రూ.20 లక్షల కోట్లు! కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారీ ఆర్థిక ప్యాకేజీ విలువ. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్యాకేజీ గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత.... అందరికీ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతారని పలువురు భావించారు. అమెరికా వంటి అగ్రదేశాలు ప్రకటించిన ప్యాకేజీకి అనుగుణంగా ఉంటుందని అంచనా వేశారు.
అయితే భారత ప్రభుత్వం మాత్రం స్వల్పకాలిక అవసరాలకు నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటూనే దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టిసారించింది. కొవిడ్ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకుంది. భవిష్యత్తులో వృద్ధిని పెంచే విధంగా కీలక సంస్కరణలకు ఉపక్రమించింది.
అత్యంత తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు భారత్‌ను స్వర్గధామంగా మార్చడమే ఈ సంస్కరణల మొదటి లక్ష్యంగా కనిపిస్తోంది. పెట్టుబడులకు మరో గమ్యస్థానం కోసం అన్వేషిస్తున్న చైనాలోని మదుపర్లను మనవైపు ఆకర్షించడం వీటి ఉద్దేశమని స్పష్టమవుతోంది.
జీడీపీలో 2శాతం
నిజానికి.. దేశంలోని ప్రజలకు నగదు అందించే పథకాలనూ ప్రభుత్వం ప్రకటించింది. స్వల్పకాలిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పట్టణ, గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని, ఉచిత నిత్యవసరాలు, వంట గ్యాస్ అందిస్తోంది. ఇందులో చాలా వరకు లాక్డౌన్ ప్రారంభంలో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా ప్రకటించారు. తొలి మూడు విడతల ప్యాకేజీల్లో భాగంగా ఈ పథకాలను మరిన్ని రోజులు పొడిగిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. గణాంకాల ప్రకారం చూస్తే వీటి విలువ జీడీపీలో 2శాతానికిపైగా ఉంటుంది.
ఇక మిగతా ప్రకటనలను పరిశీలిస్తే.. వ్యవస్థలో ఉన్న కీలకమైన రంగాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ద్రవ్య విధానాన్ని రూపొందించిన విషయం స్పష్టమవుతోంది. ప్రైవేటు రంగ సంస్థల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడం ప్యాకేజీ ప్రయోజనాల్లో భాగంగా ఉంది.
అప్పటి ఫలాలు
కొవిడ్ అత్యవసర పరిస్థితులకు స్పందించడంలో భారత్ ఆదర్శవంతంగా వ్యవహరించింది. గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా రూ. 1.7 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేసింది.
ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం అంత సులభం కాదు. కొవిడ్ భృతి కోసం ప్రజలు నమోదు చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం ప్రకటన జారీ చేసినప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల సర్వర్లు మొరాయించాయి. ఒక్కసారిగా పెరిగిన ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోయాయి. అయితే మోదీ ప్రభుత్వం తొలి విడత అధికారంలోకి వచ్చాక జన్‌ధన్, ఆధార్ అనుసంధానం వంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రస్తుత నగదు బదిలీ కార్యక్రమాలు సాఫీగా జరిగిపోయాయి.
ఆదాయం సంగతి?
జీడీపీలో 70శాతం అప్పులతో, 6.5శాతం(రాష్ట్రాలతో కలిపి) సరాసరి ద్రవ్యలోటు ఉన్న భారత్.. అమెరికా, జపాన్ తరహాలో నగదు ఉద్దీపనలు ప్రకటించకుండా మంచి పని చేసింది.
అయితే కేంద్రం ప్రకటించిన పథకాలకు అదనపు బడ్జెట్‌ను ఎక్కడి నుంచి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయిదు రోజుల ప్రకటనలో భాగంగా ఆదాయ వనరుల గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. రెవెన్యూ వసూళ్లలో అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఆదాయ మార్గాలపై స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం అదనపు నగదును ముద్రించి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటుందా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. చివరకు పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టి వనరులను పెంచే అవకాశం లేకపోలేదు. రుణ పరిమితిని పెంచుతూ రూ. 4.28 లక్షల కోట్ల అప్పులు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్రానికి రుణాలు తీసుకొచ్చే వెసులుబాటు లేకుండా పోయింది.