దేశంలో సైబర్ నేరాల తీవ్రత ఏటికేడాది ఇంతలంతలవుతున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. నమోదైన నికర కేసుల ప్రాతిపదికన కర్ణాటక, యూపీ, మహారాష్ట్రలను వెన్నంటి ఉభయ తెలుగు రాష్ట్రాలూ సైబర్ చోరగణం విజృంభణను కళ్లకు కడుతున్నాయి. 2019తో పోలిస్తే 2020 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా సైబర్ అకృత్యాలు రెండింతలై నాలుగున్నర వేలకు పైబడినట్లు రాష్ట్ర డీజీపీ తాజా ప్రకటన చాటుతోంది. అటు మహారాష్ట్రలో ఒక్క పుణె నగరంలోనే కేవలం ఏడాది వ్యవధిలో రెట్టింపైన కేసుల సంఖ్య దాదాపు 14వేలకు ఎగబాకడం నిశ్చేష్టపరుస్తోంది. 'డిజిటల్ ఇండియా' స్వప్నసాకారం మాట ఎలాగున్నా- దేశం నలుమూలలా ఆన్‌లైన్ కంతల దన్నుతో సైబర్ నేరాలు 64శాతం మేర పెచ్చరిల్లినట్లు అధ్యయన నివేదికలు విశ్లేషిస్తున్నాయి. అంతర్జాలాన్ని, స్మార్ట్‌ఫోన్లనే స్వీయలాఘవ ప్రదర్శన వేదికలుగా మలచుకుంటున్న చోరముఠాల చేతివాటం మూలాన 2019లో దేశీయంగా వాటిల్లిన నష్టం సుమారు లక్షా పాతికవేల కోట్ల రూపాయలని అంచనా. కేసుల సంఖ్యతో పాటు నష్ట పరిమాణమూ పెరుగుతోంది.
ఏడాదిలోనే 5రెట్లు..
వాస్తవానికి జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) మదింపు వేసిన దానికన్నా చోరులపాలైన సొత్తు ఎంతో అధికమన్న వాదనలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఆమధ్య గట్టిగా వత్తాసు పలికారు. ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఉద్ధృతి అయిదింతలైందన్న ఆయన ధ్రువీకరణ- అడ్డూఆపూ లేకుండా నయా నేరగాళ్లు చెలరేగిపోతున్న వైనాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. రుణ యాప్‌ల పేరిట కొన్ని నెలల వ్యవధిలోనే రూ. 21 వేలకోట్ల మేర చేతులు మారి దేశ సరిహద్దులే దాటిపోయిన బాగోతం- సైబర్ నేరాలు ఎంతగా చిలవలు పలవలు వేసుకుపోతున్నాయో ఎలుగెత్తుతోంది. కొవిడ్ సంక్షోభాన్ని మహదవకాశంగా దొరకబుచ్చుకొని పలు రాష్ట్రాల్లో సైబర్ ముష్కరులు చెలరేగిపోతున్న దృష్ట్యా- జాతీయ స్థాయిలో ముప్పును ఎదుర్కొనే పకడ్బందీ వ్యూహం అత్యావశ్యకత ఇక ఎంతమాత్రం ఉపేక్షించరానిది.
'వర్క్ ఫ్రమ్ హోం'తో పెరిగిన ముప్పు..