కరోనా మహమ్మారి విష కోరల బారినపడకుండా జనసామాన్యాన్ని కాచుకొని, తక్షణ వైద్య సేవలతో వ్యాధి సోకినవారిని రక్షించుకోవాలని ప్రపంచ దేశాలన్నీ శ్రమిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా 18 లక్షలు దాటిన కేసులతో.. లక్షా 12 వేల మందిని కబళించిన కరోనా, ఇండియాపైనా కసిగా కోరలు చాస్తోంది. మూడు వారాల లాక్‌డౌన్ ప్రకటనతో, కరోనా మృత్యు పాశాలకు చిక్కకుండా.. ఏకంగా ఎనిమిది లక్షల 20వేల మందిని కాపాడుకోగలిగామన్న కేంద్ర ప్రభుత్వం, కొవిడ్ వ్యాప్తి నిరోధకంగా మరో కొత్త జాగ్రత్తను ప్రతిపాదించింది.
పాన్ మసాలా, సుపారీ వంటి పొగాకు ఉత్పాదనల్ని నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కొవిడ్ విస్తరించే ప్రమాదం ఉందంటూ వాటి వినియోగాన్ని నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. బిహార్, ఝార్ఖండ్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, హరియాణా, నాగాలాండ్, అసోం ఇప్పటికే చొరవ చూపాయంటూ తక్కిన రాష్ట్రాలూ తక్షణ నిషేధం విధించాలని సూచిస్తోంది. 24 కోట్లకు చేరువైన ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో 5.3 కోట్లమంది ఏదో ఒక రూపంలో పొగాకును సేవిస్తున్నారని గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే నిగ్గుదేల్చింది.
గణాంకాలివే
సిగరెట్లు, బీడీల వాడకం తగ్గి ఖైనీ (15.9శాతం), గుట్కా (11.5), సుపారీ (10.2), పాన్ మసాలా (7.2శాతం)ల వినియోగం విస్తరించినట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యయనం చెబుతోంది. నోరు, అన్నవాహిక, క్లోమగ్రంథి క్యాన్సర్ల నుంచి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లదాకా ఎన్నింటికో దారితీసే పొగాకు సేవనం.. కొవిడ్ మహమ్మారికి ఆహ్వానం పలకడమే అవుతుందనడంలో సందేహం లేదు. పొగతాగేవారికి న్యుమోనియా వచ్చే అవకాశం 14 రెట్లు అధికమని కొవిడ్ రోగులపై సాగిన పరిశీలనే స్పష్టీకరించినప్పుడు, విశాల జనహితం దృష్ట్యా 'పగాకు' పైనే నిషేధం విధించే దిశగా విధాన రచనకు ఉపక్రమించక తప్పదు!