తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వదులుతున్న చేతి చమురు.. పెరుగుతున్న పెట్రో ధరలు - oil prices latest news

పక్షం రోజులుగా ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 43 డాలర్లను దాటి పైకి ఎగబాకుతోంది. మరోవంక రెండు నెలల క్రితం 21 ఏళ్ల కనిష్ఠానికి చేరిన డబ్ల్యూటీఐ చమురు ధరలు తిరిగి పుంజుకొని రెండింతలు పెరిగాయి. ఇకమీదటా ముడి చమురు ధరలు స్థిరంగా పెరగవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

crude oil price to hike constantly
వదులుతున్న చేతి చమురు.. పెరగనున్న ధరలు

By

Published : Jun 24, 2020, 7:35 AM IST

ప్రపంచ ముడి చమురు మార్కెట్‌ ఒడుదొడుకులు భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో మరో మాట లేదు. గడచిన పక్షం రోజులుగా ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 43 డాలర్లను దాటి పైకి ఎగబాకుతోంది. మరోవంక రెండు నెలల క్రితం (ఏప్రిల్‌ 2020లో) 21 ఏళ్ల కనిష్ఠానికి చేరిన డబ్ల్యూటీఐ (వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌) చమురు ధరలు తిరిగి పుంజుకొని రెండింతలు పెరిగాయి. ఇకమీదటా ముడి చమురు ధరలు స్థిరంగా పెరగవచ్చునన్న అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితం కనీవినీ ఎరుగని స్థాయికి పడిపోయి, బొత్తిగా నేల చూపులు చూసిన ముడి చమురు ధరలు ఉన్నట్లుండి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్నకు మూడు రకాల జవాబులు చెప్పుకోవచ్చు. ఒకటి: చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌)తోపాటు మరికొన్ని దేశాలు రోజుకు సగటున 97 లక్షల బ్యారెళ్లు మేర ముడి చమురు సరఫరాకు కోతపెట్టడం. రెండు: ముడి చమురును శుద్ధి చేసి అమెరికా రూపొందించే గ్యాసోలిన్‌, జెట్‌ ఫ్యుయెల్‌ వంటి ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడం. మూడు: ముడి చమురు గిరాకీలో స్వల్పంగానైనా పెరుగుదల కనిపిస్తుండటం. ముడి చమురు ధరల్లో ఇప్పటికిప్పుడు కొంత పెరుగుదల కనిపిస్తున్న మాట నిజమే అయినప్పటికీ- స్వల్ప, మధ్య కాలావధుల్లో ధరలు ఇంతకు మించి పైకి ఎగబాకే అవకాశాలు తక్కువే! అంతర్జాతీయ వేదికపై చోటుచేసుకుంటున్న ఈ మార్పులు మన దేశంలో ప్రభుత్వాల నిర్ణయాలను, విధానాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేయనున్నాయన్నది కాదనలేని నిజం.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల ఉద్ధృతి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. దక్షిణ కొరియా ప్రభుత్వం తమ దేశంలో కరోనా ‘రెండో దశ’ (సెకండ్‌ వేవ్‌) మొదలైనట్లు ప్రకటించింది. మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు ఈ వారంలో అనూహ్యంగా పెరిగాయి. గరిష్ఠ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి సంబంధించి ఏ రోజుకారోజు కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. మానవాళిని వణికిస్తున్న పరిణామమిది. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న చైనాలో ఈ మహమ్మారి మరోమారు కోరసాచవచ్చునన్న అంచనాలూ ఉన్నాయి. అదే జరిగితే ఇప్పటికే కుదేలై ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోయే అవకాశాలే ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు కుంచించుకుపోతే ఆ మేరకు చమురు డిమాండ్‌ సైతం తగ్గిపోతుంది. ఫలితంగా ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయి. ప్రచండ గాలి, వానలతో కూడిన హరికేన్ల సీజన్‌ మొదలుకానుండటం ముడి చమురు ధరలకు సవాలు విసురుతున్న మరో అంశం. ముడి చమురు ధరలు సమీప భవిష్యత్తులో బాగా పెరుగుతాయి అని ఎవరైనా ఆశలు పెట్టుకుంటే- ఆ అంచనాలను నీరుగార్చే పరిణామమిది. ఇంకా మరెంతోకాలంపాటు ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు తక్కువ ధరలకే లభించే అవకాశాలున్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలుగానీ, ఆర్థిక నిపుణులుగానీ ఈ మార్పును గమనంలోకి తీసుకొని విధానాలను, వ్యూహాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

ధర తగ్గినా సెగ ఎక్కువే...

ప్రపంచవ్యాప్తంగా మారిన భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మునుపటిలా ముడి చమురు బ్యారెల్‌కు 70 డాలర్ల ధర పలికే అవకాశాలైతే కనిపించడం లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై భారత్‌ ప్రభావం చాలా తక్కువ. చమురు ధరల్లో చోటుచేసుకునే ఏ చిన్న మార్పు అయినా భారత్‌లోని అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది. కొంతకాలంగా ముడి చమురు రేట్లు తక్కువగా ఉండటం భారత్‌కు బాగా కలిసి వస్తోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు 507.64 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురు కొనుగోలుకు చెల్లించాల్సిన డబ్బు బాగా తగ్గిపోవడంతో విదేశీ మారక నిల్వలు ఇనుమడిస్తున్నాయి. 2019లో భారత్‌ రోజూ సగటున 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకొనేది. చమురు బిల్లు తగ్గడంవల్ల కలుగుతున్న ప్రయోజనాలను స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక పద్ధతిలో వ్యూహాలను రచించుకొని ప్రభుత్వం దేశానికి ఆ లాభాలను బదలాయించాల్సి ఉంది. ధరల తగ్గుదల ప్రయోజనాలను సాధారణ ప్రజలకు విస్తృతంగా బదలాయించడం స్వల్పకాలావధిలో చేయాల్సిన పని. చముల ధరలు కోసుకుపోతే వస్తు సేవల రవాణా వ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు బాగా తగ్గుతాయి. ఫలితంగా ఆయా వస్తు సేవల ధరలు కనిష్ఠానికి చేరి ప్రజలకు ప్రయోజనం సంప్రాప్తిస్తుంది. ఫలితంగా వినియోగదారుల కొనుగోలు శక్తి సైతం పెరుగుతుంది. దేశీయంగా వస్తు సేవల గిరాకీ కొత్త పుంతలు తొక్కుతుంది. డిమాండ్‌ పడకేయడంవల్ల మట్టానికి పడిపోయిన దేశ ఆర్థిక పురోభివృద్ధికి వస్తు సేవల గిరాకీ పెరగడం ఇప్పుడు అత్యవసరం. ముడి చమురు ధరలు తగ్గడంవల్ల ఒనగూడుతున్న ప్రయోజనాలను సాధారణ ప్రజానీకానికి బదలాయించకపోవడం అతిపెద్ద సమస్య.

నిల్వసామర్థ్యం పెరగాలి

గడచిన పదిహేను రోజుల వ్యవధిలో దిల్లీలో లీటరు పెట్రోలు ధర సుమారు తొమ్మిది రూపాయలు పెరగగా, డీజిల్‌ రేటు ఎనిమిది రూపాయల మేర ఎగబాకింది. ముడి చమురు బిల్లు తగ్గడంవల్ల లాభాలను ప్రజలకు అందించకుండా పన్నుల ఆదాయం పెంచుకునేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. కానీ, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోతుంది. ఎడతెగకుండా చమురు ధరలను పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమిది. చవకగా లభ్యమవుతున్న ముడి చమురును సాధ్యమైనంత ఎక్కువగా సేకరించి నిల్వ చేసుకోవడం అన్నది ప్రభుత్వం అనుసరించాల్సిన మధ్యకాలిక వ్యూహం. ప్రస్తుతం దేశంలో 3.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. ఈ నిల్వలు తొమ్మిది రోజుల పాటు దేశ అవసరాలను తీరుస్తాయి. చైనా, జపాన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌ చమురు నిల్వ సామర్థ్యం మరీ తీసికట్టుగా ఉంది. చైనా వద్ద 55కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వ సదుపాయాలు ఉండగా- జపాన్‌ 52.8కోట్ల బ్యారెళ్ల సామర్థ్యంతో భారత్‌కు అందనంత ఎత్తున ఉంది. చమురు నిల్వ సామర్థ్యం పెంచుకోవడంకోసం పెట్టుబడులను భారీగా వెచ్చించాల్సిన తరుణమిది. దీనివల్ల చవకగా లభ్యమవుతున్న ముడి చమురును పెద్దయెత్తున నిల్వ చేసుకోగల అవకాశాలు పెరగడంతోపాటు- ఆ మేరకు నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలూ విస్తరిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు పెరగడం చాలా అవసరమని వేరే చెప్పనవసరం లేదు. దీర్ఘకాలంలో పునరుత్పాదక ఇంధన వనరులతో దేశాన్ని సుసంపన్నం చేయడంతోపాటు, నాణ్యమైన ఇంధన వనరులను సాధించుకోవడం చారిత్రక అవసరం. ఎప్పటికప్పుడు మారిపోయే ముడి చమురు ధరలను నమ్ముకొని దేశ ఆర్థిక ప్రస్థానాన్ని నిర్దేశించుకోవడం సాధ్యమయ్యే పనికాదు. అలాగని అంతర్జాతీయ ముడి చమురు ధరలను ప్రభావితం చేయడం భారత్‌కు సాధ్యమయ్యే విషయమూ కాదు. ఆర్థిక అవసరాలతోపాటు, పర్యావరణ అనివార్యతలను సైతం దృష్టిలో పెట్టుకొని భారత్‌ క్రమంగా పునరుత్పాదక ఇంధన వనరులవైపు కదలడమే శ్రేయస్కరం.

-డాక్టర్​ మహేంద్రబాబు కురువ(హెచ్‌ఎన్‌బీ గఢ్వాల్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ డీన్‌)

ABOUT THE AUTHOR

...view details