భారత రాజ్యాంగం పౌరులందరికీ దఖలుపరచిన జీవనహక్కు నడివీధిలోనే కొల్లబోతోంది. అడ్డూఆపూ లేని రోడ్డు మాఫియా దురాగతాల పర్యవసానంగా- కొత్తగా వేసిన రహదారులూ రెండుమూడు నెలలైనా గడవకుండానే గుంతలమయమై వాహనదారులకు, పాదచారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు హైదరాబాద్-విజయవాడ, విశాఖ-విజయవాడ ప్రధాన రహదారులతోపాటు కొచ్చి, ముంబై, ఉధంపూర్, కోల్‌కతా వంటిచోట్లా దిగజారిన రోడ్ల దుస్థితి దేశవ్యాప్త అవ్యవస్థకు దర్పణం పడుతోంది. గట్టి వర్షం కురవగానే రోడ్లు గుంతలమయమై, కొన్నిచోట్ల సాంతం కొట్టుకుపోయే సిగ్గుమాలిన దురవస్థకు మూలాలు ఎక్కడున్నాయో మీరే పరికించండి...
భారత్ మాలా పరియోజన, ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజనలంటూ కొన్నాళ్లుగా కేంద్రం సందడి చేస్తోంది. ఈ ఏడాదే నాలుగున్నర వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం నిమిత్తం రూ.50వేల కోట్లదాకా వ్యయం చేయనున్నట్లు ఏడు నెలలక్రితం కేంద్రప్రభుత్వం వెల్లడించింది. గతవారమే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఘనమైన ప్రకటన చేశారు. రెండేళ్లలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలను తలదన్నేలా దేశీయ రహదారుల్ని తీర్చిదిద్దుతామన్న అమాత్యులు- సుమారు మూడు లక్షలకోట్ల రూపాయల ఖర్చుతో ఏడున్నర వేల కిలోమీటర్ల రోడ్లను అద్భుతంగా ఆవిష్కరిస్తామంటున్నారు. మొన్నీమధ్యే ఐఐటీ-బీహెచ్‌యూ (బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)తో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొంది. దేశంలో నాణ్యమైన, దీర్ఘకాలం మన్నిక ఉండే రహదారుల నిర్మాణమే ఆ ఒడంబడిక లక్ష్యం! అటువంటి ఏర్పాట్లు లేకున్నా- వేలకోట్ల రూపాయల ఖర్చుతో వేసిన రోడ్లు కొన్నేళ్లపాటు నమ్మకంగా వినియోగపడాలి కదా! వాస్తవంలో, దేశంలో ఎక్కడైనా అలా జరుగుతోందా? క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విశ్లేషించిన పార్లమెంటరీ స్థాయీసంఘం అయిదు నెలల కిందట కొన్ని నికార్సయిన నిజాలు బయటపెట్టింది. ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల నిర్మాణ పనులు నాసిరకంగా అఘోరిస్తున్నాయని ఆక్షేపించిన కమిటీ- టెండర్లు దక్కించుకోవడానికి గుత్తేదారులు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధర కోట్ చేస్తున్నట్లు నిర్ధారించింది. అలా ప్రాజెక్టును చేజిక్కించుకున్నాక- ఆనవాయితీగా వాటాలు తెగుతున్నాయి. అవినీతి అధికారుల చేతులు తడిపి, ఇతరత్రా విభాగాలకు మేపి, సొంతానికి కొంత బిగపట్టి తక్కిన మొత్తాన్నే వెచ్చిస్తుండటంతో... సహజంగానే, నాణ్యత గంగలో కలుస్తోంది. లంచాలు మరిగిన అధికార సిబ్బందికి గుత్తేదారులకు మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని దెబ్బతీసేలా కనీస టెండర్ల మొత్తాలు నిర్ణయించాలన్నది స్థాయీసంఘం సిఫార్సు. ఆపై కొన్ని వారాల వ్యవధిలోనే, రహదారి వ్యయాల్ని 25 శాతం దాకా తగ్గించాలని కేంద్రమంత్రి గడ్కరీ పిలుపిచ్చారు. వాస్తవిక వ్యయాలన్నీ పరిగణించి మన్నికైన రోడ్డు నిర్మాణానికి కనీసం ఎంత ఖర్చవుతుందన్న ముఖ్యాంశాన్ని గాలికొదిలేసి, బాగా తక్కువ ధర కోట్ చేసినవాళ్లకే గుత్తేదారులుగా కిరీటం తొడుగుతున్నారు. అక్కడే నాసిరకం పనులకు, వాటిని కప్పిపుచ్చడంలో భాగంగా అవినీతి మేతకు బీజాలు పడుతున్నాయి!
ఇటీవలి వర్షాలూ వరదల ధాటికి రూపురేఖలు మారిపోయిన రోడ్లకు రూ.86కోట్లతో సత్వర మరమ్మతు పనులు చేపట్టాలని సంకల్పించిన గుజరాత్ రాష్ట్రప్రభుత్వం- నాణ్యతా ప్రమాణాల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలికలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలవారీగా పరికిస్తే రహదార్లపై పెద్ద పద్దే లెక్క తేలుతుంది. గత ఆరేళ్లుగా ఒక్క తెలంగాణలోనే దాదాపు అయిదున్నర వేల కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి పనులకు ఏడున్నరవేల కోట్ల రూపాయల దాకా వెచ్చించారని అంచనా. ఇలా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున చేస్తున్న ఖర్చుకు తగిన ఫలితం రహదారుల స్థితిగతుల్లో ప్రతిఫలిస్తోందా? దేశమంతటా దశాబ్దాలుగా రోడ్లు వేస్తున్నారు. మరమ్మతులు చేస్తున్నారు. వానలకవి ఛిద్రమవుతూనే ఉన్నాయి. రోడ్లపై గుంతలే రోజుకు సగటున పదిమందిని పొట్టన పెట్టుకుంటున్న దేశం మనది. వాహనాలు అదుపు తప్పి ఏటా లక్షన్నర మందికిపైగా రాదారి ప్రమాదాల్లో కడతేరిపోతున్నారీ గడ్డమీద. ఒక్క ముక్కలో- రోడ్ల డిజైనింగ్, నిర్మాణంలో అవకతవకలు, పర్యవేక్షణలో లోటుపాట్లకు జనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రహదారి రంగ ముఖచిత్రాన్ని మార్చేందుకు కట్టుబాటు చాటుతూ మోదీ ప్రభుత్వం నిరుడు మోటారు వాహనాల బిల్లుకు మోక్షం దక్కించడం తెలిసిందే. ఆ శాసన నిబంధనల ప్రకారం, నాసిరకం రోడ్ల నిర్మాణదారులకు విధించగల గరిష్ఠ జరిమానా- లక్ష రూపాయలు! అంతకు కొన్ని వందల రెట్లు లాభపడే అక్రమార్కులకు అదొక లెక్కా? పాడైనప్పుడల్లా మరమ్మతులు, ఆర్భాటంగా చేపట్టే అభివృద్ధి పనుల్లో కంతలు, ఎక్కడికక్కడ అవినీతి వాటావరణం... కోట్లు వెనకేసే నిరంతర పరిశ్రమగా స్థిరపడింది. మరి, అభాగ్యజనం గోడు పట్టించుకునేదెవరు?