భిన్న భావాలు సంఘర్షించి, వికసించడానికి వేదిక కల్పించే సామాజిక మాధ్యమాలు(Social media) ప్రపంచ పౌరుల జీవితాల్లో విడదీయలేని భాగాలయ్యాయి. అదే సమయంలో నకిలీ వార్తలు- ఉగ్రవాద, మత విద్వేష భావాల వ్యాప్తికి వాహకాలవుతున్నాయి. నైజీరియా ప్రభుత్వం- ట్విటర్ తమ దేశంలో వేర్పాటువాదులను సమర్థిస్తోందని ఆరోపిస్తూ ఆ సంస్థ సేవలను నిరవధికంగా సస్పెండ్ చేసింది. అమెరికా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి సామాజిక మాధ్యమాలను ప్రత్యర్థి దేశాల గూఢచారి సంస్థలు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సామాజిక మాధ్యమాలు కొన్ని రకాల వాదాలకు, భావాలకు విస్తృత ప్రాచుర్యం కల్పిస్తూ, తమకు గిట్టని భావాలను తొక్కివేస్తున్నాయనే విమర్శా ఉంది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడి ఉండవచ్చనే అంశంపై చర్చ జరగకుండా సామాజిక సెన్సార్ చేశాయంటున్నారు. తన ట్వీట్లతో హింసను రెచ్చగొడుతున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను గతంలో తొలగించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి నియమ నిబంధనలను విధించే బాధ్యత, అధికారం శాసనకర్తలకే ఉంటాయి తప్ప ప్రైవేటు సాంకేతిక సంస్థలకు ఉండవని జర్మన్ ఛాన్స్‌లర్ మెర్కెల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ల ట్విటర్ ఖాతాల బ్లూ బ్యాడ్జిలను తొలగించడంపై వివాదం నెలకొంది. వీరిద్దరూ తమ ఖాతాలను చాలా కాలంగా ఉపయోగించకపోవడమే దీనికి కారణమని ట్విటర్ చెప్పుకొచ్చింది. నీలి ముద్ర ఉన్న ఖాతాలు అధికారికమైనవని, కార్యశీలమైనవని ఆ సంస్థ భాష్యం చెబుతోంది. వివాదం పెద్దదవుతుండటంతో ఆ రెండు ఖాతాలకు నీలి ముద్రను ట్విటర్ పునరుద్ధరించింది.
ట్వీట్లతో గాట్లు
భారత్‌లో రైతుల ఉద్యమాన్ని సమర్థిస్తూ స్వీడిష్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థున్‌బెర్గ్ చేసిన ట్వీట్‌పై పెద్ద రగడే రేగింది. థున్‌బెర్గ్ ఒక టూల్‌కిట్ గురించి తన ట్వీట్‌లో ప్రస్తావించడంతో దీని వెనక అంతర్జాతీయ కుట్ర ఉందంటూ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. మే నెల 18న టీమ్ భారత్ అనే ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్ టూల్ కిట్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు దర్శనమిచ్చాయి. మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ చేపట్టిన అజెండాను ఇవి బట్టబయలు చేస్తున్నాయని టీమ్ భారత్ ఖాతా ఆరోపించింది. వెంటనే భాజపా మంత్రులు, నాయకులు ఆ టూల్ కిట్ గురించి ట్వీట్లు చేశారు. ఇది నకిలీ టూల్ కిట్ అని కాంగ్రెస్ పార్టీ కొట్టివేసి, భాజపా నేతలపై దిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కేసులు నమోదు చేయించింది. మరోవైపు భాజపా నాయకులు టూల్ కిట్‌కు సంబంధించి తమ ట్వీట్లతో సమాచార, సామాజిక మాధ్యమాలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని ట్విటర్ వ్యాఖ్యానించింది. తన వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరినా అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో, దిల్లీ పోలీసులు మే 24న ట్విటర్ కార్యాలయాలను సందర్శించి నోటీసు ఇచ్చారు. ఇది ఆ సంస్థపై ఒత్తిడి పెంచే ఎత్తుగడ తప్ప మరేమీ కాదని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రభుత్వం పౌరుల భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని ట్విటర్ కోరింది. ఇదంతా మే 26 నుంచి కేంద్ర ప్రభుత్వ ఐటీ (మధ్యవర్తులకు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా) నైతిక నిబంధనావళి అమలులోకి రావడానికి ముందు జరిగింది. ఈ నిబంధనల ప్రకారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించడానికి ప్రత్యేక అధికారిని నియమించాల్సి ఉంది. అందుకు మూడు నెలల సమయం కావాలని సర్కారును ట్విటర్ కోరింది. గూగుల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, కూ, షేర్‌చాట్, లింక్డిన్‌లు మాత్రం సదరు అధికారి నియామకంతోపాటు ఇతర నిబంధనలను పూర్తిగానో, పాక్షికంగానో అమలు చేశాయి.
మూలంపై ఆరా