గోరుచుట్టుపై రోకటి పోటులా దేశ వాహనరంగంపై దెబ్బమీద దెబ్బపడుతోంది. ఆర్థిక మందగమనం కారణంగా నిరుడు ద్వితీయార్ధంనుంచి దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు మందగించాయి. అనంతరం ఈ ఏప్రిల్‌లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వాహనాలన్నీ బీఎస్-4 నుంచి బీఎస్-6కి మారాల్సిన నిబంధనలు వచ్చిపడ్డాయి.
ఈ కష్టాలనుంచి కోలుకోకముందే కరోనా మహమ్మారి చావుదెబ్బ కొట్టింది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే పరిస్థితులన్నీ సద్దుమణిగి వాహన చక్రం మళ్లీ పరుగందుకుంటుందని భావిస్తున్న తరుణంలో ఒప్పంద కార్మికులు హడావుడిగా సొంత రాష్ట్రాలకు పయనమవుతుండటం వల్ల మరో చిక్కు సమస్య మొదలైందని పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వ అనుమతి రాగానే వాహన సంస్థలు ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాట పట్టడం కలవరపెడుతోంది.
అత్యధికులు వారే..
వాహనాల తయారీ, విడిభాగాల పరిశ్రమలు, డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లు, గ్యారేజీలు, స్పేర్‌పార్ట్‌ల దుకాణాలు- అన్నింటిలో కలిపి వాహనరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో అత్యధికులు అర్ధ నైపుణ్యం లేదా నైపుణ్యలేమి ఉన్న ఒప్పంద కార్మికులే. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అన్ని విభాగాల్లోని కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
కార్మికులకు ఉపాధి కరవైంది. చేతిలో చిల్లిగవ్వలేని గడ్డుపరిస్థితుల్లో శ్రామికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో వందల మైళ్ల దూరాన్ని లెక్కచేయక కాలినడకన బయల్దేరుతున్నారు. ఈ ప్రయాణంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, చాలామంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దుస్థితిపై అన్నివైపులా విమర్శలు పోటెత్తుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు కార్మికులను సొంత ప్రదేశాలకు తరలించేందుకు 70 రైళ్లు ఏర్పాటు చేశాయి. వెయ్యి మంది చొప్పున ఇప్పటికే 60 రైళ్లు వలస కూలీలను గమ్యస్థానాలకు చేరవేశాయి. తెలుగు రాష్ట్రాలతోసహా అనేక ప్రాంతాల్లో ఇంకా వేలమంది సొంత ప్రదేశాలకు వెళ్ళేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు.
ఈ రాష్ట్రాల్లో..
మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఆటోమొబైల్, ఆ అనుబంధ పరిశ్రమలు ఎక్కువ. ఈ రాష్ట్రాల్లో పనిచేసే ఒప్పంద కార్మికుల్లో ఎక్కువమంది ఉత్తర్ ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవాళ్లే. కేవలం ఆటో విడిభాగాల రంగాన్నే తీసుకుంటే ఇందులో యాభై లక్షల మంది పని చేస్తున్నారని అంచనా. అందులో డెబ్భైశాతం వరకు అర్ధ నైపుణ్యం, నైపుణ్యం లేని ఒప్పంద కార్మికులే ఉన్నారన్నది ‘అక్మా’ (ఆటొమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్) అంచనా.