వృత్తి విద్యాసంస్థల్లో జరిగే ప్రాంగణ నియామకాలు గత అయిదేళ్లుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2015-16లో 16.38 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా అందుకోగా, కేవలం 43 శాతానికే ఉద్యోగ అవకాశాలు లభించాయి. 2019-20లో 15.20 లక్షల మంది ఉత్తీర్ణులవగా 47.5 శాతమే ఉద్యోగాలు పొందగలిగారు. భారత సాంకేతిక విద్యా మండలి గణాంకాల ప్రకారం గత అయిదేళ్లలో 79.92 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా కేవలం 46.5 శాతమే ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరగక పోవడానికి ఎన్నో కారణాలు తోడవుతున్నా... గత ఏడాది కాలంగా ప్రాంగణ నియామకాలపై కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో చదివిన వేల మంది విద్యార్థులు కొవిడ్ కారణంగా ప్రాంగణ నియామకాలు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ప్రాంగణ నియామకాలపై నీలినీడలు కమ్ముకోవడం వల్ల ఎంతోమంది ఆశావహులకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొరవడిన ఉద్యోగ భద్రత..
మహమ్మారి కారణంగా అనేక ప్రైవేట్ బహుళ జాతి సంస్థలు ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుగా ప్రాంగణ నియామకాల కోసం విద్యాసంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు సుమారు 60 శాతం మేర కార్పొరేట్ సంస్థలు ప్రకటించాయి. అదే బాటలో మరికొన్ని సంస్థలు నియామక ప్రణాళికలు, విద్యార్థులకు ఇచ్చిన ముందస్తు ఆఫర్ల రద్దు సందేశాలు పంపించాయి. మరోవైపు ఐఐఎంలతోపాటు ప్రముఖ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లను ఉబర్ సంస్థ రద్దు చేసింది. పేరొందిన విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక సగటు విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ భద్రత దొరకడం కష్టతరమేనని అర్థమవుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్ర సేవల సంస్థ ష్లంబర్గర్- కొవిడ్ కారణంగా ఇకపై ఇంటర్న్‌షిప్, ఉద్యోగ అవకాశాల కల్పనను ఉపసంహరించుకుంటున్నట్లు దేశంలోని పలు ఉన్నత శ్రేణి సాంకేతిక విద్యాసంస్థలకు తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా దేశంలో పేరొందిన అనేక విద్యాసంస్థలు తమ విద్యార్థులకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి. ప్రాంగణ నియామకాలు భారీగా జరగకపోతే విద్యాసంస్థల మనుగడకే ఇబ్బందులు తప్పవు. వేలమంది విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించినా, కొవిడ్ వ్యాప్తి కారణంగా నియామక పత్రాలు అందుకోలేక పోయారు.
భవిష్యత్తు అంధకారం..