పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని డోలాయమానంలో పడిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ఉన్నారు. యునెస్కో తాజా నివేదిక ప్రకారం 191 దేశాల్లో 157 కోట్ల మందికి పైగా విద్యార్థులు కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్‌లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు 32 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొంతమంది పాఠ్యప్రణాళిక పూర్తిచేసి పరీక్షలు రాయడానికి సిద్ధమైన వేళ, మరి కొంతమంది సిలబస్ చివరి దశలో ఉన్న సమయంలో లాక్‌డౌన్ వచ్చిపడింది.
ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని కేంద్రీయ పాఠశాలలు రాష్ట్రాల పాఠశాలల్లోని విద్యార్థులను 6 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించగా మిగతా విద్యార్థులకు మిగిలిపోయిన సిలబస్ పూర్తిచేయడానికి, పరీక్షలకు సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక ఇతర విద్యా సంస్థలు ఆన్‌లైన్ పాఠాలు చెప్పడం ప్రారంభించాయి.
వెసులుబాటు కల్పించనున్న సిఫార్సులు
ఉన్నత విద్యారంగంలో 25 శాతం పాఠ్యప్రణాళికను అంతర్జాలం ఆధారంగా బోధించాలని, మిగతా 75శాతం ప్రణాళికను తరగతి గదుల్లో పూర్తిచేయాలని పలువురు ఉపకులపతులతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాని యూనివర్సిటీలు అంతర్గత పరీక్షలకు 50శాతం వెయిటేజీ ఇచ్చుకోవచ్చని, మిగతా మార్కులను గత సెమిస్టర్ ఆధారంగా ఇవ్వవచ్చని సూచించింది.
ప్రతి యూనివర్సిటీ వర్చువల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రయోగ పరీక్షలు, వైవా వంటివి వీలైనంతవరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సిఫార్సు చేసింది. కరోనా వైరస్ వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం పెంచాలని సూచించింది.
కోట్లాది పుస్తకాలు, జర్నల్‌లు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి రాగా విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్ మీడియా నిపుణులు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు అటుదిశగా దృష్టి సారించి సోషల్ మీడియా వేదికగా విద్యార్థులను ఆకర్షిస్తూ సిలబస్‌లో పాఠాలు ఏ విధంగా బోధించాలి, పాఠ్యాంశాల తయారీలో ఎటువంటి మార్పులు చేయాలని ఆలోచించి తక్షణమే అమలులోకి తేవాలి.
కంటెంట్ మాత్రమే సరిపోదు..
లక్షలాది ఈ-పుస్తకాలు అందుబాటులో ఉన్నా... ఏ తరగతి వారు ఏయే పుస్తకాలు చదవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు చదవాలి వంటి అవగాహన కలిగించే ప్రేరణ పాఠాలు అవసరం. డిజిటల్ తరగతుల్లో కేవలం కంటెంట్ మాత్రమే బోధిస్తూపోతే విద్యార్థులు అంతగా దృష్టి పెట్టడం కష్టం. సజీవ ఉదాహరణలతో బోధిస్తే శ్రద్ధగా వింటారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది పాఠశాలలు వర్చువల్ తరగతి గదులతో డిజిటల్ బోధన సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవే డిజిటల్ పాఠాలు విద్యార్థుల స్మార్ట్ ఫోన్లకు పంపించి, కొద్దిమంది ఉపాధ్యాయులు వాటిని నియంత్రిస్తూ పాఠాలు బోధించవచ్ఛు ఆన్‌లైన్‌లోనే రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులే తమ సమాధానాలు సరిచూసుకునే పద్ధతిలో లోటుపాట్లను సరిచేయవచ్చు.
ఆన్‌లైన్ బోధనకు ప్రాధాన్యం