తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పర్యావరణ సమతౌల్యానికి తూట్లు- అంతరిస్తున్న జీవజాలం! - అంతరిస్తోన్న జీవజాలం

మానవుడు తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. పెరిగిపోతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి అడవులను నరికివేయడంవల్ల వన్యప్రాణులకు ఆవాసాలు కనుమరుగై అవి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. జంతువుల అక్రమ రవాణా వల్ల రకరకాల వైరస్‌లు, ఇతర రోగకారక క్రిములు ప్రపంచం నలుమూలలకు వ్యాపిస్తున్నాయి. కరోనా వైరస్‌ ప్రయాణికుల ద్వారా దేశదేశాలకూ పాకింది. ప్రకృతి సమతౌల్యానికి భంగం కలిగించినందుకు మానవుడు నేడు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాడు. అయినా అతడికి జ్ఞానోదయం కలగలేదని ప్రపంచ వన్యప్రాణి రక్షణ సంస్థ ప్రచురించిన లివింగ్‌ ప్లానెట్‌-2020 నివేదిక ధ్రువీకరిస్తోంది.

Biodiversity
జీవజాలం

By

Published : Sep 22, 2020, 6:49 AM IST

జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులు అపార ఆర్థిక, ప్రాణ నష్టాలను సృష్టిస్తాయని పదేపదే రుజువవుతోంది. ఒకప్పుడు ప్లేగు వ్యాధి బారినపడి అయిదు కోట్లమంది మరణించగా, వారిలో సగం ఆసియా, ఆఫ్రికాలలో కన్నుమూశారు. మిగతా ప్రాణనష్టం ఐరోపాలో జరిగింది. అప్పటి ఐరోపా జనాభాలో నాలుగోవంతు ప్లేగు వలతుడిచిపెట్టుకుపోయింది. 1918-20 మధ్య విరుచుకుపడిన స్పానిష్‌ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా అయిదు కోట్లమంది ప్రాణాలు తీసింది.

నేడు కొవిడ్‌ వల్ల మరణాలు రోజురోజుకూ పెరగడం చూస్తూనే ఉన్నాం. ప్లేగు ఎలుకల ద్వారా వ్యాపిస్తే, కొవిడ్‌కు కారణమైన కరోనా వైరస్‌ గబ్బిలాలు, అలుగుల నుంచి మానవులకు సోకిందని భావిస్తున్నారు. ఇక ఎయిడ్స్‌-హెచ్‌ఐవీ వైరస్‌ చింపాంజీల నుంచి మనుషులకు సంక్రమించిందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. ఇలా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే రోగాలను జూనోటిక్‌ వ్యాధులంటారు. ఆఫ్రికాలో చింపాంజీలను వేటాడేవారికి, వాటి రక్తం ద్వారా హెచ్‌ఐవీ వైరస్‌ సోకిందని; గబ్బిలాలు, అలుగులను తినడంవల్ల చైనాలో కరోనా వైరస్‌ విజృంభించిందని నిర్ధారణ అయింది.

ఈ విధంగా మానవుడు తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. పెరిగిపోతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి అడవులను నరికివేయడంవల్ల వన్యప్రాణులకు ఆవాసాలు కనుమరుగై అవి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. జంతువుల అక్రమ రవాణావల్లా రకరకాల వైరస్‌లు, ఇతర రోగకారక క్రిములు ప్రపంచం నలుమూలలకు వ్యాపిస్తున్నాయి. కరోనా వైరస్‌ ప్రయాణికుల ద్వారా దేశదేశాలకూ పాకింది. ప్రకృతి సమతౌల్యానికి భంగం కలిగించినందుకు మానవుడు నేడు భారీమూల్యమే చెల్లించుకుంటున్నాడు. అయినా అతడికి జ్ఞానోదయం కలగలేదని ప్రపంచ వన్యప్రాణి రక్షణ సంస్థ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రచురించిన లివింగ్‌ ప్లానెట్‌-2020 నివేదిక ధ్రువీకరిస్తోంది.

జంతువులకు మానవుడే మహమ్మారి

మానవ కార్యకలాపాల వల్ల గడచిన 46 ఏళ్లలో అన్ని జంతుజాతుల జనాభా సగటున 68శాతం మేర తగ్గిపోయిందనే భయానక వాస్తవాన్ని ఆ నివేదిక వెల్లడించింది. ఈ క్షీణత క్షీరదాలు మొదలుకొని పాములు, కప్పలు, చేపల వరకు కనిపించింది. మానవుడు చేస్తున్న పర్యావరణ విధ్వంసం మరెన్ని వైరస్‌లు, వ్యాధుల వ్యాప్తికి దారితీయనుందోనన్న ఆలోచనే మరింత భయం కలిగిస్తోంది. 1970-2016 మధ్యకాలంలో 4,000కుపైగా సకశేరుకాల (వెన్నెముక గల జీవుల) సంఖ్యలో హెచ్చుతగ్గులను లివింగ్‌ ప్లానెట్‌ సూచీ (ఎల్‌పీఐ) పరిగణనలోకి తీసుకుంది. మంచినీటి ఆవాసాల్లోని ప్రాణుల సంఖ్య 1970 నుంచి ఏటా నాలుగు శాతం చొప్పున తగ్గిపోతూ వచ్చింది. ఈ లెక్కన 1970 నుంచి 2016 వరకు 84శాతం తగ్గుదల నమోదైంది.

మానవుడు వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం వల్ల వన్యప్రాణుల సంఖ్య పడిపోతోంది. లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక రూపకల్పనకు 120 దేశాల శాస్త్రజ్ఞులు, నిపుణులు సమాచారం అందించారు. భూతాపం, భూవినియోగ తీరులో మార్పులు, కాలుష్యం, మితిమీరిన వినియోగం, భూసార క్షీణత వంటి కారణాలవల్ల జీవవైవిధ్యం దెబ్బతింది. సోయాచిక్కుడు సాగుకు బ్రెజిల్‌లో, పామాయిల్‌ సాగు కోసం ఆగ్నేయాసియాలో భారీయెత్తున అడవుల నరికివేతను ఇక్కడ ఉదాహరించాలి. 2030కల్లా జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి సత్వరం కార్యాచరణ మొదలుపెట్టాలని లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక పిలుపిచ్చింది. ఈ కార్యాచరణలో పర్యావరణ విధ్వంసాన్ని నిరోధించడం, జీవవైవిధ్యానికి భంగం కలగని రీతిలో ఆహారోత్పత్తి, వాణిజ్యం సాగించడం, ప్రకృతికి హాని కలగనివిధంగా మానవుడు ఆహారవిహారాలను మార్చుకోవడం అంతర్భాగాలు కావాలి.

మాయమవుతున్న చిత్తడి నేలలు

ప్రపంచ భూభాగంలో 58 శాతం అడవుల నరికివేత వంటి మానవ కార్యకలాపాల ఒత్తిడికి లోనవుతోంది. 2017తో పోలిస్తే 2019లో భారత్‌లో 5,188 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగినా, ఈశాన్య భారతంలోని గిరిజన జిల్లాల్లో అడవులు తరిగిపోతున్నాయి. అటవీ భూములను పారిశ్రామిక, వ్యావసాయిక ప్రయోజనాలకు మళ్లించడమూ ఆగలేదు. వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత కేవలం రెండు డిగ్రీలు పెరిగినా, సముద్రాల్లో 99 శాతం పగడపు దిబ్బలు అంతరించిపోతాయని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. నేడు సముద్రాల్లో 13 శాతం తప్ప మిగిలిన జలాలన్నీ మానవ కార్యకలాపాల వల్ల కలుషితమయ్యాయని ఎల్‌పీఆర్‌ వెల్లడించింది. వాతావరణ మార్పులకు తోడు మితిమీరిన చేపల వేట, కాలుష్యం, తీరప్రాంతాల అభివృద్ధి పేరిట ధ్వంసరచనకు తెగబడటం సముద్ర జీవులకు ముప్పుతెస్తున్నాయి.

భారత్‌లో 2017తో పోలిస్తే 2018లో చేపలు, రొయ్యల ఉత్పత్తి తొమ్మిది శాతం క్షీణించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. తుపానుల వల్ల ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరిలలో చేపలను వేటాడే సమయం కుదించుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నదులు, చిత్తడినేలలు, చెరువుల్లోనూ మత్స్య సంపద క్షీణించినట్లు ఎల్‌పీఆర్‌ వెల్లడించింది. గడచిన నాలుగు దశాబ్దాల్లో భారతదేశం వ్యవసాయ విస్తరణ, కాలుష్యం, పట్టణీకరణ వల్ల మూడోవంతు చిత్తడి నేలలను కోల్పోయింది. దేశంలోని 20 నదుల పరీవాహక ప్రాంతాల్లో 14 ప్రాంతాల ప్రజలు 2050కల్లా తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటారని ఎల్‌పీఆర్‌ హెచ్చరించింది. అసలు 2030నాటికే దేశ తాగునీటి అవసరాలు రెట్టింపు కానున్నాయి.

ఆలస్యం వద్దు..

పర్యావరణ విధ్వంసం ఇతర విధాలుగానూ నష్టాలు కొనితెస్తోంది. భారత్‌లో అయిదు కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూముల్లో పంటల పరపరాగ సంపర్కానికి 15 కోట్ల తేనెటీగల గుంపులు అవసరం. అందుబాటులో ఉన్నవి 12 లక్షల గుంపులు మాత్రమేనని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. మానవాళి మనుగడకు జీవవైవిధ్య రక్షణ ఎంత ఆవశ్యకమో వేరే చెప్పనక్కర్లేదు. జీవవైవిధ్య సంరక్షణ ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సాధించిన పురోగతిని న్యూయార్క్‌లో తాజాగా సమావేశమవుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ సమీక్షించనుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌-లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక సరైన సమయంలో వెలువడి అంతర్జాతీయ సమాజానికి బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచం తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఇక ఎంతమాత్రం జాగు చేయకూడదు!

భారత్‌కు మేల్కొలుపు

ముఖ్యంగా భారతదేశం వేగంగా కార్యాచరణకు ఉపక్రమించాలి. ప్రపంచ భూభాగంలో భారత్‌ కేవలం 2.4 శాతాన్ని ఆక్రమిస్తున్నా, 45,000 జాతుల మొక్కలకు భరత ఖండం ఆలవాలం. ప్రపంచంలో అంతరించిపోయిన 600 విత్తన మొక్క జాతుల్లో ఆరు భారత్‌కు చెందినవే. పారిశ్రామిక యుగానికి ముందునాళ్లకన్నా ఇప్పుడు 500 రెట్లు ఎక్కువ వేగంగా విత్తన మొక్కలు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చడం, పాడి పరిశ్రమ, ఉద్యాన పంటల విస్తరణలు మొక్కలకు ప్రాణాంతకమవుతున్నాయని లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక (ఎల్‌పీఆర్‌) హెచ్చరించింది. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 40 శాతం వృథా అవుతోందని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. నగదులో ఈ వృథా విలువ 1,060 కోట్ల డాలర్లని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ తెలిపింది. భారత్‌ అనే కాదు, మొత్తం ప్రపంచ ఆహారోత్పత్తిలో మూడోవంతు వృథా అయిపోతోంది. కర్బన ఉద్గారాల్లో ఆరు శాతానికి ఆహార వృథాయే కారణమవుతూ వాతావరణ మార్పులకు దారితీస్తోంది.

(రచయిత- ఏఏవీ ప్రసాద్‌)

ABOUT THE AUTHOR

...view details