తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఈ టెక్నిక్స్​ తెలిస్తే జాబ్​ గ్యారంటీ..! - ఎంప్లాయిమెంట్​ న్యూస్​

పోటీ పరీక్షల్లో ఇచ్చే సమయం తక్కువ.  చేయాల్సిన గణిత సంబంధ ప్రశ్నలు ఎక్కువ. అభ్యర్థులు వేగంగా, కచ్చితంగా  జవాబులు గుర్తించితీరాలి. దీనికి బెంబేలు పడనవసరం లేదు. టెక్నిక్స్‌ నేర్చుకుంటే సరి.  మరి  మెదడు పాదరసంలా చురుగ్గా పనిచేస్తూ చకచకా లెక్కలు చేసేయాలంటే- ఏమేం నేర్చుకోవాలి?

comitative exam techniques
Telangana news

By

Published : Apr 26, 2021, 10:00 AM IST

బ్యాంకింగ్‌, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రైల్వే, ఇన్సూరెన్స్‌ మొదలైన రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ అవుతుంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంస్థల్లో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష నియామకాలు జరుగుతుంటాయి. ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు పోటీ తీవ్రంగానే ఉంటుంది.

బ్యాంకింగ్‌ పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలు, రైల్వే, ఇన్సూరెన్స్‌ పరీక్షలు దాదాపు 70-80 శాతం ఒకే తరహాలో ఉంటాయి. సబ్జెక్టులు, సిలబస్‌, పరీక్షా విధానంలో చాలా పోలికలుంటాయి. అందువల్ల అభ్యర్థులు సాధారణంగా ఈ పరీక్షలన్నింటికీ ఉమ్మడిగా సిద్ధమవుతూ ఉంటారు. వీటన్నింటిలోనూ ఉండే సబ్జెక్టులు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మ్యాథమేటిక్స్‌), రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌.

ఎక్కువ ప్రశ్నలు.. తక్కువ సమయం

పరీక్షలన్నింటిలో ప్రశ్నల సంఖ్య ఎక్కువగానూ, వాటికి కేటాయించే సమయం తక్కువగానూ ఉంటుంది. సాధారణంగా 100 ప్రశ్నలను ఒక గంట సమయంలో సాధించాల్సి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్ననూ సాధించడానికి సుమారు అర నిమిషం వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువల్లే అభ్యర్థులందరూ ఈ పరీక్షల్లో తక్కువ సమయం ఉంటుందనే భావనతో ఆందోళన చెందుతుంటారు. అయితే వీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే... అన్ని సబ్జెక్టుల్లోని ప్రశ్నలన్నిటికీ ఎక్కువ సమయమేమీ పట్టదు. కొన్నింటికి మాత్రమే ఎక్కువ సమయం అవసరమవుతుంది.

క్వాంట్‌ ఆప్టిట్యూడ్‌ కీలకం
సబ్జెక్టులన్నింటిలో గణిత శాస్త్రం లేదా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. అలాగే దీనిలో జవాబు కచ్చితంగా తెలుసుకునే అవకాశంతోపాటు ఎక్కువ మార్కులు పొందే వెసులుబాటూ ఉంటుంది. అందుకుని ఈ సబ్జెక్టు కేవలం పైన పేర్కొన్న పరీక్షల కోసమే కాకుండా దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్లే గణిత సబ్జెక్టులో ఎక్కువ పట్టు సాధించిన అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు చాలా అధికం.

సాధన చాలా ముఖ్యం

షార్ట్‌కట్‌ పద్ధతులు, స్పీడ్‌ మ్యాథ్స్‌ టెక్నిక్‌లు చాలా నేర్చుకున్నా వాటికి సాధన చాలా ముఖ్యం. బాగా సాధన చేసినప్పుడే వాటిని ఏయే సమయంలో ఏయే ప్రశ్నలకు ఉపయోగించాలో అర్థమవుతుంది. అది తెలియనప్పుడు వాటిని ఎంత బాగా నేర్చుకున్నా పరీక్షల్లో ఫలితముండదు. ఈ విధంగా అన్ని పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన మ్యాథమేటిక్స్‌/ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టుకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ సమయం పట్టే దీనిలో ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు సాధించగలిగినప్పుడు తక్కువ సమయం పట్టే ఇతర విభాగాలను నిర్ణీత సమయంలో పూర్తిచేయగలుగుతారు.

వేగంగా ఎలా సాధించాలి?

షార్ట్‌కట్‌ పద్ధతులు:అకడమిక్‌ పరీక్షల్లో జవాబు సాధించే క్రమాన్ని తెలియజేసే విధానంలో మార్కులు కేటాయిస్తారు. అయితే పోటీ పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండటం వల్ల ఏది సరైన జవాబో గుర్తిస్తే సరిపోతుంది. ఇక్కడ జవాబు ఏ విధంగా వచ్చిందో తెలియజేసే క్రమానుగతి అవసరం లేదు. అందువల్ల ప్రశ్నను త్వరగా సాధించి జవాబును చేరుకునే వివిధ షార్ట్‌కట్‌ పద్ధతులను ఉపయోగించాలి. అంకగణితంలో ఎక్కువ షార్ట్‌కట్‌ పద్ధతులను ఉపయోగించే వీలుంటుంది. ఒక ప్రశ్నను ఒకటి కంటే ఎక్కువ పద్ధతుల్లో సాధించగలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ షార్ట్‌కట్‌ పద్ధతులన్నీ మూల భావనల (Basic concepts) నుంచే ఉంటాయి. అందువల్ల విద్యార్థులు అన్ని టాపిక్స్‌ మూల భావనలను బాగా నేర్చుకోవాలి.

స్పీడ్‌ మ్యాథ్స్‌ టెక్నిక్స్‌: అకడమిక్‌ తరగతుల్లో గణిత శాస్త్రానికి మూల స్తంభాలైన కూడిక, తీసివేత, గుణకార, భాగహార పద్ధతులను సాంప్రదాయిక పద్ధతుల్లో నేర్చుకుంటారు. వీటిని ఉపయోగిస్తూ చేసే కాల్‌క్యులేషన్స్‌కు సహజంగానే ఎక్కువ సమయం పడుతుంది. అయితే వీటిని తక్కువ సమయంలో వేగంగా చేయగలిగే స్పీడ్‌ మ్యాథ్స్‌ పద్ధతులు, వేద గణిత పద్ధతులు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల సమయం ఎంతో ఆదా అవుతుంది. దీనివల్ల పోటీ పరీక్షల్లో నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు సాధించవచ్చు.

- డా. జీఎస్‌ గిరిధర్‌

ఇదీ చూడండి:జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు

ABOUT THE AUTHOR

...view details