తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ర్యాంకుల్లో తెలుగు వర్సిటీల వెనుకంజ.. కారణమేంటి?

విశ్వవిద్యాలయం అనేది మానవత్వానికి, సహనానికి, తర్కానికి, సాహసోపేతమైన ఆలోచనలకు, సత్యశోధనల కోసం నిలబడాలని ఆశించారు తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ. కానీ ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచంలోని మొదటి వంద అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో మనదేశం నుంచి ఒక్కటి కూడా చోటు సంపాదించలేదు.

concern about  higher education system
ఉన్నత విద్యకు ఏమిటీ దీనావస్థ?

By

Published : Jun 25, 2020, 8:36 AM IST

విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విజ్ఞాన నైపుణ్యాలను నేర్పడంతోపాటు సమాజ ప్రగతికి తోడ్పడతాయి. సామాజిక చైతన్యం తొణికిసలాడే పౌరులను, బాధ్యత కలిగిన నాయకులను తీర్చిదిద్దుతాయి. పరిశోధన పాటవాలతో అనేక నూతన సాంకేతిక ఆవిష్కరణలు, సమాజ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర వహిస్తాయి. దీనికి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతోపాటు, అభివృద్ధి చెందుతున్న చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలే నిదర్శనం. భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ... విశ్వవిద్యాలయం అనేది మానవత్వానికి, సహనానికి, తర్కానికి, సాహసోపేతమైన ఆలోచనలకు, సత్యశోధనల కోసం నిలబడాలని ఆశించారు. కానీ ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచంలోని మొదటి వంద అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో మనదేశం నుంచి ఒక్కటి కూడా చోటు సంపాదించలేదు.

సిబ్బంది కొరత

ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌.)- 2020' ప్రకారం దేశంలో తొలి స్థానాల్లో ఉన్న పది విశ్వవిద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర వర్సిటీ తప్పించి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయమూ లేదు. మొదటి వంద విశ్వవిద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం మూడు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆంధ్ర (19), ఉస్మానియా (29), శ్రీవెంకటేశ్వర (41) వర్సిటీలు మాత్రమే ఉన్నాయి. తమిళనాడు నుంచి 8, కర్ణాటక నుంచి 8, కేరళ నుంచి 3 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దేశంలో ఉన్న 513 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మొదటి రెండు వందల స్థానాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి గట్టిగా పది కూడా రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు లేకపోవటం విచారకరమైన విషయం. గడిచిన మూడేళ్ళుగా పరిస్థితి ఇలాగే ఉంది. మన రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 'నాక్‌' గుర్తింపు కూడా పొందలేకపోతున్నాయి. గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విధానాలు, పథకాల రూపకల్పన, వాటి మూల్యాంకనంలో ముఖ్య పాత్ర పోషించలేకపోతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వర్సిటీల నుంచి ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల విద్యా పరిశోధనల నాణ్యత దిగజారిపోతోంది. ఇది తెలుగు రాష్ట్రాల రేపటి పౌరుల భవిష్యత్తుకు, రాష్ట్రాల ప్రగతికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితికి అనేక కారణాలు తోడవుతున్నాయి. శాశ్వత అధ్యాపక నియామకాలు, నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉన్నత విద్య ప్రైవేటీకరణ వంటి సమస్యలూ ఇందుకు కారణమవుతున్నాయనే విమర్శలున్నాయి.

'ఎన్‌ఐఆర్‌ఎఫ్‌' విధానం ప్రకారం దేశంలో ఉన్నత విద్యా సంస్థలను వివిధ అంశాల ఆధారంగా వర్గీకరిస్తారు. అవి బోధన, శిక్షణ, వనరులు, అధ్యాపక-విద్యార్థుల నిష్పత్తి, అధ్యాపకుల పీహెచ్‌డీ, అనుభవం, పరిశోధన, వృత్తి సాధన, విద్యార్థుల విద్య ఉద్యోగ ఫలితాలు, విద్యార్థుల సమ్మిళితం, వివిధ దేశాల, రాష్ట్రాల విద్యార్థులు, స్త్రీ, వికలాంగుల, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు, చివరగా సదరు విద్యాసంస్థపై విద్యావేత్తలు, ఉద్యోగాలు కల్పించేవారి అభిప్రాయం. వీటిలో మన తెలుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు సామాజిక ఆర్థిక వెనకబడిన విద్యార్థుల సమ్మిళిత అంశం తప్ప మిగతా అన్నింటిలోనూ వెనకంజలోనే ఉన్నాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం శాశ్వత అధ్యాపకులు లేకపోవడమే. 2006-07లో చేపట్టినవే చివరి పూర్తిస్థాయి శాశ్వత అధ్యాపక నియామకాలు. ప్రస్తుతం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సుమారు 70 శాతానికిపైగా అధ్యాపకుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొన్ని విభాగాలు ఒక్కరితో లేదా అసలు శాశ్వత అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్ఛు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాశ్వత అధ్యాపకుని వద్ద ఎక్కువ మంది పీహెచ్‌డీ పరిశోధకులు ఉండటం వల్ల అధ్యాపకులపై అధిక భారం పడి పరిశోధనల నాణ్యత దిగజారుతోంది.

ప్రతిభావంతులకు దక్కని చోటు

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు శాశ్వత అధ్యాపకుల నియామకాలకు బదులు, తాత్కాలికంగా ఒప్పంద లేదా అతిథి అధ్యాపకులను నియమించి దశాబ్దకాలంగా కొనసాగిస్తున్నాయి. వేతనం శాశ్వత అధ్యాపకులకు ఇచ్చే జీతంలో మూడో వంతుకన్నా తక్కువ. వీరికి పీహెచ్‌డీ పరిశోధన పర్యవేక్షణలో, పరిపాలనలో అవకాశం ఉండదు. ఒప్పంద అధ్యాపకులు బోధన, పరిశోధనల మెరుగుదలపై శ్రద్ధ చూపించే అవకాశం తగ్గుతోంది. ఈ నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన, తక్కువ జీతాలతో, ఒప్పందంతో కూడినవి కావటం వల్ల బోధన, పరిశోధనల్లో ఆసక్తి ఉన్న అర్హులైన ప్రతిభావంతులు ఎంతోమంది వీటికి దరఖాస్తు చేసుకోకుండా వేరే శాశ్వత ఉద్యోగాలకు, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పని చేస్తున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రతిభావంతులైన అధ్యాపకులు కరవై విద్య, పరిశోధనలు కుంటువడుతుండటంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బతింటోందనే విమర్శలున్నాయి. 2017-18లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 14 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,109 శాశ్వత సహాయ ఆచార్యుల నియామకాలు ప్రారంభించింది. ఏపీపీఎస్సీతో 'కామన్‌' వడపోత పరీక్షను 2018 ఏప్రిల్‌లో నిర్వహించి సెప్టెంబర్‌లో ఫలితాలు వెల్లడించారు. మొత్తం 25 వేలకుపైగా అభ్యర్థులు రాసిన ఈ పరీక్షలో సుమారు 3,500 మంది మౌఖిక పరీక్షకు అర్హత సాధించారు. దురదృష్టవశాత్తు మౌఖిక పరీక్షలు జరగకుండానే నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నియామకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానాలలో పలు కేసులు నడుస్తుండటం వల్ల అర్హత సాధించిన అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడం వీలు కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో శాశ్వత అధ్యాపకుల నియామకాలు నిలిచిపోయి బోధన, పరిశోధనలు కుంటుపడి, జాతీయ ర్యాంకుల్లో వెనకబడి, 'నాక్‌' గుర్తింపు పొందలేక, కేంద్ర నిధులు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తెచ్చే దిశగా కృషి చేయాలి. పారదర్శక పద్ధతిలో శాశ్వత అధ్యాపకుల నియామకాలను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలి. వర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాలి. విద్య, పరిశోధనల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. దేశంలో అత్యున్నత విశ్వవిద్యాలయాల సరసన తెలుగు రాష్ట్రప్రభుత్వ వర్సిటీలూ చోటు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

- డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు (విద్యారంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details