తెలంగాణ

telangana

ETV Bharat / opinion

న్యాయపాలిక అప్రమత్తతే జాతికి భరోసా!

ఈస్టిండియా కంపెనీ దుష్టపాలనకు వ్యతిరేకంగా 1857లో ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం- బ్రిటిష్‌ పాలకులు భారతదేశ పాలనా తీరులో పలు మార్పులు తీసుకొచ్చారు. ఒకవైపు ఆర్థిక దోపిడిని విస్తృతం చేస్తూనే, మరోవైపు భారత్‌పై పట్టు బిగించడానికి అనేక చట్టాలు రూపొందించారు. తదుపరి 50 ఏళ్లలో ఐపీసీ, సివిల్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లు, ఆస్తి చట్టాలు, పోలీసు విధుల నిర్వహణ, కేసుల్లో సాక్ష్యాధారాల సమర్పణకు సంబంధించి వివిధ చట్టాలు చేశారు. ఆ న్యాయ వ్యవస్థ భారతదేశ మానవ, సహజ వనరులను దోచుకోవడంలో బ్రిటిష్‌ వలస ప్రభుత్వానికి కొమ్ముకాసింది. మహాత్మాగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌, భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధులను విచారించిన తీరులో న్యాయమనేది ఏ కోశానా కనబడలేదు.

indian constitution
భారత రాజ్యాంగం

By

Published : Oct 24, 2021, 7:31 AM IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నవభారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధనల చట్రం రూపుదిద్దుకుంది. అదే భారత రాజ్యాంగం (Indian Constitution). ప్రభుత్వం, చట్టసభలు, న్యాయ వ్యవస్థల మధ్య సమతౌల్యాన్ని కాపాడటానికి రాజ్యాంగం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ప్రభుత్వం, దాని అధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్ర వ్యవస్థగా న్యాయవ్యవస్థను తీర్చిదిద్దింది. రాజ్యాంగ సర్వం సహాధిపత్యాన్ని కాపాడే బాధ్యతను ఉన్నతస్థాయి (Judiciary of India) న్యాయస్థానాలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక గడిచిన 74 ఏళ్లలో ప్రభుత్వ, శాసన వ్యవస్థలు ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చే సమర్థ పాలనను అందించలేక పోయాయి. ఫలితంగా ఈ రెండు వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. అయితే, న్యాయ వ్యవస్థ- ముఖ్యంగా ఉన్నతస్థాయి (రాజ్యాంగ) కోర్టులు మాత్రం ఇప్పటికీ రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాయి. అలాగని వాటి పనితీరు వంకపెట్టడానికి వీల్లేనిదనీ చెప్పలేం.

విలువల సంరక్షణలో..

స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి రెండు దశాబ్దాల్లో జమీందారీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచడానికి ఉపక్రమించినప్పుడు, కోర్టులు దానికి అడ్డుపడ్డాయి. అప్పట్లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కావడమే అందుకు కారణం. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు, జీవించే హక్కుకు భరోసా ఇచ్చే ప్రాథమిక హక్కు అత్యవసర పరిస్థితి ముగిసే వరకు తాత్కాలికంగా నిలిచిపోతుందని, దీనిపై ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్ళే అవకాశం పౌరులకు ఉండదంటూ ఏడీఎం జబల్పూర్‌ వర్సెస్‌ శివశంకర్‌ శుక్లా

కేసు(1976)లో అత్యంత తిరోగమన తీర్పు వెలువడినట్లు నిపుణుల భావన. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు. పైతీర్పును వ్యతిరేకించిన రాజ్యాంగ ధర్మాసన సభ్యుడు జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా స్వతంత్ర భావాలను అత్యవసర పరిస్థితిలో ఇందిరాగాంధీ ప్రభుత్వం సహించలేదు. ఆయన సీనియారిటీని కాదని, జూనియర్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. ఖన్నా దీన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు. ఇలాంటి కొన్ని అపశ్రుతులను మినహాయిస్తే సుప్రీంకోర్టు మొత్తం మీద రాజ్యాంగ విలువల సంరక్షణకు కట్టుబడిందనే చెప్పాలి.

పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నా- అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే సవరణలను కాని, ఇతర మార్పుచేర్పులను కాని చేయకూడదని 1973లో కేశవానంద భారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా తీర్పు ఇచ్చింది. కాలంతోపాటు మారవలసిన అవసరం ఉందని, అందుకు తగినట్లు రాజ్యాంగాన్ని సవరించడానికి 368వ రాజ్యాంగ అధికరణ పార్లమెంటుకు అధికారమిస్తోందని గుర్తిస్తూనే- ఏ సవరణ అయినా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, కీలక విలువలకు భంగం కలిగించకూడదని తేల్చి చెప్పింది. ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్‌ సిఫార్సు చేస్తే, దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్‌ నిర్ణయం దురుద్దేశాలతో కూడినదని నిర్ధారణ అయినట్లయితే, బర్తరఫ్‌ అయిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసు(1994)లో సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇది భారత ప్రజాస్వామ్య సమాఖ్య స్వభావాన్ని కాపాడిన తీర్పు. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని సుస్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుకు రాజ్యాంగం భరోసా ఇస్తోంది. ఈ ప్రాథమిక హక్కులో వ్యక్తిగత గోప్యత కూడా అంతర్భాగమని జస్టిస్‌ పుట్టస్వామి కేసు(2017)లో తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు వాటిని తూర్పారబట్టే హక్కు పాత్రికేయులకు ఉందని వినోద్‌ దువా కేసు(2021)లో సుప్రీంకోర్టు పేర్కొంది.

సాంకేతిక ఊతం అవసరం

ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను మార్చుకునేలా చేయడం పాత్రికేయుల వృత్తిధర్మం. వాళ్ల నోరు నొక్కడానికి రాజద్రోహ ఆరోపణలను బనాయించడం తగదు. పోలీసు యంత్రాంగం ప్రజల నమ్మకం చూరగొనాలని ఉద్ఘాటిస్తూ తదనుగుణమైన తీర్పులు వెలువరించింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రభుత్వాలు అంతర్జాలాన్ని, సామాజిక మాధ్యమాలనూ దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై, పాత్రికేయులు, మానవ హక్కుల ఉద్యమకారులు, చివరికి న్యాయమూర్తుల మీద సైతం నిఘాకు ప్రభుత్వాలు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాయని ఇటీవల పెద్దయెత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తాయి. దీనిపై ఉన్నతస్థాయి న్యాయస్థానాలు నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలి. కృత్రిమ మేధను, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తూ ప్రజల హక్కులను, రాజ్యాంగ పవిత్రతను కాపాడాలి.

అసమ్మతిని వెల్లడించే సాధనం

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్వాపరాలు, వ్యక్తిగత సంపద, నేర చరిత్ర వంటి వివరాలతో వారి నుంచి ప్రమాణపత్రాలను తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొని విచక్షణతో ఓటు వేసే అవకాశాన్ని పౌరులకు ఇవ్వడం కోర్టు ఉత్తర్వు పరమార్థం. నేరచరిత్ర ఉన్నవారిని అభ్యర్థులుగా ఎందుకు నిలబెట్టినదీ ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రజలకు తెలియజెప్పాలని కోర్టు ఆదేశించింది. పౌరులకు ఓటు హక్కు ఉన్నట్లే, ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రక్రియలపై అసమ్మతి తెలిపే హక్కూ ఉంటుందని గుర్తించి, ‘నోటా (పైవారెవరూ కాదు)’ మీటను ఉపయోగించే అవకాశాన్ని ప్రసాదించింది.

-డాక్టర్​ చెన్నుపాటి దివాకర్ బాబు

(రచయిత- ప్రిన్సిపల్, శ్రీమతి వి.డి. సిద్ధార్థ న్యాయ కళాశాల, విజయవాడ)

ఇదీ చూడండి:కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై సీజేఐ కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details