ఉద్యోగుల హాజరు కోసమైనా, బ్యాంకుల్లో కస్టమర్ల అథెంటికేషన్ కోసమైనా, ఆధార్ వ్యాలిడేషన్ అయినా ఇమ్మిగ్రేషన్‌లో ప్యాసెంజర్లను అనుమతించేందుకైనా.. 'ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్' అనేది తప్పనిసరి సాధనంగా మారింది. గత కొంతకాలంగా వీటి వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో డిమాండ్ పెరిగి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేశాయి ఈ పరికరాలు.
అయితే కరోనా సంక్షోభం ఈ వ్యవస్థపై ప్రభావం చూపింది. ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్‌లో ప్రతీసారి వేలిని స్కాన్ చేయాల్సి రావడమే ఇప్పుడు సమస్యగా మారింది. సాధారణంగా వీటిని శుభ్రం చేయడం చాలా అరుదు. ఎక్కువ మంది చేతి వేళ్లను తాకించడం వల్ల స్కానర్లపై పెద్ద ఎత్తున బాక్టీరియా పేరుకుపోతుంది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో ఏదైనా ఉపరితలాన్ని తాకాలంటేనే భయాలు గుప్పుమంటున్నాయి.
దీంతో క్రమంగా వీటిని వదిలించుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రయాణికులు, ఉద్యోగులు, కస్టమర్ల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వేరే సాధనాలవైపు దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం కాంటాక్ట్‌లెస్ బయోమెట్రిక్ వ్యవస్థ, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ బయోమెట్రిక్ టెక్నాలజీ వంటి సాధనాలు అథెంటికేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
మాస్క్ ధరిస్తే..
వైరస్ నుంచి తగిన భద్రత కల్పించడానికి ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ బయోమెట్రిక్ సురక్షితంగా భావిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల్లో భౌతికంగా తాకాల్సిన అవసరం ఉండదు. గొంతు, ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తుంది. కానీ వైరస్ కారణంగా ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాల్సి వస్తోంది. కాబట్టి సాధారణ ఫేషియల్ రికగ్నిషన్‌కు కూడా ప్రస్తుతం సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అడ్వాన్స్డ్ ఫేషియల్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
థర్డ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్
వాయిస్ రికగ్నిషన్ సైతం థర్డ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌గా పనిచేస్తుంది. వ్యక్తుల వద్ద ఉన్న పాస్‌పోర్ట్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను ఫస్ట్ ఫ్యాక్టర్‌గా పరిగణిస్తారు. పాస్వర్డ్, పిన్ నెంబర్ వంటి వాటిని రెండో అథెంటికేషన్‌గా వ్యవహరిస్తారు.
ఈ సాంకేతికలను ఉపయోగించి సమర్థంగా వైరస్‌ను అడ్డుకోవచ్చు. వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించలేం కాబట్టి.. సరైన భౌతిక దూరం నిబంధనలను పాటించేందుకు ఈ సాంకేతికతలు ఉపయోగపడతాయి.