కొవిడ్ రెండోదశ (Corona Pandemic) తగ్గుముఖం పడుతున్నా జన జీవితాలు, ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావం కొనసాగుతూనే ఉంది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. మొదటి దశకు భిన్నంగా రెండో దశలో గ్రామాలకు ఎక్కువగా వ్యాప్తి చెందింది. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో వాటి పంపిణీ పట్టణాలు, గ్రామాల్లో సమాన స్థాయిలో సాగుతుందని ఆశిద్దాం. మొదటి, రెండో దశల్లో అభివృద్ధికి విఘాతం, ఆర్థిక అసమానతలు స్పష్టంగా కనిపించాయి. వీటిని అధిగమించి కొవిడ్ మూడు, నాలుగో దశలను సమర్థంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి.
పెచ్చరిల్లిన నిరుద్యోగం, పేదరికం
భారత వాస్తవ జీడీపీ 2019-20లో రూ.145.7 లక్షల కోట్లు. 2021-22 చివరికి కూడా మన జీడీపీ(GDP) సరిగ్గా ఇంతే ఉండవచ్చు లేదా కొంత తక్కువగానూ ఉండవచ్చు. కొవిడ్ కారణంగానే ఈ ఎదుగూబొదుగూ లేని పరిస్థితి ఏర్పడింది. రాబోయే సంవత్సరాల్లో ఏటా 12 శాతం వృద్ధి సాధిస్తే, 2026-27 నాటికన్నా భారత్ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలుగుతుంది. అందుకోసం మన ప్రభుత్వం గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. భారత్‌లో చాలాకాలంగా ఉన్న పేదరికం, అసమానతలు కొవిడ్ మొదటి దశలో మరింత పెరిగాయని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 'భారత్‌లో పని పరిస్థితులు-2021' పేరిట వెలువరించిన నివేదిక నిర్ధారించింది. కొవిడ్ వల్ల అదనంగా 23 కోట్లమంది పేదరికంలోకి జారిపోతారని హెచ్చరించింది. రెండో దశలో ఆదాయాలు తగ్గి, నిరుద్యోగం పెరిగిపోయిందని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) పేర్కొంది. 2021 మే నెలలో 93 శాతం కుటుంబాలు తమ ఆదాయాలు గతేడాదికన్నా తగ్గిపోయాయని వెల్లడించాయి. మే నెలలో నిరుద్యోగ రేటు 14.5 శాతానికి చేరుకుంది. గ్రామాల్లోనూ నిరుద్యోగం ప్రబలిందని సీఎంఐఈ వెల్లడించింది. 2021 ఏప్రిల్, మే నెలల్లో 2.27 కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయారు.
ఒక్క మే నెలలోనే 1.7 కోట్లమంది దినసరి కూలీలు, చిన్న వ్యాపారుల ఉపాధికి నష్టం వాటిల్లింది. కొవిడ్ రెండో దశలో(Covid-19 second wave) కార్మిక వర్గ కడగండ్లు ఎక్కువవుతాయని రిజర్వు బ్యాంకు అంచనా. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, పురపాలక ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ విధానాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వు బ్యాంకు బులెటిన్ సిఫార్సు చేసింది. కొవిడ్ మొదటి దశలో సిబ్బంది జీతభత్యాలు తగ్గినా, కంపెనీల లాభాలు పెరిగాయి. స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తుంటే, దినసరి కూలీలు, వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లు ఆదాయం కోల్పోయాయి. కొవిడ్ రెండో దశ కూడా ఆర్థిక అసమానతలను పెంచుతోంది.
ఉపాధి హామీ..
ఈయేటి బడ్జెట్‌లో ప్రతిపాదించిన అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్‌ఐ) ద్వారా దీర్ఘకాలిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు అందించాలి. ఇలాంటి ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచి, ఆదాయ అసమానతలను తగ్గిస్తాయి. కొవిడ్ మొదటి, రెండో దశల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి వేతన సబ్సిడీల వంటి ప్రత్యక్ష సహాయాలను అందించాలి. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం, విమానయాన రంగాలకు నిధులు సమకూర్చడానికి రిజర్వు బ్యాంకు ప్రకటించిన పథకాన్ని వేగంగా అమలు చేయాలి. ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి దండిగానే ఉండవచ్చు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. వలస కూలీలు పట్టణాలు వదలి రావడంతో గ్రామాలకు వారు పంపే నిధులు కోసుకుపోయాయి. ఫలితంగా ఆదాయాలు తగ్గి గ్రామీణులు తమకు కావలసిన వ్యవసాయేతర వస్తువులను కొనలేకపోతున్నారు. ఇది పట్టణ వ్యాపారాలు, పరిశ్రమల మీద, అవి కల్పించే ఉపాధిపైనా ప్రతికూల ప్రభావం ప్రసరిస్తోంది. ప్రభుత్వం గ్రామీణుల చేతిలో ఎక్కువ ఆదాయం మిగిలేలా చూసి గిరాకీ పెంచాలి. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో పేదలకు నగదు బదిలీ, ఆహార ధాన్యాల పంపిణీని వేగవంతం చేయాలి. గ్రామాల్లో, పట్టణాల్లో ఉపాధి హామీ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. పేదలకు కనీస ఆదాయం లభించేలా చూడాలి.
పెట్టుబడులు పెరగాలి