భారతీయులు విద్యాఉపాధుల కోసం వెళ్లిన దేశాల్లో నేడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ తరంవారికన్నా ఎన్నో ఏళ్ల ముందే విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారత సంతతివారు కూడా కొవిడ్ విషపు నీడలో కలవరపడుతున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసి ప్రపంచమంతటా మూడు కోట్ల వరకు ఉంటారు. కరోనా వైరస్‌ను శీఘ్రంగా కట్టడి చేసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ కొత్త ఊపు తీసుకురాకపోతే వీరంతా మాతృదేశం ఆసరా కోసం ఎదురుచూస్తారు. ఇప్పటికే 130 కోట్ల పైచిలుకు జనాభాతో సతమతమవుతున్న భారతదేశానికి ఇది కొత్త సవాలు కానుంది.
స్వదేశంలో సరైన అవకాశాలు లేక భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాశ్చాత్య దేశాలకు బారులు తీరడాన్ని మేధావలసగా వర్ణించేవాళ్లం. సమాచార సాంకేతికత (ఐటీ) విస్పోటం తరవాత లక్షలాది భారతీయ నిపుణులను అమెరికా ఆకర్షించింది. మరోవైపు అనేకమంది కూలీలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ రెండు వర్గాలవారు పెద్దయెత్తున స్వదేశానికి పంపే విదేశమారక ద్రవ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారత సంతతి మొత్తం ఆస్తులు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని మించిపోయాయని అంచనా.
ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
అమెరికాకు లేదా గల్ఫ్ దేశాలకు భారతీయుల వలసలు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం కాకుండా స్వచ్ఛందంగా జరిగాయి. వీరిలో అత్యధికులు ఆయాదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల వద్ద తమ పేర్లు, చిరునామాలను అధికారికంగా నమోదు చేసుకోలేదు. విదేశాల్లో భారతీయుల నైపుణ్యం, కష్టించి పనిచేసే తత్వం అక్కడి ప్రభుత్వాల మన్ననలు అందుకున్నాయి. వారు స్వదేశానికి పంపే లక్షల కోట్ల రూపాయలు వారి కుటుంబాలకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ లాభించాయి. ప్రవాసుల కుటుంబాలు ఇళ్లు, పొలాలు, బంగారం కొనుక్కుంటే, ప్రభుత్వాలకు వాటిమీద పన్నుల ఆదాయం పెరిగింది. ఈ ఉభయ తారక లావాదేవీలవల్ల సర్కారుకు ప్రవాసుల బాగోగుల పట్ల ఆసక్తి పెరిగింది. విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక విభాగాలు తెరచింది. భారత్‌లోని రాజకీయ నాయకులు ప్రవాస భారతీయ సంఘాల నేతలతో సాన్నిహిత్యం పెంచుకుని, కీలక సమయాల్లో విరాళాలూ పొందుతున్నారు.
యుద్ధాలు, తిరుగుబాట్లు, ప్రకృతి ప్రకోపాల వల్ల విదేశాల్లో ప్రవాస భారతీయులకు; ఎప్పుడు ఏ కష్టం వచ్చినా భారతదేశం వారిని ఆదుకోవడానికి చప్పున రంగంలోకి దిగుతోంది. ఇది గతంలో ఎరుగని స్థితి. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బర్మా, ఉగాండా, కొన్ని కరీబియన్ దేశాల నుంచి ప్రవాసులు నిష్క్రమించాల్సి వచ్చినప్పుడు భారత సర్కారు నేరుగా జోక్యం చేసుకోకుండా, స్వదేశానికి వచ్చినవారికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టేది.
ఫిజీ వేధింపుల నాటి నుంచి..