బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న తరవాత భారతదేశం 1949 నవంబరు 26న సగర్వంగా సొంత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుంది. స్వతంత్ర భారతావనికి పటిష్ఠ పునాది వేసిన ఆ చారిత్రక ఘట్టానికి నేడు 71వ వార్షికోత్సవం జరుపుకొంటున్నాం.
రాజ్యాంగ రచనా ప్రక్రియలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుచేతా కృపలానీ, సరోజినీ నాయుడు, బీఎన్ రావు, పండిట్ గోవింద వల్లభ్ పంత్, శరత్‌చంద్ర బోస్, రాజగోపాలాచారి, గోపాలస్వామి అయ్యంగార్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, గోపీనాథ్ బార్డొలోయ్, జేబీ కృపలానీ వంటి మహామహులు చురుగ్గా పాలుపంచుకున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, విస్తృతంగా చర్చలు జరిపిన మీదట భారత రాజ్యాంగాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ రచనా సంఘం రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో 141సార్లు చర్చలు, సమావేశాలు జరిపి మరీ రాజ్యాంగ పీఠికకు, 395 అధికరణలూ ఎనిమిది షెడ్యూళ్లకు తుది రూపునిచ్చింది.
కాలరేఖపై పురోగమనం
గత 71 ఏళ్లలో భారత రాజ్యాంగం అనేక మార్పుచేర్పులకు లోనై, 400కుపైగా అధికరణలు, 12 షెడ్యూళ్లకు విస్తరించింది. కాలంతో మారుతున్న పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి కావలసిన సవరణలను చేసుకున్నది. దీనివల్ల మన ప్రభుత్వ పాలన పరిధి ఎంతో విస్తరించింది. కాలం విసిరే సవాళ్లను ఎదుర్కోవడానికి మన రాజ్యాంగం వెన్నూదన్నూ ఇస్తోంది. అది ఏర్పరచిన పటిష్ఠ పునాదుల మీద భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో తనదైన విశిష్ట స్థానాన్ని సముపార్జించుకుంది. భారత రాజ్యాంగ లక్ష్యం- ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందించడమే. జాతి ఆశయాలను శాంతియుతంగా, ప్రజాస్వామికంగా అందుకోవాలనే నిబద్ధత మన రాజ్యాంగంలో ప్రతిఫలిస్తోంది.
భారత రాజ్యాంగం కేవలం ఓ చట్టపరమైన పత్రం కాదు. సమాజంలో అన్ని వర్గాల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భరోసా ఇచ్చే ముఖ్యమైన సాధనం. కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా దుర్విచక్షణలకు ఆస్కారం ఇవ్వకుండా పౌరులందరికీ సమానత్వం ప్రసాదిస్తోంది. తద్వారా ప్రగతి పథంలో భారతదేశం వడివడిగా దూసుకెళ్లడానికి పునాది వేసింది. దార్శనికులైన మన రాజ్యాంగ నిర్మాతలకు భారత జాతీయవాదం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది. గడచిన ఏడు దశాబ్దాల్లో మనం ఎన్నో మైలురాళ్లు దాటాం. గత ఏడు దశాబ్దాల్లో 17సార్లు లోక్‌సభ ఎన్నికలను, 300కుపైగా శాసనసభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించి ప్రపంచంలో అతి పెద్ద, విజయవంతమైన ప్రజాస్వామ్యంగా మన్ననలు పొందాం. కోట్లమంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలను అస్థిరతకు, అరాచకానికి తావులేకుండా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ, భారత ప్రజాస్వామ్యం తన పరిణతిని చాటుకొంటోంది. రాజకీయ అధికారం శాంతియుతంగా ప్రజాస్వామికంగా చేతులు మారగలదని పదేపదే నిరూపిస్తోంది.
శాసన, ప్రభుత్వ, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన భారత రాజ్యాంగ విశిష్ట లక్షణం. ఒక వ్యవస్థ అధికారాల పరిధిలోకి మరో వ్యవస్థ చొరబడే వీలులేదని రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు సర్వోన్నతమే కానీ, దానికి కూడా రాజ్యాంగ పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంటు పని చేస్తోంది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్నా, దాని మౌలిక స్వరూప స్వభావాలను మార్చడానికి మాత్రం వీల్లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 100కు పైగా సవరణలు జరిగినా, దాని మౌలిక స్ఫూర్తి చెక్కుచెదరలేదు.