తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహిళలపై దాష్టీకాలకు అంతం లేదా? - హాథ్రస్ సామూహిక అత్యాచారం అప్డేట్

కశ్మీర్​ కతువాలో 8 ఏళ్ల బాలికపై పూజారి అత్యాచారం.. తెలంగాణలో దిశ.. ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్​లో మైనర్ యువతిపై రేప్.. తాజాగా హాథ్రస్ ఘటన. దేశంలో మహిళలపై హింస పెరిగిపోతోందనేందుకు ఇవి ఉదాహరణలు. నిర్భయ, పాస్కో, దిశ వంటి కఠిన చట్టాలు చేసినా మహిళలపై అకృత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. వీటిని తుపాకీతో అడ్డుకోవాలని భావిస్తే పొరపాటే. విలువలతో కూడిన విద్య, అసమానతల్లేని సమాజమే వీటికి అడ్డుకట్ట వేసే సాధనమని గుర్తించాలి.

crimes against women
మహిళలపై దాష్టీకాలకు అంతం లేదా?

By

Published : Oct 7, 2020, 8:21 AM IST

మహిళల మీద దాడులు, అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. తెలంగాణలో చోటుచేసుకున్న 'దిశ' హత్యాచార ఘటనతోపాటు- ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 17 ఏళ్ల మైనర్‌ యువతిపై అత్యాచారం, కశ్మీర్లోని కతువా కుగ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై పూజారి అత్యాచారం వంటి దారుణాలే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌లో 19ఏళ్ల దళిత యువతిని నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి, ఎముకలు విరగొట్టి, నాలుక కోసి; కాళ్ళు, చేతులు కదలలేని స్థితిలో పడవేయడం అందరినీ హతాశుల్ని చేసిన పాశవిక ఘటన. ఆ ఘటన తరవాత హాథ్రస్‌ జిల్లా ఆస్పత్రిలోనూ, తదనంతరం పరిస్థితి విషమించడంతో అలీఘర్‌లోని జవహర్లాల్‌ నెహ్రూ మెడికల్‌ కళాశాల హాస్పిటల్‌కు, అనంతరం దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వైద్యశాలకు తరలించారు. కానీ, అత్యాచార గాయం పదే పదే గుర్తుకు రావడంతో సెప్టెంబర్‌ 29న ఆమె గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. హాథ్రస్‌లో చితి ఆరకముందే యూపీలోని బలరాంపురం జిల్లాలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే యువతికి కొందరు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి అపస్మారక స్థితిలో ఆటోలో ఇంటికి పంపారు. ఆజంగఢ్‌ జిల్లాలోని జియాన్‌పూర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగడితే ఆమె ఆపస్మారక స్థితిలోకి జారుకుంది.

నిర్భయ, పాస్కో, దిశ వంటి కఠిన చట్టాలు చేసినా మహిళలపై అకృత్యాలు ఏమాత్రం ఆగడం లేదు. జాతీయ నేర పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం 2018 గణాంకాలతో పోలిస్తే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు 2019లో 7.3 శాతం మేర పెరిగాయి. ఈ గణాంకాల ప్రకారం భారత్‌లో సగటున రోజుకు 87 అత్యాచారాలు నమోదవుతున్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సమాచారం ప్రకారం 59,853 కేసులతో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉండగా; రాజస్థాన్‌ 41,550 సంఖ్యతో రెండో స్థానంలో, 37,144 కేసులతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. మహిళల కిడ్నాపింగ్‌, లైంగిక వేధింపుల కేసుల విషయంలోనూ 7,444తో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రథమ స్థానంలో, మహారాష్ట్ర 6,402తో రెండో స్థానంలో, 6,053తో మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

కారణాలెన్నో

సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న నేరాలకు- దిగజారిపోతున్న విలువలు, సంప్రదాయాలు, పిల్లల పెంపకంలోని లోపం, చెడు సహవాసాలు, సామాజిక మాధ్యమాల్లో పెల్లుబుకుతున్న అశ్లీల సమాచారాన్ని కారణాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు సామాజిక, ఆర్థిక, కుల, మతపరమైన అనేక కారణాలతో హింసాత్మక ఘటనలు మితిమీరుతున్నాయి.

కులం కోణం

హాథ్రస్‌ ఘటన వెనక కులపరమైన దుర్విచక్షణ ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దళిత బాలికను, ఆమె కుటుంబ సభ్యులను అదే గ్రామానికి చెందిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులు గడచిన కొన్నేళ్లుగా వేధింపులకు గురి చేశారని ప్రాథమికంగా తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన సందీప్‌ అనే వ్యక్తి తండ్రి ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో మూడు నెలలు జైలుకు వెళ్ళారు. ఇందుకు కక్ష సాధింపుగా హాథ్రస్‌ అత్యాచార ఘటన జరిగిందన్న వాదన దిగ్భ్రాంతపరుస్తోంది. ఆ ఘటన తరువాత గ్రామంలోని మిగిలిన దళిత కుటుంబాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఠాకూర్ల ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు మొదటి రెండు వారాలు ఆ వార్తను బయటకు పొక్కనివ్వలేదన్న వాదన ఉంది.

షేర్​లు, లైకులకే సరిపోయే!

దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'భేటీ పడావ్‌ భేటీ బచావ్‌'తోపాటు మహిళా సాధికారతకు ఉద్దేశించిన మరెన్నో పథకాలు, బడుగుల హక్కుల పరిరక్షణ వంటివి పుస్తకాలకు, రాజ్యాంగ ప్రతులకు పరిమితమవుతున్నాయి. సామాజిక చైతన్యం రోజు రోజుకూ అంతరించిపోతోంది. సాంకేతిక విప్లవం ద్వారా వచ్చిన మార్పులవల్ల యువత అత్యధిక సమయం సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతోంది. ఈ తరహా అత్యాచార ఘటనలను రకరకాలుగా 'షేర్‌' చెయ్యడం, లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడంతోనే దేశంలోని మెజారిటీ యువత సరిపెట్టుకుంటోంది. ఈ స్తబ్ధత దీర్ఘకాలం కొనసాగితే యువత క్రియాశూన్యం కావడం ఖాయం.

ప్రజాచైతన్యమే సమాధానం

బాపూజీ అస్త్రాలైన అహింస, సత్యాగ్రహం వంటి మహోన్నత అస్త్రాలు కాలగర్భంలో కనుమరుగవుతున్నాయి. మహిళలపై హింస, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, అక్రమ రవాణా నిత్యకృత్యాలయ్యాయి. కఠిన శిక్షలు, ఎన్‌కౌంటర్లతోనే ఈ సమస్యను పరిష్కరించగలమనుకుంటే పొరపాటు. నిజానికి ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి, సమస్య మూలాలను పసిగట్టి వాటిని అంతమొందించడానికి విలువలతో కూడిన విద్యతోపాటు అసమానతల్లేని సమాజంకోసం నిరంతర ప్రయత్నాలు జరగాలి. భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఇలాంటి రుగ్మతలకు ప్రజా చైతన్యంతోనే సమాధానం చెప్పాలి.

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

(మధ్యప్రదేశ్‌లోని అమర్‌ కంఠక్‌ గిరిజన వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

ABOUT THE AUTHOR

...view details