కేంద్రంలో ప్రస్తుత పాలక పార్టీ భాజపాకు సంఘ్ పరివార్ వెన్నూదన్ను కాగా, ప్రతిపక్షం కాంగ్రెస్‌కు నెహ్రూ కుటుంబమే దిక్కూమొక్కు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ క్రమశిక్షణను మరచి, నిత్య కలహాల్లో మునిగితేలడం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే తంతు సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాలను చూస్తే- కాంగ్రెస్‌కు గెలుపు సాధించి పెట్టే సత్తా అధిష్ఠానంగా వ్యవహరించే పాలక కుటుంబానికి ఉందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని పటిష్ఠం చేసుకోవాల్సింది పోయి, లుకలుకలతో కాంగ్రెస్‌ను మరింత బలహీన పరచడానికే సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ అధిష్ఠానం మాటను లెక్కచేయడం లేదనే ఆరోపణలున్నాయి.
సిద్ధుతో ఘర్షణ..
పంజాబ్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కూ, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య ఘర్షణ వాతావరణం తారస్థాయికి చేరింది. కెప్టెన్ ప్రతిపక్షం అకాలీదళ్‌తో కలిసి రాష్ట్రంలో మాదకద్రవ్య మాఫియాను పెంచి పోషిస్తున్నారని, సిక్కుల మతగ్రంథం గురు గ్రంథ్‌సాహిబ్‌ను అపవిత్రం చేసిన ఘటనల్లో ఉభయుల హస్తం ఉందని సిద్ధూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అసమ్మతివాదులు ఈయన వెనక చేరారు. సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవికానీ, రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికానీ ఇవ్వాలంటూ అధిష్ఠానం సూచించినా సీఎం ససేమిరా అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా సిద్ధూతో సామరస్యంగా మెలగాలని అధిష్ఠానం సలహా ఇస్తున్నా కెప్టెన్ లెక్కచేయడం లేదు.
రాజస్థాన్‌లోనూ..
రాజస్థాన్‌లో సైతం ఇలాంటి గొడవే నడుస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సచిన్ నేతృత్వంలో 19మంది అసమ్మతీయులు గత ఏడాది మొదట్లో తిరుగుబాటు చేసినప్పుడు అధిష్ఠానం సయోధ్య మంత్రం జపించింది. అప్పట్లో సోనియాగాంధీ రాజస్థాన్ ప్రతిష్టంభనను అంతం చేయడానికి అహ్మద్ పటేల్, కె.సి.వేణుగోపాల్, అజయ్ మాకెన్‌లతో కమిటీని ఏర్పాటుచేశారు. గత నవంబరులో అహ్మద్ పటేల్ మరణంతో ఈ కమిటీ పక్కకు వెళ్లిపోయింది. మాకెన్ సయోధ్యకు యత్నించినా గెహ్లోత్, సచిన్‌ల మధ్య వైరం మరింత ముదిరింది.
గతవారం సచిన్ విధేయుడు హేమారాం చౌధరి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపడంతో పార్టీలో మళ్లీ కుంపటి రాజుకుంది. ఇంత జరుగుతున్నా గెహ్లోత్ పంతం వీడటం లేదు. సచిన్ వర్గానికి పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని ప్రియాంకాగాంధీ సూచించినా ఆయన లెక్కచేయడం లేదు. పైగా సచిన్ వర్గీయులు కొందరిని తనవైపు లాక్కోవడానికి యత్నిస్తున్నారు.