దేశంలో చాలినన్ని ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అయిదు కోట్ల 30లక్షల టన్నుల ధాన్యం అందుబాటులో ఉందని, అందులో మూడు కోట్ల టన్నులు వరి కాగా- మిగిలినది గోధుమ అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల గణాంకాలు వెల్లడించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 76 లక్షల టన్నుల వరి, కోటి 38 లక్షల టన్నుల గోధుమ- మొత్తంగా కలిపి రెండు కోట్ల 14 లక్షల టన్నుల అదనపు నిల్వలు భారత ఆహార శాఖ వద్ద ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి.
ఇప్పుడు అవసరమైన దానికంటే చాలా పెద్దమొత్తంలోనే దేశంలో అదనపు ఆహార నిల్వలు పోగుపడ్డాయి. కానీ, ఇంత ధాన్యం మన గాదెల్లో మగ్గుతున్నా 20 కోట్లమంది ఆకలితో సతమతమవుతుండటమే విచిత్రం. పేదవాడి ఆకలి మాపాల్సిన ఆహార ధాన్యాలు గిడ్డంగులకే పరిమితమవుతున్న దుస్థితి మనముందుంది. రబీ పంట చేతికొచ్చే సమయమిది. 2019-20 కాలానికి దేశంలో ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 29.2 కోట్ల టన్నులుగా ఉండబోతోందని అంచనా. ఆ రకంగా నిరుటితో పోలిస్తే 67.4 లక్షల టన్నుల అదనపు ఉత్పత్తి దఖలుపడుతోందన్నమాట.
దేశాన్ని ఇప్పుడు ఒకవైపు ఆకలి, మరొకవైపు కరోనా వణికిస్తున్నాయి. మరీ ముఖ్యంగా దేశంలోని వలస కూలీలకు ఈ జంట ప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జాతి జనుల ఆకలి తీర్చగల స్థోమత ప్రభుత్వానికి ఉంది. అందుకోసం సర్కారీ వ్యవస్థలను సవ్యంగా పట్టాలకెక్కించాల్సి ఉంది.
సమాఖ్య స్ఫూర్తి వెల్లివిరిసేలా...
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), సమీకృత బాలల అభివృద్ధి కార్యక్రమా(ఐసీడీఎస్-అంగన్‌వాడీ)లకోసం దేశం నలుమూలలా పెద్దయెత్తున సిబ్బంది ఉన్నారు. వీటి నిర్వహణకోసం గడచిన 40 ఏళ్లకాలంలో పల్లెపల్లెలోనూ విస్తృతమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకోగలిగాం. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్‌కు 17 లక్షల సిబ్బంది ఉన్నారు. ఇది త్రివిధ దళాల మొత్తం సంఖ్యకన్నా ఎక్కువ. వీళ్లంతా సామాజిక సంక్షేమం కోసం పాటుపడుతున్న వీరులు. కరోనా ఉరుముతున్న ఈ తరుణంలో వలస కార్మికుల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. అసంఘటిత రంగం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
కరోనాపై యుద్ధమంటే ఎక్కడికీ కదలకుండా ఎవరికివారు ఇళ్లలో ఉండిపోవడమే! జిల్లానుంచి మరో జిల్లాకు, రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలసలు సాగితే తప్ప అసంఘటిత రంగానికి మనుగడ లేదు. వలస కూలీలు ఒక ప్రాంతంనుంచి మరో చోటికి వెళ్ళడానికి కారణం... ఆకలి! కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తలుపులు బిడాయించుకుని ఇళ్లలో కూర్చోకుండా అటు ఇటు తిరిగితే కరోనా కాటేసే ప్రమాదం ఉంది. ముందు చూస్తే నుయ్యి... వెనకకు వెళితే గొయ్యి లాంటి పరిస్థితి ఇది. కరోనాను కట్టడి చేస్తూనే.... వలస కూలీల ఆకలి సమస్యను తీర్చడమెలా అన్నదే ఇప్పుడు అతి పెద్ద సవాలు. ఈ యుద్ధంలో పీడీఎస్, ఐసీడీఎస్ సిబ్బందిని; వైద్య ఆరోగ్య మానవ వనరులను తొలి వరస సామాజిక సేనావాహినిగా తీర్చిదిద్ది ముందుకు దూకించాల్సి ఉంది.
ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో దేశంలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి వెళ్ళేందుకు వీరికి నియంత్రణలతో కూడిన అనుమతులు ఇవ్వాలి. అవసరమైన సాధన సంపత్తిని తీసుకువెళ్ళేందుకూ వీరికి తగిన అనుమతులివ్వాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిసలైన సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాలి. పేదలకు రుణ సదుపాయాలకోసం ఆర్‌బీఐ, కేంద్ర గిడ్డంగుల్లోని ఆహార ధాన్యాల సరఫరా కోసం ఎఫ్‌సీఐ చురుగ్గా రంగంలోకి దిగాలి. రుణ మొత్తాలను సమర్థంగా అర్హులకు చేర్చడం; ఆహార ధాన్యాలను లబ్ధిదారులకు సరఫరా చేయడం వంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో సాగాలి.