ఏ దేశ ఆర్థిక చరిత్ర పరిశీలించినా క్లిష్ట ఆర్థిక సంక్షోభాల్లోనే విశ్వవిఖ్యాత సంస్థలు ఉద్భవించాయి. విపత్కర పరిస్థితుల్లోనే కొత్త వ్యవస్థాపకులు సృజనాత్మకమైన ప్రపంచస్థాయి వ్యాపార సంస్థలను స్థాపించారు. ఈ కోవకు చెందినవే- అమెరికాలోని డిస్నీ (1923), జనరల్ మోటార్స్ (1908), మైక్రోసాఫ్ట్ (1975), నెట్‌ఫ్లిక్స్ (1997), ఆపిల్ ‘ఐ’ పాడ్ (2000), మొదలైనవి. ఈ సంస్థల వ్యవస్థాపకులు కొత్తగా వెలుగులోకి వచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించడమే గాక, ఆ దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చారు.
సృజనకు కొదవలేని భారత్
ఇండియాలో ఆరో దశకంలో హరిత విప్లవమూ వరస కరవు కోరల్లోనుంచి పుట్టినదే. ఎందరో స్వాప్నికుల కృషితో 1991 సంవత్సరం నుంచి సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి చెంది, నిరుద్యోగ నిర్మూలనకే కాదు- ఆర్థికాభివృద్ధికీ చేయూతనిచ్చింది. భారతదేశంలోనూ ఎందరో సృజనాత్మకమైన వ్యవస్థాపకులు ఉన్నారనే విషయం 'గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మానిటర్ (జీఈఎం)' పరిశోధనలో వెల్లడయింది. ఈ సంస్థ ఏటా 115 దేశాల్లో నుంచి పరిశోధనలు జరిపి, ఆయా దేశాల వ్యవస్థాపకుల స్థితిగతులను తెలుపుతుంది. 2019 గణాంకాల ప్రకారం, 20శాతం (18-64 మధ్య వయసు) భారతీయులు రానున్న మూడేళ్లలో వివిధ రకాల పరిశ్రమలు స్థాపించాలనే ఉత్సుకతతో ఉన్నారని నివేదించింది.
వ్యవసాయం తర్వాత ఎంఎస్ఎంఈలే..
భారత్‌లో 2006లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం ప్రవేశపెట్టి, పరిశ్రమలకు సరళీకృత వాతావరణాన్ని కల్పించారు. దాని ప్రభావంతో ప్రస్తుత గణాంకాల ప్రకారం సుమారు 6.50కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా దాదాపు 12 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ బృహత్తర కార్యక్రమం నూతనంగా ఉద్భవించిన వ్యవస్థాపకులతోనే సాధ్యమైంది. మనదేశంలో వ్యవసాయ రంగం తరవాత పెద్దయెత్తున ఉద్యోగావకాశాలు లభిస్తోంది ఈ రంగంలోనే. ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఊతమిచ్చేదిగానూ ఉంది. ప్రపంచంలో భారత్ సరళతరమైన వ్యాపారాలు చేయడంలో 2014వ సంవత్సరంలో 142వ స్థానంలో ఉంటే, 2019నాటికి 63వ స్థానానికి ఎగబాకింది. ఈ పురోభివృద్ధి కేవలం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధితోనే సాధ్యమైంది. ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం, దాదాపు మన జనాభాలో 62శాతం 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్నవారు.
ప్రస్తుత సంక్షోభంలో 'ఆత్మనిర్భర్ భారత్' ద్వార సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకిచ్చిన ప్యాకేజీ కేవలం నడుస్తూ ఆగిపోయిన తయారీ, సేవారంగాల్లో ఉండే పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వచనాలను ఈ సంవత్సరం మే నెలలోనే (ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో) సవరించారు. పరిశ్రమ పెట్టుబడి, వార్షికాదాయం ఆధారంగా ఈ మూడు రకాల పరిశ్రమలను నిర్వచించారు. ఈ సవరణలో మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడి రూ.50కోట్లకు, వార్షికాదాయం రూ.250కోట్లకు పెరిగింది. ఫలితంగా కొత్త వ్యవస్థాపకులు అధునాతన సాంకేతికతతో కూడిన మధ్యతరహా పరిశ్రమలు స్థాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది.