ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి విద్యారంగాన్నీ వణికిస్తోంది. తక్షణం కొత్త పద్ధతులను అందిపుచ్చుకుంటే తప్ప మనలేని అనివార్యతను ముందుకు తెచ్చింది. బోధన అనగానే తరగతి గదుల్లో పదుల సంఖ్యలో కూర్చున్న విద్యార్థులను ఉద్దేశించి పాఠం చెప్పడమే అన్న అభిప్రాయం స్థిరపడింది. చాక్ పీస్, బ్లాక్ బోర్డు లేనిదే తరగతులు అసంభవమని, కాగితాలు కలాలు లేనిదే పరీక్షల నిర్వహణ అసాధ్యమని చాలామందికి ఓ బలమైన అభిప్రాయం ఉంది.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న విద్యా సాంకేతికత సాయంతో భౌతికంగా ఎదురుపడకుండానే విద్యార్థులకు నిశ్చింతగా పాఠాలు చెప్పొచ్చు, పరీక్షలు నిర్వహించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో దశాబ్దాలుగా ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు. భారత్‌లోనూ కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు సాంకేతికతను అందిపుచ్చుకుని వెబ్‌సెట్లు, అంతర్జాల అప్లికేషన్ల తోడ్పాటుతో తరగతులు నిర్వహించడంతోపాటు పరీక్షలూ పెడుతుండటం విశేషం.
విద్యార్థుల సర్వతోముఖ వికాసం
పరీక్షలు అనగానే బోధనరంగంలోని వారికి తెలిసిన ఒకే ఒక పద్ధతి... ప్రశ్నపత్రం ఇస్తే జవాబులు రాయడం! కాలానుగుణంగా అనేక కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని మనదేశంలో ఇంకా గుర్తించాల్సి ఉంది. ‘ఓపెన్ బుక్ పరీక్షలు’ సైతం ఉంటాయని, అవసరమైతే వాటిని కూడా ‘క్లోజ్డ్ బుక్ ఎగ్జామ్స్’ కంటే కఠినంగా నిర్వహించవచ్చునన్న విషయాన్నీ అధ్యాపకులు, ఉపాధ్యాయులు గమనించాలి.
కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం ప్రైవేటు రంగం మాత్రమే అందిపుచ్చుకుని నూతన విధానాలను వేగంగా అమలు చేయడానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకొనే విద్యార్థులకు కొత్త సాంకేతిక విధానాలతో మిళితమైన బోధన, పరీక్ష పద్ధతులను పరిచయం చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోంచే పాఠాలు వినాలంటే కంప్యూటర్, ట్యాబ్ లేదా అంతర్జాల సదుపాయం ఉన్న చరవాణి ఉండాల్సిందే! మరీ ముఖ్యంగా కావలసినంత అంతర్జాల డేటా సైతం తప్పనిసరి.
ఈ వసతులు ఇప్పటికే సమకూరి ఉంటే- ప్రభుత్వ విద్యా సంస్థల్లోనివారూ ఇంట్లోంచే విద్యాభ్యాసం చేయగలిగేవారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు విద్యార్థుల సర్వతోముఖ వికాసంపై దృష్టి పెట్టాలి. అభివృద్ధి చెందిన దేశాలు గడచిన పాతిక, ముప్ఫై ఏళ్లుగా విద్యారంగాన్ని సాంకేతిక హంగులతో పరిపుష్టం చేసుకుంటున్నాయి. పాఠశాల స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకు నూతన పరిశోధనలు చేస్తూ విద్యార్థులకు మెరుగైన బోధనలు, విజ్ఞానం అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నాయి.
మన దేశంలో ఇలా..
భారత్‌లో ఇప్పటికీ విద్యావ్యవస్థలో కనీస స్థాయి సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ నల్లబల్లపై చాక్‌పీసులతోనే పాఠాలు చెబుతున్నారు. అరుదుగా తప్ప ‘ఎల్‌సీడీ ప్రొజెక్టర్’ను ఉపయోగించడం లేదు. ఇలాంటి పద్ధతులు ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తి తక్కువగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇవ్వవచ్చు.
అలాకాకుండా ఒకవైపు విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఉపాధ్యాయ అధ్యాపక నియామకాలకు మరోవైపు పెద్దయెత్తున కోతపెడుతూ సాంకేతికతతో నిమిత్తం లేకుండా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకోవడమే అసలు సమస్య. వివిధ ప్రయత్నాలతో ఈ విద్యా సంవత్సరాన్ని ఏదో రకంగా గట్టెక్కించినా- వచ్చే ఏడాదికి మాత్రం కొన్ని కీలకాంశాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉంది.
ఏం చేయాలి?
ప్రాథమిక విద్య మొదలు విశ్వవిద్యాలయాల దాకా బోధన రంగంలోని అధ్యాపకులందరికీ అంతర్జాలం ద్వారా బోధనగరపడం, సమగ్రమైన ఎలక్ట్రానిక్ సమాచార నిధిని సిద్ధం చేయడం; అంతర్జాలంలోనే మూల్యాంకనం నిర్వహించడం వంటివాటిపై వీడియో సమావేశాలు, ప్రత్యేక కార్యశాలల ద్వారా శిక్షణ ఇవ్వాలి. విశ్వవిద్యాయాలు విద్యార్థులకు అంతర్జాలం ద్వారా చదువు నేర్చుకోవడానికి అవసరమైన మెళకువలు నేర్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌గానీ, ‘ట్యాబ్’గానీ ఇవ్వాలి.
భౌతిక దూరం తప్పనిసరి అయితే ఇకపై నిర్మించే తరగతి గదులను ఇప్పుడున్నవాటికంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ వైశాల్యంతో నిర్మించడంపైనా దృష్టి పెట్టాలి. సంస్థలో చదువుకునే విద్యార్థులందరినీ ఒకే రోజు రప్పించకుండా, సగం సగం చొప్పున రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యే విధంగా ప్రణాళికలు రచించాలి.