కోట్లాది కుటుంబాల్లో నిప్పులు పోసిన మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోక మునుపే ముందుజాగ్రత్తలకు మంగళం పాడేస్తూ వీధుల్లో ప్రజా సమూహాలు స్వేచ్ఛావిహారం చేస్తున్నాయి. కరోనా కట్టడిలో కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలేమో నిర్లిప్త వైఖరులతో వేడుక చూస్తున్నాయి. ఆంక్షల తొలగింపుతో అటకెక్కుతున్న కొవిడ్ మార్గదర్శకాలతో మూడో ఉద్ధృతి ముంచుకు రావడం తథ్యమని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) హెచ్చరించింది. పర్వత ప్రాంతాలకు పోటెత్తుతున్న పర్యాటకులు, మత కార్యక్రమాల సందర్భంగా భక్తుల నియంత్రణలో ఏలికల ఏమరుపాటు ప్రజావళికి ప్రాణాంతకమని పేర్కొంది.
క్షేత్రస్థాయిలో కట్టుదాటుతున్న పరిస్థితిపై తాజాగా ఆందోళన వ్యక్తంచేసిన ప్రధాని మోదీ- నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొవిడ్ మూడో దుర్దశను నివారించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీలో ఆయన ఉద్బోధించారు. క్రితం మాసంతో పోలిస్తే ఈ నెలలో దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం నీరసించిపోయిందన్నది చేదు నిజం! సగటున 62 లక్షల డోసులను పంపిణీ చేసిన రోజుల నుంచి నేడు 35-40 లక్షల డోసులతో సరిపుచ్చుతుండటమే ఆందోళనకరం. వచ్చే మూడు నెలల్లో 10శాతం జనాభాకు, సంవత్సరాంతాని కల్లా 40శాతానికి టీకాలందితేనే ఏ దేశమైనా మహమ్మారి కోరల్లోంచి బయటపడగలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
టీకాల కొరత
వ్యాక్సినేషన్ ఆరంభించి ఆర్నెల్లు అవుతున్నా- భారత్ మాత్రం తన జనావళిలో 7.7శాతానికే రెండు డోసుల టీకాలు అందించగలిగింది! దేశీయుల్లో దాదాపు సగం మందికి టీకా రక్షణ కల్పించిన అమెరికా, యూకేలకు భిన్నంగా వ్యాక్సిన్ల కొరతతో ఇండియా ఈసురోమంటోంది. గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ దుస్థితిపై ఇప్పటికే గళమెత్తాయి. టీకాల లేమితో ఒడిశా, మధ్యప్రదేశ్ వంటివి జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను ఆపేస్తున్నాయి. జనసంఖ్యలో ముందున్న 15 రాష్ట్రాల్లో టీకా కార్యక్రమం ఒక కొలిక్కి రావాలంటే 19 నెలల సమయం పడుతుందంటున్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మందంటూ లేని మహమ్మారిపై టీకాయే సుదర్శన చక్రమైన వేళ- యావద్భారతాన్ని సత్వరం ఆ రక్షణ ఛత్రంలోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాలు తమ ప్రణాళికలను పునస్సమీక్షించుకోవాలి!