ప్రపంచ దేశాల వైఖరితో వాతావరణ మార్పుల సవాళ్లు అంతకంతకూ జటిలంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారం దక్కని సవాళ్లకు ఇటీవలి 'కాప్-26' వాతావరణ సదస్సు నిర్దిష్ట పరిష్కార మార్గం చూపుతుందని అంతా ఆశించారు. సదస్సు ప్రారంభంలో 'మీ అంతాన్ని మీరే కోరుకోకుండా... మార్పులను ఆహ్వానించండి' అంటూ డైనోసార్ చేసిన ప్రసంగ ప్రకటన ఉత్సుకతను రేపింది. చివరికి కోట్లమంది ఆశలపై నీళ్లు చల్లుతూ రెండు వారాల పాటు జరిగిన కాప్ సదస్సు దిశా నిర్దేశం లేకుండా ముగిసింది. వాతావరణ మార్పుల మూలంగా తలెత్తే అత్యంత దుష్ప్రభావాలను కట్టడి చేసే విషయంలో స్పష్టమైన కార్యాచరణను సదస్సు ప్రజల ముందుకు తీసుకురాలేకపోయింది. ప్రపంచ దేశాల నేతలు తమ వాగ్దానాలను చేతల్లో చూపించడంలో విఫలమయ్యారని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం.
విస్మరించిన ప్యారిస్ బాసలు
వాతావరణ మార్పుల పెను ప్రమాదాన్ని నిలువరించే కృషిలో సంపన్న దేశాల తీరు మొదటి నుంచీ ఊగిసలాట ధోరణితో ఉంటోంది. ప్రపంచ స్థాయిలో వాతావరణ మార్పుల ప్రమాదాలను నిలువరించేందుకు ఐరాసలో వాతావరణ మార్పుల విభాగం 1995లో ప్రపంచ దేశాల ప్రతినిధుల చర్చలను (కాప్) ప్రారంభించింది. అయిదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సామాజిక, ఆర్థిక, భౌగోళిక తారతమ్యాలు లేకుండా భూతాపాన్ని నిలువరించేందుకు పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేయాలని 196 దేశాలు వాతావరణ మార్పుల ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూతాపాన్ని రెండు డిగ్రీలకు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక చేయూత అందించడం అందులోని కీలకాంశాలు. ఈ శతాబ్దం చివరి నాటికి భూతాపంలో పెరుగుదల రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి పెరగకుండా కట్టడి చేయాలి. వీలయితే 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌కంటే దిగువకు తగ్గించే దిశగా యత్నించాలి.
సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాలపై ఖర్చు చేయడానికి నిరుపేద, వర్ధమాన దేశాలకు ఏటా సుమారు రూ.6.70 లక్షల కోట్ల నిధులను సంపన్న దేశాలు కేటాయించాలి. అయిదేళ్లకోసారి వివిధ దేశాలు సాధించిన ప్రగతిని సమీక్షించాలి. ఇప్పటిదాకా జర్మనీ, నార్వే, స్వీడన్‌లే నిధులు కేటాయిస్తుండగా- అగ్ర దేశాల వైఖరిలో స్పష్టత లేదు. కాప్ సదస్సులో దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని రెట్టింపు చేస్తామని సంపన్న దేశాలు హామీ ఇవ్వడం ఆశావహ పరిణామం. బొగ్గు, శిలాజ ఇంధనాల వినియోగంపై కట్టుదిట్టమైన నియంత్రణ విధించుకోవాల్సిన పెద్ద దేశాలు కాప్ వేదికగా నాటకీయంగా వ్యవహరించాయి. 2022 నాటికి బొగ్గు, శిలాజ ఇంధనాల ఉత్పాదకాలపై పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని 29 దేశాలు అంగీకారానికి వచ్చాయి.
బొగ్గు వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేసి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు సంపూర్తిగా మరలేందుకు సంపన్న దేశాలు సుదీర్ఘ కాలపరిమితి ప్రకటించడం ఉదాసీనతను చాటుతోంది. 2070 నాటికి నెట్‌జీరో లక్ష్యాన్ని చేరుకుంటామనే భారత లక్ష్య ప్రకటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బొగ్గు వినియోగం, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, చమురు నిల్వలపై ఆధారపడ్డ దేశాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నాయి.