సమకాలీన రాజకీయాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో కాంగ్రెస్(Congress News) తడబడుతున్నట్లు ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నిర్ణయం గందరగోళం సృష్టిస్తోంది. అంతర్గత కుమ్ములాటలకు అధిష్ఠానమే ఆజ్యం పోయడం పార్టీ(Congress News) ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారుతోంది. అర్ధ శతాబ్దానికిపైగా రాజకీయానుభవం కలిగిన నాయకుడు అవమానాలను భరించలేక ముఖ్యమంత్రి పీఠాన్నే వదిలేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడం దురవస్థకు నిదర్శనం. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్‌సింగ్(Congress Amarinder Singh) చేసిన రాజీనామా జాతీయ స్థాయిలో కలకలం రేపింది. కాంగ్రెస్(Congress News) అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయ నిర్ణయాలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయనే విమర్శలున్నాయి. ఎన్నికల వేళ పార్టీలో రగడ ప్రత్యర్థులకు ఆయుధంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో భాజపా నలుగురు సీఎమ్‌లను మార్చినా ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామంటూ పదవులు త్యజించి పక్కకు వైదొలగారు.
స్వయంకృతాపరాధాలే!
ఒక దశలో దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ ఇలాంటి అస్తవ్యస్త రాజకీయ నిర్ణయాలతో ఇప్పుడు విజయం కోసం తహతహలాడే పరిస్థితికి చేరుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ వేళ్లూనుకున్న వందేళ్లు పైబడిన పార్టీ మూలాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ప్రజలను, ముఖ్యంగా యువ ఓటర్లను, నవతరం నాయకులను ప్రభావితం చేయగలిగిన శక్తిని కోల్పోతోంది. శక్తిమంతమైన ప్రత్యర్థి ఎదుట ఉన్నప్పుడు మరింత బలాన్ని పుంజుకోవాల్సింది పోయి, రోజు రోజుకు బలహీనపడుతోంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ స్వయంకృతాపరాధాల అన్నది సుస్పష్టం. పార్టీ కేంద్ర నాయకత్వం సంవత్సరాలుగా అయోమయంలో ఉంటే, రాష్ట్రాల్లో నేతలు అంతర్గత విభేదాలతో స్వీయ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దీంతో 2022లో ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు, 2024లో లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సామర్థ్య ప్రదర్శనపై అటు ప్రజల్లోనూ ఇటు మిత్రపక్షాల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నేతను సిద్ధం చేసుకోవడంలో తడబాటు..
మూడేళ్లుగా సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షతనే పార్టీ నడుస్తోంది. సమగ్ర దిశానిర్దేశం లేక కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ పతనావస్థను వివరిస్తూ నేతను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని సీనియర్ నేతలు కొందరు అధినాయకత్వానికి లేఖల ద్వారా విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీకి ఎదురు నిలబడగలిగిన నేతను సిద్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ తడబడుతోంది. ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేయగలిగిన సైద్ధాంతిక భావజాలం కొరవడటం సమస్యగా మారింది. బలమైన ప్రాంతీయ నేతలను, సామర్థ్యం కలిగిన యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ విఫలమవుతోంది. భాజపా సహా ఇతర ప్రాంతీయ పార్టీలకు అండగా నిలుస్తున్న ఓటర్ల వర్గాలవంటివేవీ కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా లేకపోవడం ఇప్పుడు పెద్దలోటుగా మారింది. ఒకప్పుడు పేదలు, రైతులు, దళితులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు బలమైన రాజకీయ సందేశాలను అందించగలిగిన ఆ పార్టీని జడత్వం ఆవహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పిలుపిచ్చినా అది పూర్తిస్థాయి ప్రచారానికి నోచుకోవడం లేదు. ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం లేదు. రఫేల్ ఉదంతం, క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై రాహుల్‌గాంధీ గళం విప్పినప్పుడు పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు. సీనియర్లు నోరు మెదపలేదు. పైగా జైరామ్ రమేశ్, సల్మాన్ ఖుర్షీద్ వంటివారు మోదీ విధానాలను బహిరంగంగా సమర్థించారు. దీన్ని పార్టీ వైఫల్యంగానే గుర్తించాలి.
యువనేతల్లో నిరాశ