లాక్డౌన్... కరోనా నియంత్రణకు దాదాపు అన్ని దేశాలు ఎంచుకున్న మార్గం. కానీ... జనజీవనాన్నే స్తంభింపచేసిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీ ఈ నిబంధనలను సడలించాయి ఆయా దేశాలు. ఇక అప్పటినుంచి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం భారత్‌లోనూ ఇదే పరిస్థితి. ఐదు విడతల లాక్డౌన్ తర్వాత జూన్ 8 నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే విధంగా సడలింపులు ఇచ్చింది మోదీ ప్రభుత్వం. అన్‌లాక్ వల్ల ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభమై, ఆదాయాలు పెరిగాయి. జూన్‌లో జీఎస్టీ వసూళ్లు కరోనాకు ముందున్న స్థాయిలో నమోదయ్యాయి. కానీ... అదే సమయంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల నుంచి ఆరు లక్షలకు ఎగబాకింది.
అన్‌లాక్ ప్రభావమెంత?
లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగే అవగాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా విషయంలో ఏదైనా ఉపాయం ఆలోచించనిదే ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించలేమని కొంత మంది ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో అన్‌లాక్ చర్యలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
"కరోనాకు శాస్త్రీయ సమాధానాలు కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ లోగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ, ప్రజల జీవనోపాధి పరిరక్షణ మధ్య సమతుల్యమే అసలు సవాలు."
-ఆర్ గాంధీ, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
కరోనా కేసులు వందల్లో ఉన్నప్పుడే మోదీ ప్రభుత్వం దేశంలో కఠినమైన లాక్‌డౌన్‌ను విధించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఈ సమయంలో వ్యాపారాలు అపార నష్టాన్ని మూటగట్టుకున్నాయని జీఎస్టీ వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,13,866 కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఈ సంఖ్య రూ.32,294 కోట్లకు పడిపోయింది. అంటే గతేడాదితో పోలిస్తే 72 శాతం(రూ. 81,572 కోట్లు) తగ్గుదల నమోదైంది.
అయితే తర్వాత ప్రభుత్వం క్రమంగా నిషేధాలను సడలించడం వల్ల వసూళ్లు పెరిగాయి. మే నెలలో రూ. 62,009 కోట్లు, జూన్‌లో రూ. 90,917 కోట్ల వస్తుసేవల పన్ను వసూలైంది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ సంఖ్య 9 శాతం తక్కువ. దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కొవిడ్ పూర్వ స్థితికి వచ్చినట్లు అర్థమవుతోంది.
పంజా విసిరిన కరోనా
ఆర్థిక వ్యవస్థ ఎలాగున్నా... ఈ సమయంలో కరోనా కేసులు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. వరల్డ్ఓమీటర్ ప్రకారం జూన్ 1న దేశంలో 1,98,370 యాక్టివ్ కేసులు ఉండగా.. ఈ సంఖ్య జూన్ 15 నాటికి 3,43,026కి పెరిగింది. 15 రోజుల్లోనే 1,44,656 కేసులు అదనంగా నమోదయ్యాయి.