దేశంలో అరకోటికి, విశ్వవ్యాప్తంగా మూడు కోట్లకు చేరువవుతున్న కొవిడ్ కేసులు- పట్టపగ్గాలు లేని మహమ్మారి విజృంభణ తీవ్రతను చాటుతున్నాయి. కరోనా వైరస్ కోరలు తుంచే సరైన విరుగుడు కోసం దేశదేశాల్లో 140కి పైగా సాగుతున్న ప్రయోగాల సాఫల్యం కోసం మానవాళి ప్రాణాలు ఉగ్గబట్టుకుని చూస్తోంది. రెండు దశలు దాటి అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కసరత్తుకు ఇటీవల అనూహ్య పరిణామంతో అవరోధం ఏర్పడింది. యూకే ఔషధ దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ వేయించుకున్న ఒక వాలంటీర్‌లో నరాల సమస్య తలెత్తిన దరిమిలా మూడో దశ ప్రయోగాల్ని తాత్కాలికంగా నిలిపేసి, హుటాహుటిన స్వతంత్ర భద్రతా సమీక్షా సంఘం పరిశీలన తరవాత పునరుద్ధరించారు.
అంత సులభం కాదు!
వ్యాక్సిన్ సురక్షితమా కాదా, కచ్చితంగా రోగనిరోధానికి పనికొస్తుందా లేదా అన్న కీలకాంశాల్ని నిగ్గుతేల్చడానికి పలు అంచెల్లో విస్తృతంగా సాగించే పరిశోధనల్లో ప్రతిదశలోనూ నెగ్గుకురావడమే దాని సాఫల్యానికి గీటురాయి. ఎన్నో సంక్లిష్టతల దృష్ట్యా, కరోనా మీద పైచేయి సాధించేలా వ్యాక్సిన్ రూపకల్పన ఏమంత సులభతరం కాదని పలువురు శాస్త్రవేత్తలు కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. తమ దేశ వ్యాక్సిన్ తయారీ ప్రయోగశాలలపై చైనా హ్యాకింగ్‌కు పాల్పడుతోందన్న శ్వేతసౌధాధిపతి ట్రంప్ ఆరోపణ, పూర్తిస్థాయి అనుమతులు రాకముందే స్వచ్ఛందంగా ఆరోగ్య కార్యకర్తలు టీకా పొందవచ్చునన్న బీజింగ్ హడావుడి ప్రకటన, మూడో దశ ఊసెత్తకుండానే సామూహిక వ్యాక్సినేషన్‌కు రష్యా సన్నాహాలు... ప్రాణాధారం కావాల్సిన సంజీవనిపై అనేకానేక సందేహాలు లేవనెత్తాయి. మూడో దశ ప్రయోగాలూ పూర్తయ్యాకే వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగానికి తీసుకువచ్చే ప్రక్రియ పరిపూర్తికి 12-18 నెలల వ్యవధి అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే సంవత్సరం మొదట్లో వ్యాక్సిన్‌ను అందరికీ చేరువ చేస్తామంటున్న ఆస్ట్రాజెనెకా తాజా వివరణా, అనర్థదాయకమైన తొందరపాటుతనాన్నే సూచిస్తోంది.