ప్రపంచవ్యాప్తంగా 62లక్షల మందితో మృత్యుక్రీడలాడుతున్న కరోనా ఇప్పటికే మూడు లక్షల 71వేల మందిని బలిగొంది. జన సమూహాలపై ఒక్కపెట్టున మృత్యుపాశాలు విసరి రెండు వారాలపాటు లక్షణాలు కనపడనీయకుండా ఈలోగా మరింత మందిని ఆశించే మహమ్మారి నుంచి ప్రజల్ని కాచుకోవడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌ను ఆశ్రయించాయి. దాంతో ప్రపంచ ఆర్థికమే గాడి తప్పి పెను మాంద్యంలోకి కూరుకుపోతోంది. ప్రజల ప్రాణాలతోపాటు వారి జీవనోపాధినీ కాపాడుకోవాల్సిన విషమ పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్ సోకినవారి సంఖ్య 600 దాటిపోయిన నేపథ్యంలో మార్చి 25నుంచి ఇండియా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. దాదాపు పదివారాల లాక్‌డౌన్ కాలంలో కరోనా కేసుల సంఖ్య రోజుకు ఎనిమిది వేలు దాటి ఉరుముతున్న వేళ కంటైన్‌మెంట్ జోన్లను మినహాయించి అంచెలవారీగా సాధారణ పరిస్థితుల పరికల్పనకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు వెలువరించింది. ఈ నెల ఎనిమిదో తేదీనుంచి తొలి అంచెలో ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్ వంటివన్నీ తెరుచుకోనున్నాయి. విద్యా సంస్థల పునఃప్రారంభంపై వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని.. సినిమాహాళ్లు, మెట్రో రైళ్లు, అంతర్జాతీయ ప్రయాణాలపై తుది అంచెలో పరిశీలన జరుగుతుందని కేంద్రం చెబుతోంది.
లక్షా 90 వేలకు చేరిన కేసులతో ఇండియా ఆసియాలోనే అగ్రస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం ముంబయి, చెన్నై, దిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణె, హైదరాబాద్ వంటి 13 ప్రాంతాలకే పరిమితమవుతున్నాయంటూ తక్కిన చోట్ల లాక్‌డౌన్ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎల్లకాలం దేశార్థిక వాణిజ్య కార్యకలాపాల్ని దిగ్బంధించడం సాధ్యం కాదు కాబట్టి ప్రజలే స్వీయ ఆరోగ్య సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్య పౌరులకే బాధ్యత మప్పుతోంది. దేశానికి కరోనా ముప్పు ఇప్పుడు మరింత తీవ్రమైంది!