మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. ఉంటుంది. ప్రతి వ్యక్తికీ ఏదో ఒక కళానైపుణ్యం ఉంటుంది. దాన్ని కొంతమంది గుర్తించరు. కొందరు గుర్తించినా- ఆ కళను సాధన చేసే అవకాశం లేదా పెంచుకోవడానికి కృషి చేసే వీలు ఏ కొందరికో గానీ దొరకదు. నూటికి తొంభైమంది ఇలాంటి వాళ్లే. సగం కాలిన కలల్ని కట్టలు కట్టలుగా కట్టి అటకమీద పెట్టిన వారే. ఎక్కడైనా తమ రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రదర్శన చూసినప్పుడు లేదా ఒక అరుదైన కళాకారుడు తారసపడినప్పుడు మనసులో బాధ బయలుదేరుతుంది. కంటి రెప్ప నుంచి సన్నని కన్నీటిచార బయలుదేరుతుంది. అది ఎండిపోయిన కలకు ప్రతీకలా బుగ్గమీదనుంచి జాలిగా జాలువారుతుంది. 'ఏమైనా సరే ఇంతకుముందులా కాదు... ఇకనుంచీ నా కళకోసం కొంత సమయం కేటాయించాలి' అనే ఊపు ఆ క్షణాన వచ్చేస్తుంది. ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనే ఆలోచనలు మొదలవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు అప్పటికప్పుడు సిద్ధమైపోతాయి. పకడ్బందీ ప్రణాళికలూ దొంతరలు దొంతరలుగా తాత్కాలికంగా కొత్త రూపం దాలుస్తాయి. ఆ రోజుకు అది ఎంతో తృప్తినిస్తుంది. కళ్ళనిండా కళ తొణికిసలాడుతుండటంతో ఆ రాత్రి హాయిగా నిద్రపట్టేస్తుంది. ఆ నిద్రలో అందమైన కల. ఆ కలలో మనం ఎంచుకున్న కళాశిఖరం ఇంకా అందంగా కనిపిస్తుంది. దానిపై మనమే విజయగర్వంతో జండా పాతుతున్నట్లు అనిపిస్తుంది. ఏవో అద్భుతాలు ఆవిష్కరించేస్తున్నట్లూ కనిపిస్తుంది. దాంతో హృదయం ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఆ పారవశ్యం ఎంతోసేపు ఉండదు. భళ్ళున తెల్లవారుతుంది. తీరా లేచి చూసేసరికి కళ్ళముందే కల కరిగిపోతూ కనిపిస్తుంది. స్పష్టాతిస్పష్టంగా ఊరిస్తుంది. ఆపై మళ్లీ యాంత్రిక జీవనం మొదలు. ఆ ప్రవాహంలో పడి సాగిపోతాం. 'సమస్యల మంది' ఎక్కువై 'కళాభిరుచి మజ్జిగ' పలచనైపోతుంది. మరో రెండు మూడు రోజులు అదే గుర్తుకువస్తుంది. ఆపై మళ్లీ స్మృతిపథంలో అడుగు పొరల్లో ఎక్కడో వెనక్కి వెళ్లిపోతుంది. అది మళ్లీ పైకి రావాలంటే మళ్లీ ఏదో ఒకటి తారసపడాలి.
ఇది ప్రతి ఒక్కరికీ అనుభవంలోనికి వచ్చే విషయమే. ఇది ఇంతే అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి! కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్లుగా మన కళలు కన్నీళ్లవెంట కారిపోవడానికి కారణాలూ చెప్పనలవి కానివి. అయితే, ఆ కలలు కేవలం కలలుగా మిగిలిపోకుండా కరోనా ఎంతో అవకాశాన్నిచ్చింది. అంతే కాదు.. చుట్టూ వాతావరణం ఎంతో ఆందోళనకరంగా, భయావహంగా ఉన్నప్పుడు మనిషికి ధైర్యాన్ని, మనసుకు ఊరటను ఇచ్చేది కళే. కళారాధనలో మనిషి తనను తాను కోల్పోతాడు. ఎందుకంటే అది ఆ వ్యక్తికి ఇష్టమైన పని కాబట్టి. అందులో మనసా వాచా కర్మణా ఏకాగ్రతతో లీనమైపోతాడు. అప్పుడు బాహ్యప్రపంచం, బాహ్యసంఘటనలు... ఇవేమీ తెలియవు. దీన్నే బ్రహ్మానందస్థితి అన్నారు రసవేత్తలు. కరోనా సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి ఆందోళనపడకుండా కళలు ఎంతోకొంత ఓదారుస్తున్నాయి. అంతర్జాలం వేదికగా సాహిత్యసమావేశాలు, కళాప్రదర్శలు జరుగుతూ అలరిస్తున్నాయి. మనిషికి ఆహారం, గాలి, నీరు లాంటివి శరీరాన్ని నిలబెట్టేవే. కానీ హృదయం ఉల్లాసంగా ఉండాలంటే వాటిని మించిన కళారాధన ఉండాలి. అది లేకపోతే జాతి అస్తిత్వాన్ని కోల్పోతుంది. అందరూ కరోనా వల్ల ఎంతో సమయం చిక్కింది కాబట్టి, ఆయా కళల్ని మరింత పెంచుకోవడానికి అవకాశం వచ్చింది అని భావిస్తుంటారు. కానీ, ఇప్పుడు కళాస్వాదన అనివార్యమయింది. బయట ప్రళయం ముంచుకొస్తుంటే దానికి ఎదురు నిలిచే ఆత్మస్థైర్యాన్ని కళ మాత్రమే ఇవ్వగలదు. అది సంగీతం కావచ్ఛు సాహిత్యం కావచ్ఛు అరవై నాలుగు కళల్లో ఏదో ఒకటి కావచ్ఛు అందుకే మనిషి ఇప్పుడు నిజమైన కళారాధకుడవుతున్నాడు.