ప్రపంచవ్యాప్తంగా కోటీ 80 లక్షలకు పైబడిన కేసులు, ఏడు లక్షలకు చేరువైన మరణాలతో కొవిడ్ మహమ్మారి అక్షరాలా మరణమృదంగం మోగిస్తోంది. డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించిన రోజునే తొలి కరోనా కేసు నమోదైన ఇండియాలో- బాధితుల సంఖ్య 17.5 లక్షలకు, మరణాలు 37 వేలకు పైగా పెరిగి భీతిల్లజేస్తున్నాయి. ఊహించినంత ప్రాణాంతకంగా లేని కరోనా వైరస్ ఊహాతీత స్థాయిలో చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరు శాస్త్రవేత్తలనే దిగ్భ్రాంతపరుస్తోంది. గాలి నుంచి కూడా కొవిడ్ వ్యాప్తి చెందుతుందన్న అధ్యయనాలు తీవ్రాందోళన కలిగిస్తుంటే, పలు దేశాల్లో కరోనా కట్టడి ప్రయోగాలు మానవ పరీక్షల దశకు చేరి- ఈ పీడ శాశ్వతంగా విరగడ అయ్యే మంచిరోజులపై నమ్మకానికి పాదు చేస్తున్నాయి. టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా విశ్వవ్యాప్తంగా 780 కోట్లమంది జనావళికి దాన్ని అందించడం ప్రపంచ దేశాలన్నింటికీ పెను సవాలుగా మారనుంది. టీకాల ఉత్పత్తిలో పేరెన్నికగన్న ఇండియా కరోనా వ్యాక్సినేషన్ ప్రయోగాల్లో ప్రభావశీలంగా దూసుకుపోతున్నవేళ- ప్రధాని మోదీ కరోనా టీకా విషయంలో నాలుగు మార్గదర్శక సూత్రాలను నెల రోజుల క్రితమే వెల్లడించారు. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు; కరోనాపై అలుపెరుగక పోరు సాగిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల వంటి యోధులకు, సాధారణ ప్రజానీకంలో సులువుగా కొవిడ్ కోరల్లో చిక్కుకోగల వర్గాలకు ప్రాధాన్య ప్రాతిపదికన టీకాలు అందాలని నిర్దేశించారు. దేశీయంగా ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 22 లక్షలు; పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది సంఖ్య 15 లక్షల పైమాటే. అరవయ్యేళ్లు పైబడ్డవారు 12కోట్లమంది, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎకాయెకి 35 కోట్లు! వెరసి దాదాపు 40 కోట్లమందికి 'ప్రాధాన్య' ప్రాతిపదికన టీకాను అందించాల్సి ఉన్నా, అందుకు సంబంధించిన సమగ్ర పంపిణీ ప్రణాళిక ఇంకా సిద్ధం కాకపోవడమే ఆందోళన కలిగిస్తోంది!
కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు ముందస్తు ప్రణాళిక - వ్యాక్సిన్
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అయితే పలు దేశాల్లో కరోనా కట్టడి ప్రయోగాలు మానవ పరీక్షల దశకు చేరి- ఈ పీడ శాశ్వతంగా విరగడ అయ్యే మంచిరోజులపై నమ్మకం కలిగిస్తున్నాయి. పూర్తి భరోసాతో వినియోగించగల సురక్షిత వ్యాక్సిన్లు ఈ సంవత్సరాంతానికిగాని వచ్చే ఏడాది మొదట్లోగాని వెలుగుచూస్తాయన్న విశ్లేషణల నేపథ్యంలో- అంచెలవారీగా ప్రాణాధార టీకాల్ని ప్రజలందరికీ చేరువ చెయ్యడం ప్రభుత్వాలకు అతిపెద్ద పరీక్ష కానుంది.
ప్రజానీకమంతా సురక్షితం కానిదే ఏ ఒక్కరూ ధీమాగా ఉండే వీల్లేదు (నోబడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవిరిబడీ ఈజ్ సేఫ్) అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యాక్సిన్ అలయెన్స్ వంటివన్నీ మొత్తుకొంటున్నాయి. సంపన్న దేశాలతోపాటే 92 దిగువ, మధ్యాదాయ దేశాలకు (వాటిలో ఇండియా కూడా ఉంది) కొవిడ్ టీకాలు సత్వరం సక్రమంగా సమాన ఫాయాలో అందాలన్న ఆశయంతో వ్యాక్సిన్ అలయెన్స్ పనిచేస్తోంది. ఎన్నికల రుతువులో ప్రాణరక్షక ఔషధాలన్నింటినీ అమెరికన్ల కోసం కొనేయడమే పునరధికారానికి బాటలు పరుస్తుందనుకొంటున్న ట్రంప్ ప్రభుత్వం- తమ దేశ వ్యాక్సిన్ తయారీ ప్రయోగశాలలపై చైనా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. నేటితో రెండో విడత మానవ ప్రయోగ పరీక్షలు చేసి, మూడోవిడత పరిశీలనలు జరుగుతుండగానే వ్యాక్సిన్ ప్రజావినియోగానికి పదో తేదీకల్లా అనుమతులు పొందాలని రష్యా ప్రణాళికలు అల్లుతోంది. అక్టోబరు నుంచి సామూహిక వ్యాక్సినేషన్‌కు రష్యా రంగం సిద్ధం చేస్తోంది. పూర్తిస్థాయి అనుమతులు రాకముందే చైనా- స్వచ్ఛందంగా ఆరోగ్య కార్యకర్తలు ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోగల వెసులుబాటు కల్పించింది. పూర్తి భరోసాతో వినియోగించగల సురక్షిత వ్యాక్సిన్లు ఈ సంవత్సరాంతానికిగాని వచ్చే ఏడాది మొదట్లోగాని వెలుగుచూస్తాయన్న విశ్లేషణల నేపథ్యంలో- అంచెలవారీగా ప్రాణాధార టీకాల్ని ప్రజలందరికీ చేరువ చెయ్యడం ప్రభుత్వాలకు అతిపెద్ద పరీక్ష కానుంది. ఎవరు ఎక్కడివారైనా అందరికీ వ్యాక్సిన్ అందాలని, సార్వత్రికంగా సరసమైన ధరకు దొరకాలని, తయారీ నుంచి వినియోగం దాకా సాంకేతికత దన్నుతో ప్రక్రియనంతా పారదర్శకం చెయ్యాలన్నది ప్రధాని మోదీ అభిమతం. తొలిదశలో ప్రాథమ్య వర్గాలకు అందించాల్సిన టీకాలపై మరేమాత్రం జాగు లేకుండా విస్తృత కార్యాచరణ వ్యూహాన్ని ముందస్తుగా సిద్ధం చేసి, సరఫరా వ్యవస్థను పటిష్ఠీకరించినప్పుడే కొవిడ్ కోరల నుంచి అశేష జనావళిని కాపాడగలం