'నాకు ఇరవైనాలుగు మంది గురువులు' అని యదు మహారాజుకు చెప్పాడు దత్తాత్రేయుడు. 'ప్రకృతినుంచి పంచభూతాలనుంచి సూర్యచంద్రులనుంచి... పావురాలు కొండచిలువ మిడతలు తేనెటీగలు... అన్నింటినుంచీ పాఠాలు నేర్చాను' అన్నాడాయన. మనిషి అర్థం చేసుకోవాలేగాని- ప్రతి మనిషితో సంభాషణ, ఎదురయ్యే ప్రతి సన్నివేశం ఏదో పాఠాన్ని బోధిస్తూనే ఉంటుంది. ఆఖరికి కరోనా సైతం మనిషికి ఎన్నో నేర్పిస్తోంది. సదాచారాలను గుర్తుచేస్తోంది. వేదాంతాన్ని అలవరుస్తోంది. పై ముసుగులు తొలగిస్తోంది. 'నానాటి బ్రతుకు నాటకము... పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము' అన్న అన్నమయ్య పలుకుల్లోని ప్రగాఢ తాత్వికతను కరోనా బోధించినంత వేగంగాను, లోతుగాను మరెవ్వరూ మన తలకు ఎక్కించలేరు.
'కరోనా' పాఠాలు బోధిస్తోందా?
తల్లిదండ్రులను తరిమేస్తున్న కన్నబిడ్డలు, వైద్యులపై దాడి చేస్తున్న రోగులు, వద్దుపొమ్మంటున్న వల్లకాడు... ఇవన్నీ మన జీవితంలో వెలిసిపోతున్న రంగులు. కన్నీళ్లలో సైతం కనికరం లేని చప్పదనమే తప్ప, విషాదపు ఉప్పదనం లేకుండాపోవడం- డొల్లతనమే అవుతుంది! 'మనో రోగస్థుడై దేహి తాపూసిందేటిది, పూతలేటివి' అన్న ధూర్జటి ప్రశ్నకు లోపలి కుళ్లును దాచిపెట్టిన మనిషి ఏం చెబుతాడు? ఇన్నాళ్లుగా తెగ ఒలకబోసిన మమతానురాగాలు గంపలతో ఎత్తిపోసిన ప్రేమాభిమానాలను గుర్తుచేసి 'సదా మూఢత్వమేగాని తా చేసిందేటిది, చేతలేటివి- అని నిలదీస్తే ఏం బదులిస్తాడు? కరోనా ఎంతో విలువైన పాఠాలను బోధిస్తోందా, లేదా? 'రోగమూ ఒక గురువే' అని నిరూపిస్తోందా లేదా? 'ధర్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనులు దురితము లొందున్' అన్న భాగవత సూక్తిని గుర్తుచేసేలా దండనీతిని ప్రయోగిస్తున్నట్లే ఉంది. జాతి గుండెల్లో తనదైన శైలిలో చెరగని విషాదాన్ని ముద్రిస్తోంది. రాజుదైనా బంటుదైనా గమ్యం ఒకటేనని తేల్చి చెబుతోంది.
అలవడిన క్రమశిక్షణ