తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రైవేటు బాటలో క్యూబా!

ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కమ్యూనిస్టు క్యూబానూ పట్టికుదిపింది. ఈ నేపథ్యంలోనే అనేక దశాబ్దాల తరవాత దేశంలోని కొన్ని రంగాలను ప్రైవేటీకరిస్తూ క్యూబా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే క్యూబా సైతం పెట్టుబడిదారి విధానం వైపు అడుగులేస్తుందని తెలుస్తోంది.

Cuba on the private trail
ప్రైవేటు బాటలో క్యూబా!

By

Published : Feb 18, 2021, 6:51 AM IST

క్యూబా అనగానే మనకు గుర్తుకొచ్చే రూపం.. సైనిక దుస్తులు, కొద్దిపాటి గెడ్డం, నోట్లో హవానా చుట్టతో కనిపించే ఫిడెల్‌ క్యాస్ట్రో! దాదాపు అయిదు దశాబ్దాల పాటు క్యూబాకు తిరుగులేని నాయకుడిగా ఉండి, అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ధైర్యంగా ఎదుర్కొని తన దేశానికి విభిన్నమైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును అందించిపెట్టిన మహోన్నత నాయకుడాయన. కమ్యూనిస్టు తరహా పాలన విధానాలకు అనుగుణంగా క్యూబాను ఆయన తీర్చిదిద్దారు. ఆ తరవాత వచ్చిన ఆయన సోదరుడు రౌల్‌ క్యాస్ట్రో సైతం చాలా కాలం పాటు సోదరుడి విధానాలకే కట్టుబడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి క్యూబానూ పట్టికుదిపింది. ఈ నేపథ్యంలోనే అనేక దశాబ్దాల తరవాత దేశంలోని కొన్ని రంగాలను ప్రైవేటీకరిస్తూ క్యూబా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా కేవలం 127 రంగాలలో మాత్రమే ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలకు; పెట్టుబడులకు అక్కడ అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 2000కు చేరుకుంది! అంటే, క్యూబా సైతం ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచేసిందన్న మాట.

రక్షణ, ఆరోగ్యం వంటి కొన్ని రంగాలను మినహాయించి దాదాపు ఏ రంగంలోనైనా ఎవరైనా ప్రైవేటు ఉద్యోగాలతో పాటు తమకు నచ్చిన రంగంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడింది. కేశాలంకరణ, టైర్ల మరమ్మతులు, కల్లుగీత వంటి అతి కొద్ది వృత్తులను మాత్రమే గతంలో క్యూబన్లు ప్రైవేటుగా చేయగలిగేవారు. అంతర్జాలం అందుబాటులోకి వచ్చి, విస్తృతంగా అవకాశాలు తలుపు తడుతున్నా ప్రభుత్వ ఆంక్షల కారణంగా వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నామన్న నిరాశా నిస్పృహలూ క్యూబన్లలో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రెండు వేల విభిన్న రంగాల్లో ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి అక్కడ అవకాశం లభించడం విశేష పరిణామం.

సరళీకరణ పథంలో కమ్యూనిస్టు దేశం
స్వేచ్ఛావాణిజ్య భావన అంటేనే ఆమడ దూరంలో ఉండే క్యూబాలోని కమ్యూనిస్టు నాయకులకు ఈ కొత్త అడుగులు కొంచెమైనా నచ్చుతున్నట్లు లేవు. దీనివల్ల తాము ఎన్నాళ్లనుంచో అడ్డుకుంటూ వస్తున్న అమెరికా పెట్టుబడిదారులు ఏదో ఒక దొంగదారిలో తమ దేశంలో ప్రవేశించి, క్రమంగా ఆర్థిక వ్యవస్థపై పట్టుసాధించి, తద్వారా తమ అస్తిత్వాన్ని దెబ్బకొడతారేమోనన్నది వారి భయం. స్వేచ్ఛావాణిజ్య విధానాల అమలులో తమకు ఏమాత్రం తొందరపాటు లేదని, అదే సమయంలో ప్రస్తుతం ప్రారంభించిన విధానాలను నిలువరించే ఉద్దేశమూ లేదని క్యూబా ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధినేతగా ఉన్న రౌల్‌ క్యాస్ట్రో మరో రెండు నెలల్లో ఆ పదవి నుంచి తప్పుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.

రెండు ప్రధాన సంస్కరణలు

ఈ ఏడాది రెండు ప్రధాన సంస్కరణలకు క్యూబా తెరతీస్తోంది. ఒకటి: ద్వంద్వ కరెన్సీ విధానాన్ని ఏకీకృతం చేయడం. రెండు: ఉద్యోగాలపై నియంత్రణలు ఎత్తేయడం. కానీ, 124 రంగాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ తన అధీనంలోనే ఉంచుకుంది. ఆరోగ్యం, టెలికాం, మాస్‌ మీడియా వంటివి ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. కొత్త ఆర్థిక విధానాల కారణంగా విద్యారంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందన్నది పరిశీలకుల భావన. దాంతోపాటు అమెరికాతో క్యూబా సంబంధాలూ కొంతమేర మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.

మార్పుకోసం ఎదురుచూపులు
డొనాల్డ్‌ ట్రంప్‌ జమానాలో క్యూబాపై నాలుగేళ్ల పాటు ఆర్థిక ఆంక్షలు విధించారు. దాంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనయింది. జో బైడెన్‌ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో తమకు మంచిరోజులు వస్తాయన్నది క్యూబా అధినేతల భావన. ప్రైవేటురంగానికి క్యూబా ద్వారాలు తెరవడం శుభవార్తేనని, అయితే ఇదే సమయంలో క్యూబాలోని ప్రైవేటు సంస్థలపై జరిమానాలు విధించబోమన్న హామీ అమెరికా నుంచి వస్తే మంచిదని ఆమెరికా సీనియర్‌ సెనెటర్‌ ప్యాట్రిక్‌ లీహీ వ్యాఖ్యానించడం గమనార్హం. కరోనా మహమ్మారి ఒకవంక, అమెరికా ఆర్థిక ఆంక్షలు మరోవంక క్యూబాను కుంగదీయడంతో- మార్గాంతరం లేక ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచారు.

అప్పుడే అలా అనుకోలేం

ఈ ప్రైవేటీకరణను చూసి కమ్యూనిస్టు క్యూబా సైతం పెట్టుబడిదారీ విధానాలకు దాసోహం అంటోందన్న అభిప్రాయానికి రావడం సరికాదు. క్యూబన్ల పోరాటపటిమను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. ఫిడెల్‌ క్యాస్ట్రో నిర్మించిన బలమైన పునాదులు ఆ దేశ పాలకుల నిర్ణయాలపై ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. దేశీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలనూ ప్రోత్సహించే ఉద్దేశంతోనే ప్రైవేటు పెట్టుబడులకు క్యూబా ఆహ్వానం పలుకుతోంది. అంతేగానీ దీన్నిపెట్టుబడిదారీ విధానాలకు లాకులెత్తడంగా వ్యాఖ్యానించలేం. ఇన్నాళ్లూ కేవలం ట్యాక్సీ డ్రైవర్లుగా, చిరువ్యాపారులుగా, రైతులుగా ఉన్నవారికి- ఇప్పుడు కొత్త రంగాల్లో తమ సత్తా చాటుకునే అవకాశం దొరుకుతుంది. పెద్ద దేశాలతో పోలిస్తే సుమారు కోటి జనాభా మాత్రమే ఉన్న క్యూబా వంటి దేశాల్లో ఇలాంటి విధానాలను సులభంగా అమలుచేసేందుకు వీలుంటుంది.

- కామేశ్‌ పువ్వాడ

ఇదీ చూడండి:అమెరికాలో టోర్నడో బీభత్సం- ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details