తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజారోగ్యానికి సహకార వైద్యసేవల దన్ను - సహకార ఆసుపత్రుల సహకారం

ఆరోగ్యరంగంలో ప్రపంచ దేశాల డొల్లతనాన్ని బయటపెట్టింది కరోనా వైరస్​. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. మరెంతో మందిని ఇబ్బందులు గురిచేసింది. చాలా దేశాలు ఈ మహమ్మారి నుంచి గుణపాఠం నేర్చుకున్నాయి. ప్రజారోగ్యంపై కొన్ని దేశాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు సహకార దవాఖానాలు ఆవశ్యకత ఎంతో కీలకమని స్పష్టం అవుతోంది. వీటిలో వైద్యులే నడిపే వాటితోపాటు, సహకార సంఘాలు నడిపే ఆస్పత్రులూ ఉన్నాయి. తక్కువ ధరలకే మందులను విక్రయించే ఔషధ సహకార సంస్థలు, ఆరోగ్య బీమా అందించే సంస్థలూ ఉన్నాయి. ఈ విధంగా ప్రజారోగ్యాన్ని సంక్లిష్ట దశ నుంచి రక్షిస్తూ.. చేయూతనిస్తున్నాయి.

Cooperative medical services support public health
ప్రజారోగ్యానికి సహకార వైద్యసేవల దన్ను

By

Published : Jan 10, 2021, 7:05 AM IST

కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రజా వైద్య సేవలు పటిష్ఠంగా ఉండాలని జర్మనీ, జపాన్‌, వియత్నాం, దక్షిణ కొరియాల అనుభవం చాటి చెబుతోంది. భారత్‌లో సరిగ్గా ఆ సేవలే లోపించాయని మహమ్మారి బయటపెట్టింది. ప్రజారోగ్యంపై భారీగా పెట్టుబడులు పెట్టే స్థోమత ప్రభుత్వానికి లేక ప్రైవేటు ఆస్పత్రులకు ప్రవేశం కల్పిస్తే, అవి కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లులు వేసి భయపెడుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆస్పత్రులు అపరిశుభ్ర వాతావరణం, అరకొర వసతులతో రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజారోగ్యం సంక్లిష్ట దశలో పడిన ఈ సమయంలో పౌరులకు సమర్థ వైద్య సేవలు అందించడానికి సహకార ఆస్పత్రులు కీలకమని స్పష్టమవుతోంది. అవి ప్రజారోగ్యంతోపాటు వైద్యుల పని పరిస్థితులనూ ఎంతగానో మెరుగుపరుస్తున్నాయి. ప్రపంచమంతటా 10 కోట్ల మందికి సహకార ఆస్పత్రులు వైద్య సేవలు అందిస్తున్నట్లు 2018లో ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 76 దేశాల్లో 3,300 సహకార వైద్య సంస్థలు పనిచేస్తూ, భారీ టర్నోవరును సాధిస్తున్నట్లు వివరించింది. వీటిలో వైద్యులే నడిపే వాటితోపాటు, సహకార సంఘాలు నడిపే ఆస్పత్రులూ ఉన్నాయి. తక్కువ ధరలకే మందులను విక్రయించే ఔషధ సహకార సంస్థలు, ఆరోగ్య బీమా అందించే సంస్థలూ ఉన్నాయి.

ప్రపంచ దేశాల అనుభవం

కొవిడ్‌ వంటి మహమ్మారులు భవిష్యత్తులోనూ విరుచుకుపడవచ్చు. జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులూ పెరుగుతున్నాయి. వాటి నివారణ, చికిత్సలకు అయ్యే భారీ వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వాలే భరించడం సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సహకార ఆస్పత్రుల భావన ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది. బ్రెజిల్‌లో 85 శాతం భూభాగం సహకార ఆస్పత్రుల పరిధిలోనే ఉంది. అక్కడి యూనిమెడ్‌ సహకార ఆస్పత్రుల యంత్రాంగం బ్రెజిల్‌లోనే కాక యావత్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. అర్జెంటీనాలో 2001 ఆర్థిక సంక్షోభం అనేక ఆస్పత్రులను దివాలా తీయించినప్పుడు వాటిలో పనిచేసే వైద్యులే సహకార సంఘంగా ఏర్పడి ఆస్పత్రులు నడిపారు. ఆస్ట్రేలియాలో 1990లలో పెద్ద పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థలు ఆస్పత్రులను భారీయెత్తున కొనుగోలు చేసినప్పుడు, వైద్యులు సహకార సంఘాలుగా ఏర్పడి వృత్తిలో స్వేచ్ఛను కాపాడుకున్నారు. ఐరోపా ఖండంలో బెల్జియంలోని మందుల విక్రయ సంస్థల్లో 12 శాతం ఔషధ సహకార సంస్థలే. అవి 3,500 మంది సిబ్బందితో 22 లక్షల మందికి ఔషధాలను విక్రయిస్తున్నాయి. స్పెయిన్‌లో 70 శాతం మందుల విపణిని సహకార సంస్థలే శాసిస్తున్నాయి. ఇటలీ, కెనడా, జపాన్‌, సింగపూర్‌లలోనూ సహకార ఆస్పత్రులు, ఔషధ విక్రయ సంఘాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

మన దేశంలో ఇప్పటికే 5,000 పడకలతో 52 సహకార ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిని మరింత విస్తరించడానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా ఇటీవల ఆయుష్మాన్‌ సహకార్‌ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రామాల్లో ఆస్పత్రులను, సంబంధిత మౌలిక వసతులను నిర్మించడం కోసం సహకార సంఘాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌.సి.డి.సి.) రూ.10,000 కోట్ల మేరకు రుణాలు ఇస్తుంది. 1963లో పార్లమెంటు చట్టం కింద ఏర్పడిన ఎన్‌.సి.డి.సి. ఇంతవరకు సహకార సంఘాలకు 1.60 లక్షల కోట్ల రూపాయల రుణాలను అందజేసింది. ప్రజారోగ్య సంరక్షణకు పెట్టుబడులు పెంచడం, కొత్త వైద్య సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడం, రైతులకు స్వల్ప రుసుములకే వైద్య చికిత్స అందించడమనే లక్ష్యాలు 2017నాటి జాతీయ ఆరోగ్య విధానంలో ముఖ్యాంశాలు. ఆయుష్మాన్‌ సహకార్‌ ఈ విధానంలో అంతర్భాగమే.

కర్ణాటకలో మొదటి సారిగా...

ప్రైవేటు ఆస్పత్రులు నగరాలు, పట్టణాలకే పరిమితమవుతున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు భారీ ఆదాయమిచ్చే బహుళ వైద్యసేవల ఆస్పత్రుల నిర్మాణంపై చూపుతున్నంత శ్రద్ధ గ్రామాలపై కనబరచడం లేదు. ఈ పరిస్థితిలో తక్కువ ఖర్చుకు నాణ్యమైన వైద్య సేవలు అందించే సహకార ఆస్పత్రులు రంగప్రవేశం చేశాయి. మనదేశంలో మొట్టమొదటిసారి ఒక సహకార సంఘం నెలకొల్పిన ఆస్పత్రిగా కర్ణాటకలో 1951లో స్థాపితమైన జె.జి.సహకార ఆస్పత్రి-పరిశోధన కేంద్రాన్ని చెప్పాలి. ఆ సంస్థ దశాబ్దాలుగా పేదలు, దివ్యాంగులకు అవిరళ సేవలు అందిస్తోంది. ముంబయిలో శుశ్రూష పౌర సహకార ఆస్పత్రి 1966 నుంచి పనిచేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల మధ్య ఈ ఆస్పత్రి తనను తాను తృతీయ శక్తిగా వర్ణించుకొంటోంది. కేరళ, గుజరాత్‌, మహారాష్ట్రలలో చాలా కాలం నుంచే సహకార ఆస్పత్రులు పనిచేస్తున్నాయి.

అయితే, అన్ని సహకార ఆస్పత్రుల పనితీరూ దివ్యంగా ఉందని చెప్పలేం. నిర్వహణ ఖర్చులు పెరిగి వాటి లాభదాయకత దెబ్బతింటోంది. ఆయుష్మాన్‌ సహకార్‌ పథకం కింద సహకార ఆస్పత్రులకు నిధుల కొరతను తీర్చేందుకు ఎన్‌.సి.డి.సి. రుణాలు ఇవ్వనుండటం స్వాగతించదగ్గ పరిణామం. ఈ పథకం కింద సహకార ఆస్పత్రుల ఆధునికీకరణ, విస్తరణ, మరమ్మతులకు కూడా రుణాలు లభిస్తాయి. అలోపతితోపాటు ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి సంప్రదాయ చికిత్సా కేంద్రాల స్థాపనకూ రుణ సౌకర్యం లభిస్తుంది. దీనితోపాటు సహకార ఆస్పత్రులకు పన్నుల్లోనూ రాయితీ ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అందరికీ ఆరోగ్యం కల్పించాలనే ఐక్యరాజ్యసమితి లక్ష్యాన్ని సాధించడానికి సహకార ఆస్పత్రులు అమోఘంగా ఉపకరిస్తాయి.

కేరళ నేర్పే పాఠాలు

కేరళలో 1969లో స్థాపితమైన త్రిచూర్‌ జిల్లా సహకార సంఘ ఆస్పత్రి అక్కడ ఈ రంగంలో మొట్టమొదటిది. కేరళలో నాలుగు రకాల సహకార ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మొదటివి- వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నెలకొల్పినవి. ఇతర రంగాల నిపుణులు, పౌరులు ఏర్పరచినవి రెండో తరహాకు చెందినవి. ఇకపూర్తిగా సహకార సంఘాలే నెలకొల్పినవి, దాతృత్వ సంస్థలు ఏర్పరచినవి మూడు, నాలుగు తరగతుల కిందకు వస్తాయి. ఇవి పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాలకూ విస్తరించాయి. బాగా తక్కువ ఖర్చుకు వైద్య సేవలను అందించేందుకు విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి. కేరళలో కండాల సర్వీస్‌ సహకార బ్యాంకు నెలకొల్పిన సహకార ఆస్పత్రి చేపట్టిన పథకంలో సభ్యులైనవారికి రూ.5,000 వరకు ఉచిత వైద్య సేవలు లభిస్తాయి. పడకకు పరిమితమైపోయిన రోగుల ఇళ్లకు వైద్యులు, నర్సులు వెళ్లి ఉచిత వైద్యం అందించేందుకూ ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేరళ సహకార ఆస్పత్రులు తమ సభ్యులకు నామమాత్ర రుసుముపై 24 గంటల ఆంబులెన్స్‌ సర్వీసులు నడుపుతున్నాయి. మార్కెట్‌ ధరకన్నా 10-15 శాతం తక్కువ ధరకే మందులు అందిస్తాయి. ఈఎంఎస్‌ సహకార ఆస్పత్రి సామాజిక సేవను, వ్యాపార మెలకువలను చక్కగా మేళవిస్తోంది.

- వరప్రసాద్

ఇదీ చూడండి: కొత్త ఏడాదిని కాలగతిలో మేలిమలుపుగా మారుద్దాం

ABOUT THE AUTHOR

...view details