తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రైతు ఉద్యమంతో 'హస్తం'లో కొత్త ఉత్తేజం- మరి భాజపా?

సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించింది. అన్ని కార్పొరేషన్లలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాకుండా... 56 ఏళ్లలో తొలిసారి బఠిండా కార్పొరేషన్​ను గెలుచుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మరి సాగు చట్టాల ప్రతికూల పవనాలు భాజపాను రాజకీయంగా దెబ్బతీస్తాయా? త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ స్థానిక సమరంలో కాంగ్రెస్​కు అనుకూలంగా ఓట్లు రాబడతాయా?

Congress gets its first political dividend from farmers' agitation
కాంగ్రెస్​కు వరంగా రైతు ఉద్యమం.. భాజపా దారెటు?

By

Published : Feb 18, 2021, 7:13 PM IST

దిల్లీ సరిహద్దులో జరుగుతున్న అన్నదాతల ఉద్యమం ప్రభావం పంజాబ్ రాజకీయాలపై పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​కు లాభం చేకూర్చింది. ఆ రాష్ట్రంలో కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. హోషియార్పుర్, కపుర్​థలా, అబోహర్, పఠాన్​కోట్, బాటాల, బఠిండా, మొహాలీలో పూర్తి మెజారిటీతో గెలుపొందింది. ఇందులో బఠిండా కార్పొరేషన్ విజయం మాత్రం కాంగ్రెస్​కు నూతనోత్తేజం ఇచ్చేదే. 53 ఏళ్ల తర్వాత ఈ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం విశేషం.

ఖట్టర్​కు ముప్పు.. యోగి సేఫ్!

ఈ ఫలితాలు పొరుగున ఉన్న హరియాణా రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడి భాజపా ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు. హరియాణాలో ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. జన్​నాయక్ జనతా పార్టీ, ఏడుగురు స్వతంత్రులతో కలిపి ఎన్నికల తర్వాత ఈ కూటమి ఏర్పాటు చేసింది భాజపా. మనోహర్​లాల్ ఖట్టర్​ను సీఎంగా నియమించింది. పంజాబ్​ ఫలితాలు ఈ కూటమిని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. దీంతో పాటు కాంగ్రెస్ విజయం దిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఉద్యమానికీ కొత్త ఊపు ఇస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం యూపీకి ఈ ఫలితాల బెడద లేదని... పశ్చిమ యూపీలోని జాట్ సమాజాన్ని రాకేశ్ టికాయిత్ ఏకం చేసినప్పటికీ.. భాజపాను ఎదిరించేంత బలం వీరికి లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. వీరి ఉద్యమానికి మద్దతిచ్చే వారు కూడా రాష్ట్రంలో లేకపోవడం ఇందుకు మరో కారణమని స్పష్టం చేస్తున్నారు.

భాజపాకు నష్టమేనా?

అయితే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచే ప్రశ్న ఒకటే. రైతుల నిరసనలను కాషాయ దళం ఇప్పటిలాగే విస్మరించగలదా? అని. చట్టాలను రద్దు చేసేది లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. సవరణలకు మాత్రం అంగీకరిస్తామని చెబుతోంది. చట్టాల విషయంలో కేంద్రం మంకుపట్టు పట్టడం వల్ల భాజపాకు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో..!

నిజానికి పంజాబ్​లో భాజపా ప్రభావం తక్కువే. అయితే.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి సాగు చట్టాల వివాదం కూడా ఓ కారణమని మరిచిపోరాదు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనాడులో భాజపా పెద్ద పార్టీ ఏం కాదు. కానీ, అసోం, బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ రాష్ట్రాల్లో సాగు చట్టాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలీదు. కానీ.. ఎన్నికల్లో ఈ వివాదం మాత్రం తప్పకుండా చర్చనీయాంశంగా ఉంటుంది.

వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్​ పరిస్థితి?

ఈ విజయంతో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్​కు మరింత ఉత్సాహం లభించిన మాట వాస్తవమే. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో సీఎం అమరీందర్ సింగ్ సైతం కీలకంగా వ్యవహరించారు. కానీ ఈ విజయాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగించగలుగుతుందా అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో గుజరాత్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం పార్టీకి అంత సులభమేం కాదు. భాజపా కంచుకోటలో తలపడాలంటే కాంగ్రెస్ వీరోచితంగా పోరాడాల్సి ఉంటుంది.

హిందీ రాష్ట్రాల్లో రైతు నిరసనల ప్రభావం ఏ మేరకు ఉందనేది ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిరసనలనూ ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎంతవరకు ఉంటుందనేది తెలుసుకోవాలంటే మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందే.

(వర్గీస్ పీ అబ్రహం- ఈటీవీ భారత్ అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్)

ఇదీ చదవండి:అన్నాడీఎంకేపై పట్టు కోసం శశికళ న్యాయపోరాటం

ABOUT THE AUTHOR

...view details