తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పేదరిక నిర్మూలనపై బహుముఖ పోరు!

కరోనా కారణంగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో మరింత పేదరికం పెరిగింది. మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ఉపాధి కల్పనకూ తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా పేదరికం మరింత పెరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతేగాక, వాతావరణ మార్పుల వల్లా పేదలకు కష్టాలు తప్పవని భావిస్తున్నారు.

POVERTY
పేదరిక నిర్మూలనపై బహుముఖ పోరు!

By

Published : Oct 17, 2020, 8:41 AM IST

Updated : Oct 17, 2020, 10:15 AM IST

మానవాళిని పేదరికంనుంచి బయటపడేసేందుకు ప్రపంచ దేశాలన్నీ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ నిర్విరామ కృషిని కొవిడ్‌ మహమ్మారి అడ్డుకుంది. పేదరికం ఇప్పుడు కట్లుతెంచుకుని ప్రపంచానికి కొత్త సవాళ్లు విసరుతోంది. ఇవ్వాళ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం. అసమానతలను తొలగించి ప్రజానీకానికి సామాజిక, పర్యావరణపరంగా న్యాయం చేయాలన్న నినాదంతో ఈ యేడు పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

పేదరికం బహుముఖాలుగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో- పర్యావరణ మార్పులను, వాతావరణపరంగా ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోకుండా సామాజిక సమానత్వం సాధ్యంకాదన్న అవగాహన పెరుగుతోంది. ఆదాయాలపరంగా అసమానతలను తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా కొంతలో కొంత పురోగతి కనిపిస్తోంది. అయితే- పర్యావరణ సమస్యల రూపంలో ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగు వర్గాలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో అలసత్వం కూడదన్న వాదన బలంగా విస్తరిస్తోంది.

కరోనాతో వేటు

దెబ్బకొట్టిన కరోనాఆకలి ప్రధాన సమస్యగా అనేక దేశాలను వేధిస్తోంది. నిరుడు 88 దేశాల్లో 10 కోట్లమంది అన్నార్తులకు తోడ్పాటును అందించిన ప్రపంచ ఆహార కార్యక్రమాని(డబ్ల్యూఎఫ్‌పీ)కి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి లభించడం ముదావహం. కొవిడ్‌ కారణంగా అంతర్జాతీయంగా ఉపాధి కల్పనకు ఈ ఏడాది తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా పేదరికం మరింతగా విజృంభిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండే జనాభా శాతం ఈసారి బాగా పెరుగుతుందన్న అంచనాలున్నాయి.

ఉపాధి కోసుకుపోవడంతో అసంఘటిత రంగంలోని ఎంతోమంది పేదరికం బారినపడే అవకాశాలున్నాయి. యుఎన్‌-వైడర్‌’ వర్సిటీ అధ్యయనం ప్రకారం తలసరి ఆదాయం లేదా వినియోగంలో ఈ దఫా పదిశాతం మేర కోతపడే అవకాశాలున్నాయి. ఆ ప్రాతిపదికన అమెరికాలో రోజువారీ ఆదాయం 1.90 డాలర్లకు లోబడి ఉన్నవాళ్లు 18 కోట్లకు, 3.20 డాలర్లకు దిగువన ఉన్నవారు 28 కోట్లు, 3.20 డాలర్లకంటే తక్కువ ఉన్నవాళ్లు 25 కోట్లమంది అని అంచనా. 2030నాటికి పేదరికానికి చరమగీతం పాడాలన్న ‘సమితి’ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు కొవిడ్‌ కారణంగా పెద్ద దెబ్బ తగిలింది.

ఆఫ్రికా, ఆసియాలో పెరిగిన పేదలు

పేదరిక నిర్మూలన క్రమంలో 1990నుంచి క్రమం తప్పకుండా సాధిస్తూ వచ్చిన విజయాలకు ఈ ఏడాది కరోనా కారణంగా తీవ్ర విఘాతం ఏర్పడింది. సబ్‌ సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల్లో పేదల సంఖ్య మరింత ముమ్మరించనుంది. ప్రపంచంలోని పేదల్లో మూడింట రెండొంతులు ఈ ప్రాంతాల్లోనే ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. రోజుకు 3.2 యూఎస్‌ డాలర్ల ఆదాయం కంటే తక్కువ సంపాదనను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాసియాలో పేదల సంఖ్య 2018లో 84.7 కోట్లు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 91.5 కోట్లకు చేరే అవకాశం ఉంది.

కరోనావల్ల ఈ సంవత్సరం 8.8 నుంచి 11.5 కోట్లమంది ప్రజలు దుర్భర దారిద్య్రంలోకి జారుకుంటారని ప్రపంచబ్యాంకు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్‌ ఇప్పుడు కొత్తగా ముంచుకొచ్చిన ముప్పు. కానీ, ప్రపంచవ్యాప్త సంఘర్షణలు, పర్యావరణ మార్పుల కారణంగా ఏటికేడు కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారుకుంటున్నారు.

ముంబయిని శ్లాఘించిన ప్రపంచబ్యాంకు

ముంబయి నగరంలోని మురికివాడల్లో భయానకంగా విస్తరించిన కరోనా వైరస్‌ను విస్తృత, మెరుగైన ప్రజాభాగస్వామ్యంతో అధికారులు సమర్థంగా కట్టడి చేయడాన్ని ప్రపంచబ్యాంకు అధ్యయనం శ్లాఘించింది. మూకుమ్మడిగా టెస్టులు చేయించడం, ప్రైవేటు క్లినిక్కుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి చర్యలతో ముంబయి నగర యంత్రాంగం కరోనాను చాలావరకు నియంత్రించగలిగింది.

27% పెరిగిన పేదరికం

కొవిడ్‌కు ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. నిరుద్యోగిత, ఆదాయాల్లో కోత, గ్రామీణ సంక్షోభం, పౌష్టికాహార లేమి, విస్తరిస్తున్న అసమానతలు దేశాన్ని వెనక్కిలాగాయి. మరోవంక అసంఘటిత రంగంలోని 46.5 కోట్లమంది ఆదాయాలు కొరవడి సతమతమయ్యారు. వ్యవసాయ కార్మికుల సమస్యలు అన్నీఇన్నీ కావు. లాక్‌డౌన్‌ కారణంగా ఊరూరూ తిరిగి పనిచేసుకుని బతికే వలస కార్మికులు దారుణంగా దెబ్బతిన్నారు.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత 8.4శాతం నుంచి 27శాతానికి పెరిగింది. 12.2కోట్లమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇందులో చిన్న వ్యాపారులు, కార్మికులే 9.1 కోట్లమంది ఉన్నారు. కరోనావల్ల భారత్‌లో 40కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులు దుర్భర దారిద్య్రంలోకి జారుకోవచ్చునని అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదిక అంచనా! జీడీపీలో పదిశాతం అంటూ ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో నికరంగా పేదలకు అందిన విత్తసాయం ఒకట్రెండు శాతాన్ని మించి లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

నగదు బదిలీతో పాటు ఆహారం ఇవ్వాల్సింది!

కరోనా స్థాయి ఉపద్రవం తలెత్తినప్పుడు ప్రభుత్వం ప్రకటించే పునరుజ్జీవన ప్యాకేజీ సైతం భారీగా ఉండాలన్నది ఆర్థిక నిపుణుల మాట! నగదు బదిలీ కార్యక్రమాలను పేదల దరికి ప్రభుత్వం భారీయెత్తున తీసుకువెళ్ళి ఉండాల్సిందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ గ్రహీతలైన అభిజిత్‌ బెనర్జీ, ఎస్తెర్‌ డఫ్లోలు అభిప్రాయపడ్డారు.

ఉపాధికి ఊతమివ్వాలికరోనా పాలబడి కుంగిన ప్రజావళిని కాపాడేందుకు ప్రభుత్వం క్రియాశీలంగా కదలాలి. నగదు బదిలీతోపాటు పేదలకు విస్తృతంగా ఆహారాన్నీ అందించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను పెంచాలి. ఆరోగ్య వ్యవస్థలను కొత్త సవాళ్లకు అనుగుణంగా పునర్నిర్మించుకోవాలి. జీడీపీ వృద్ధి గణనీయంగా పడిపోతుందన్న అంచనాల నేపథ్యంలో- ఆర్థిక పునరుజ్జీవంపై తీక్షణంగా దృష్టిసారించాలి.

'ఏటా 80 లక్షల ఉద్యోగాలు అవసరం'

దేశ వ్యవసాయదారుల్లో 86శాతాన్ని ఆక్రమించిన చిన్న, సన్నకారు రైతులకు ఉపయుక్తంగా ఉండేలా సేద్య సంస్కరణలను అమలు చేయాలి. మరీ ముఖ్యంగా ఏటా 70లక్షల నుంచి 80 లక్షల మందికి క్రమం తప్పకుండా ఉపాధి కల్పించడం, దేశంలోని కార్మిక శక్తి నైపుణ్యాలకు సానపట్టడం, ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి వాటిని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దడం, నూతన సాంకేతిక విప్లవానికి అనుగుణంగా వ్యవస్థలను సిద్ధపరచడం, ప్రజలకు సామాజిక భద్రతతోపాటు గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించడం వంటివి ప్రభుత్వాల ప్రాథమ్యాలు కావాలి. ఎగుమతి ప్రధానంగా ఆర్థికవ్యవస్థకు చురుకుపుట్టించాలి.

'పర్యావరణ మార్పులతో 13.5 కోట్ల మంది పేదరికంలోకి'

వస్త్ర పరిశ్రమ, చెప్పులు, గృహోపకరణాల తయారీ వంటి శ్రమ సాంద్ర (లేబర్‌ ఇంటెన్సివ్‌) రంగాలకు ప్రోత్సాహమివ్వాలి. చైనాను వీడుతున్న విఖ్యాత సంస్థలకు వేదికగా నిలిచేందుకు భారత్‌ సృజనాత్మక ఉపాధి కల్పన విధానాలపై దృష్టి సారించాలి. పర్యావరణ మార్పులవల్ల 2030నాటికి 6.8 కోట్ల నుంచి 13.5 కోట్లమంది పేదరికంలోకి జారుకుంటారని అంచనా.

పర్యావరణ మార్పులవల్ల ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆరోగ్య వ్యవస్థలు కొడిగడుతున్నాయి. వరదల వంటి విపత్తులు ముమ్మరిస్తున్నాయి. ఇవన్నీ పేదల వెన్ను విరిచే ఉత్పాతాలే! ధనిక దేశాల విచ్చలవిడి పారిశ్రామికీకరణ- పేద దేశాలకు శాపంగా పరిణమిస్తోంది. కాబట్టి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటమూ ప్రభుత్వాలకు ప్రాధాన్యాంశం కావాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, ఉపాధిపై దృష్టిపెట్టి, ఆరోగ్య వ్యవస్థలను తీరుగా నిర్మించుకుంటేనే పేదరికంపై పోరులో చెప్పుకోదగిన ముందడుగులు వేయగలం!

(ఎస్​ మహేంద్ర దేవ్,ఇందిరా గాంధీ అభివృద్ధి పరిశోధన సంస్థ సంచాలకులు, ఉపకులపతి)

ఇదీ చదవండి:చైనాలో విచ్చలవిడిగా కరోనా టీకా వినియోగం!

Last Updated : Oct 17, 2020, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details