వాతావరణ మార్పుల (climate change latest news) నిరోధానికి 1992లో ఐరాస ఆధ్వర్యంలో ఒక ప్రాతిపదిక ఒప్పందం కుదిరింది. దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)గా వ్యవహరిస్తున్నారు. ఐరాస ఒప్పందం, దానికి అనుగుణంగా 2015లో కుదిరిన ప్యారిస్ ఒప్పందం అమలుకు ప్రధాన నిర్ణయాలు చేసే అధికారం కాప్‌నకే ఉంది. కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించి, ఉత్తరోత్తరా నికరంగా శూన్య ఉద్గారాల (నెట్ జీరో) స్థాయికి చేరుకోవడం ద్వారా భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీలు దాటకుండా చూడాలని ప్యారిస్ ఒప్పందం తీర్మానించింది. ఇక్కడ నెట్ జీరో అంటే అన్ని దేశాలూ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని కాదు. కొన్ని దేశాలు భారీగా ఉద్గారాలను తగ్గించుకోవడం ద్వారా 1.5 డిగ్రీల లక్ష్యాన్ని ఆచరణ సాధ్యం చేయాలని అర్థం. వాతావరణ మార్పుల నిరోధానికి ఏటా 10వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ ఆర్థిక సహాయం అందించాలని ప్యారిస్ ఒప్పందం నిర్దేశించింది. వర్ధమాన దేశాలు హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టడానికి, వాతావరణ మార్పుల బారి నుంచి ప్రజల ప్రాణాలను, జీవనోపాధులను కాపాడటానికి ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని గ్లాస్గో నగరంలో నేటి నుంచి నవంబరు 12 వరకు జరిగే కాప్-26 సదస్సులో (COP-26 Conference programme) వివిధ దేశాధినేతలు, దౌత్యవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులంతా కలిపి దాదాపు 20,000 మంది పాల్గొంటారు.
ఉద్గారాలు పరిమితం..
భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలను మించితే పరిస్థితి చేజారిపోతుంది. వడగాడ్పులు, కుండపోత వర్షాలు, వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, పంట వైఫల్యాలు, పర్యావరణ సమతుల్యత కుప్పకూలడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయి. సగటు ఉష్ణోగ్రత పెరుగుదల రెండు సెల్సియస్ డిగ్రీలకు చేరితే 15.3 కోట్లమంది కేవలం వాయు కాలుష్యంతోనే చనిపోతారు. అందుకే ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్ 2050కల్లా అన్ని దేశాలూ కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలని పిలుపిచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగినా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశాన్ని తిరిగి ప్యారిస్ ఒప్పందంలో భాగస్వామిని చేశారు. ఒక గడువు లోపల సున్నా కర్బన ఉద్గారాల సాధనకు అన్ని దేశాలనూ ఒప్పించడానికి అమెరికా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. 2050కల్లా తమ కర్బన ఉద్గారాలను ఏ మేరకు తగ్గించేదీ భారత్, చైనాలు ఇంతవరకు స్పష్టం చేయలేదు. పాశ్చాత్య దేశాలు ఆర్థికాభివృద్ధి కోసం శతాబ్దానికిపైగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను మితిమీరి వినియోగించినందువల్లే ఇవాళ వాతావరణంలో కర్బన ఉద్గారాలు అలవికానంతగా పెరిగిపోయి భూతాపానికి కారణమవుతున్నాయని భారత్, చైనా గుర్తుచేస్తున్నాయి. అందుకు పరిహారంగా సంపన్న దేశాలు ఇంతవరకు ప్రకటించినదానికన్నా ఎక్కువ స్థాయిలో ఉద్గారాలను కట్టడి చేయాలని దిల్లీ, బీజింగ్ డిమాండ్ చేస్తున్నాయి. మొదట పూర్వ కాప్ సమావేశాల్లో ఒప్పుకొన్న ప్రకారం ఉద్గారాలను పరిమితం చేయాలని కోరాయి. వాస్తవంలో కాప్ సభలు వాతావరణ మార్పుల నిరోధానికి గంభీరమైన ప్రకటనలైతే చేస్తున్నాయి కానీ, వాటి అమలు మాత్రం నిరాశాజనకంగా ఉంది. గతంలో చేసిన నష్టానికి ఇప్పుడు పరిహారం చెల్లించాలని సంపన్న దేశాల ప్రభుత్వాలను కోరడం బాగానే ఉన్నా, ఆ పని చేసి తమ ఓటర్ల ఆగ్రహానికి ఎర కావడానికి ఏ ప్రభుత్వమూ ముందుకురాదు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తగ్గించడమంటే ఆర్థిక వృద్ధికి నీళ్లు వదులుకోవడమేనని ఆందోళన చెందుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కాప్-26 సదస్సు వాస్తవిక నిర్ణయాలు తీసుకోవాలి.
దృఢసంకల్పంతో ముందడుగు