తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కొత్త ఏడాదికి భద్రతా సవాళ్ల స్వాగతం.. సైబర్​ సైనికులు అవసరమే..!

చైనా- ఒకవైపు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే, మరోవైపు సైబర్‌ సీమలో దాడులకు తెగబడుతోంది. ప్రతిగా భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్ని, యుద్ధరీతుల్ని పెంపొందించుకోవాల్సిందే. రాబోయే కాలంలో స్మార్ట్‌ యుద్ధాలకు అన్నిరకాల శస్త్రాస్త్రాలతో సంసిద్ధం కావాల్సిందే!

cyber security services
భద్రతా సవాళ్లు

By

Published : Dec 31, 2022, 8:47 AM IST

Updated : Dec 31, 2022, 8:56 AM IST

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో ఇటీవల జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణతో 2022 సంవత్సరం ముగుస్తోంది. రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను చైనా పదేపదే అతిక్రమిస్తూ భారతీయ భూభాగాలలోకి చొరబడుతోంది. దీనితోపాటు అత్యంత ప్రముఖులకు చికిత్స అందించే దిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థపై డ్రాగన్‌ దేశం ఈ నవంబరులో సైబర్‌ దాడి జరిపింది. తద్వారా తన హైబ్రిడ్‌ యుద్ధ సామర్థ్యాన్ని అది చాటుకుంది. ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడంతోపాటు డ్రోన్ల ద్వారా మత్తుమందులు, ఆయుధాలను మన భూభాగంలోకి పాకిస్థాన్‌ చేరవేస్తోంది. పాక్‌ మంత్రి ఒకరు తమ వద్ద అణు బాంబులు ఉన్నాయంటూ భారత్‌ను బెదిరించడాన్ని బట్టి చూస్తే- అవసరమైతే ఏకకాలంలో పాక్‌, చైనాలను ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధంగా ఉండాలని అవగతమవుతోంది. తరవాత పాక్‌ మంత్రి మాట మార్చినా, ఇస్లామాబాద్‌ ఉద్దేశాలను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. శత్రువు ఏం చేస్తున్నాడనే దానికన్నా ఏం చేయగలడనేదే (సామర్థ్యం) ముఖ్యం. దాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాల్ని రూపొందించుకోవాలనేది యుద్ధ నిపుణుల మాట.

చైనా వసతుల విస్తరణ
భావి యుద్ధాల్లో విజయానికి కీలకమైన కృత్రిమ మేధ, రోబోలు, బిగ్‌ డేటా, 5జీ నెట్‌వర్కుల వంటి అధునాతన సాంకేతికతల్లో చైనా తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఈ రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా ముందుకొస్తోంది. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఇటీవల ఆమోదించిన జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ) సరికొత్త భద్రతా సాంకేతికతల అభివృద్ధి, హిమాలయాల అతిశీతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం, డ్రోన్లు, అయిదో తరం యుద్ధ విమానాల రూపకల్పన, అధునాతన వైర్‌లెస్‌ కమ్యూనికేషన్లు, గూఢచర్యం వంటి రంగాల్లో దిల్లీ, వాషింగ్టన్‌ల మధ్య సహకార వృద్ధికి బాటలు వేస్తోంది.

దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు కబ్జాల పర్వాన్ని చేపట్టిన చైనాకు అమెరికా-భారత్‌ల రక్షణ బంధం కంట్లో నలుసులా మారింది. అందుకే భారత్‌, అమెరికా సైనిక దళాలు యుద్ధ అభ్యాసాలను నిర్వహించిన కొద్ది రోజులకే చైనా తవాంగ్‌లో ఘర్షణలు రేపింది. బీజింగ్‌ ఇంతవరకు భారత భూభాగాల్లోకి ప్రవేశించలేదని, ఎవ్వరూ అంగుళం మేరకూడా ఆక్రమించలేరని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మాత్రం యుద్ధానికి చైనా సన్నాహాలు చేసుకొంటూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. సరిహద్దుల్లో చైనా భారీ ఆయుధాలను మోహరిస్తున్నా కేంద్ర సర్కారు చేతులు ముడుచుకొని కూర్చుందనీ అన్నారు. నిజానికి చైనాకు దీటుగా భారత్‌ సైతం సరిహద్దుల్లో ఆధునిక ఆయుధాలను మోహరిస్తోంది. రహదారులు, సొరంగాలు, వైమానిక స్థావరాల వంటి మౌలిక వసతులను విస్తరిస్తోంది. అయినప్పటికీ చొరబాట్లు, మానసిక, మేధాక్రీడలతో చైనా మన రాజకీయ పక్షాల్లో తీవ్ర భేదాభిప్రాయాలను రెచ్చగొట్టగలుగుతోంది.

భారత్‌ తన ఆయుధ అవసరాల కోసం రష్యాపై అతిగా ఆధారపడటం అమెరికాకు నచ్చడంలేదు. అయినా, ఇండియా పరిస్థితిని అర్థం చేసుకుని దిల్లీని క్రమంగా రష్యాకు దూరం చేయాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. రష్యాకు బదులుగా తమ వద్ద ఆయుధాలు కొనుగోలు చేయాలని భారత్‌కు వాషింగ్టన్‌ సూచిస్తోంది. రష్యా తరహాలో ఆయుధాలతోపాటు వాటి తయారీ పరిజ్ఞానాన్ని భారత్‌కు బదిలీ చేయడానికి ఇంతవరకూ అమెరికా సుముఖత చూపలేదు. ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌ అందుకు సిద్ధంగా ఉండటంతో భారత్‌ ఆయా దేశాల ఆయుధాల వైపు మొగ్గుచూపుతోంది. దీంతో భారత్‌తో కలిసి రక్షణ రంగంలో పరిశోధన-అభివృద్ధి చేపట్టడానికి అమెరికా కాంగ్రెస్‌ ఎన్‌డీఏఏ చట్టాన్ని తెచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కోసం కృషి చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఏడాది జులైలో 75 కృత్రిమ మేధ (ఏఐ) ఉత్పత్తులను విడుదల చేయడం ముఖ్యమైన ముందడుగు. ఏఐ సాయంతో పనిచేసే డ్రోన్ల దండును చైనా సరిహద్దులో భారత్‌ మోహరిస్తోంది. డ్రోన్ల తయారీకి స్వదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తోంది. భారత్‌ సత్వరం సైబర్‌ యుద్ధ సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సి ఉంది.

సైబర్‌ సైనికులు అవసరం
చైనా సైబర్‌ దాడి వల్ల 2020లో ముంబయిలో కొన్ని గంటలసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి కీలక సేవలు స్తంభించాయి. చైనా హ్యాకర్లు 2020లో 40 వేలసార్లు, 2019లో 50 వేలసార్లు భారత ఐటీ రంగంపై సైబర్‌ దాడులకు ప్రయత్నించినా సఫలం కాలేదు. 2017లో భారత వైమానిక దళంలోని ఒక సుఖోయ్‌ యుద్ధ విమానంపై చైనా సైబర్‌ దాడి చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో డ్రాగన్‌ సైబర్‌ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ నిపుణులైన హ్యాకర్ల సైన్యాన్ని సమకూర్చుకోవాలి. ఐటీ మౌలిక వసతుల విస్తరణలపై నిధులు వెచ్చించాలి. 21వ శతాబ్ది యుద్ధాలు నేల మీద, నింగిలో, నీటిలోనే కాదు సైబర్‌ సీమలో, అంతరిక్షంలోనూ జరుగుతాయి. ఈ స్మార్ట్‌ యుద్ధంలో గెలవడానికి అవసరమైన నిపుణులు మనకు ఉన్నారు. వారిని సద్వినియోగం చేసుకోవాలంటే త్రివిధ సాయుధ బలగాల ఆధునికీకరణకు సమధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.

స్వతంత్ర పంథా..
ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ రాజకీయాల్లో అలీనోద్యమ నేతగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అది చూసి ఓర్వలేక భారత్‌కు గుణపాఠం చెబుతామంటూ మావో, చౌఎన్‌ లైలు 1962లో మనదేశంపై దురాక్రమణకు దిగారు. అయితే, 1962నాటి ఇండియా పరిస్థితి వేరు, ఈనాటి భారత్‌ వేరు. అమెరికా, జపాన్‌లతో భారత్‌ బలీయ రక్షణ బంధాన్ని ఏర్పరచుకొంటూనే స్వతంత్ర పంథానూ అనుసరిస్తోంది. అమెరికా, ఐరోపాల ఒత్తిళ్లను లెక్కచేయకుండా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో భారత్‌ తటస్థ వైఖరిని అవలంబించడం, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఇందుకు నిదర్శనం. యుద్ధానికి ఇవి రోజులు కావంటూ పుతిన్‌కు మోదీ నచ్చజెప్పడం అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య కూటమికి ప్రశంసాపాత్రమైంది. ఇండొనేసియాలోని బాలిలో జరిగిన జీ20 సమావేశ సంయుక్త ప్రకటనలో మోదీ సందేశాన్ని పొందుపరచారు. జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉంటుంది.

Last Updated : Dec 31, 2022, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details