను వదిలి వెళ్ళడంలేదు. ఈ సందర్భంగా ఘర్షణలూ చోటు చేసుకొంటున్నాయి. అడవులను కాపాడే ప్రయత్నంలో అటవీ శాఖ ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తోందనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. శాసనసభల్లోనూ ఈ అంశంపై చర్చలు జరిగాయి. న్యాయస్థానాల్లో అటవీ అధికారులపై వ్యాజ్యాలు, పిటిషన్లు దాఖలయ్యాయి. అడవుల నుంచి గొత్తికోయలను ఖాళీ చేయించవద్దని హైకోర్టు ఆదేశించింది. అడవి క్షీణతకు కారణమవుతున్న గొత్తికోయల విషయంలో అటవీ శాఖ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్నచందంగా తయారైంది.